రాజకీయాలు లేవు.. కుల కోణం లేదు.. పవన్ కళ్యాణ్ భేటీపై రంగనాథ్ స్పష్టత
హైదరాబాద్‌లోని అక్రమ కట్టడాల కూల్చివేతలపై హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తుండటంతో వస్తున్న ఒత్తిడిని ఆయన ప్రస్తావించారు.
By: A.N.Kumar | 22 March 2026 10:47 AM ISTసోషల్ మీడియా లో.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భేటీపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. ఈ సమావేశం చుట్టూ అల్లుకున్న కుల, రాజకీయ ఊహాగానాలకు రంగనాథ్ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ద్వారా తెరదించారు. తన పర్యటన వెనుక ఎలాంటి రహస్య అజెండాలు లేవని.. అది కేవలం పాత పరిచయంతో జరిగిన మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.
పదేళ్ల పరిచయం.. ఒక మర్యాదపూర్వక కలయిక
పవన్ కల్యాణ్‌ను మంగళగిరిలో ఎందుకు కలిశారన్న ప్రశ్నకు రంగనాథ్ చాలా సుటిగా సమాధానం ఇచ్చారు. మెగా స్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ కుటుంబంతో తనకు గత పదేళ్లుగా సాన్నిహిత్యం ఉందని ఆయన గుర్తు చేశారు. "ఆ రోజు నేను ఒక కుటుంబ వివాహ వేడుకకు హాజరుకావాల్సి ఉంది. ఆ ఫంక్షన్ హాల్ పవన్ కల్యాణ్ గారి క్యాంప్ కార్యాలయానికి అత్యంత సమీపంలోనే ఉండటంతో ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన శుభసందర్భంగా వ్యక్తిగతంగా కలిసి అభినందనలు తెలపాలని అనుకున్నాను. అది కేవలం ఒక మర్యాదపూర్వక భేటీ మాత్రమే. ఇందులో ఎలాంటి రాజకీయ చర్చలు లేవు," అని రంగనాథ్ వివరించారు. గతంలో ఈ భేటీ రెండు గంటల పాటు సాగిందని, భూ సమస్యలు, హైడ్రా విధివిధానాలపై చర్చలు జరిగాయని వచ్చిన వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని ఆయన తేల్చి చెప్పారు.
కుల కోణంపై ఘాటు స్పందన
ఈ భేటీని కుల కోణంలో చూడటంపై రంగనాథ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సమాజంలో కులాన్ని పూర్తిగా వేరు చేయడం సాధ్యం కానప్పటికీ తన విధి నిర్వహణలో దానికి తావు లేదని చెప్పారు. కుల సంఘాల సమావేశాలకు హాజరవుతున్నారన్న విమర్శలపై స్పందిస్తూ.. బీసీ, ఎస్సీ వర్గాల ప్రజలు సామాజిక హితం కోసం, అభివృద్ధి కోసం చర్చించుకోవడంలో తప్పులేదని అభిప్రాయపడ్డారు. అయితే పవన్ కల్యాణ్‌తో జరిగిన భేటీకి ఎలాంటి కులపరమైన అజెండా లేదని, దీనిని వివాదం చేయడం సరికాదని ఆయన హితవు పలికారు.
హైడ్రా చర్యలు: వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు
హైదరాబాద్‌లోని అక్రమ కట్టడాల కూల్చివేతలపై హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తుండటంతో వస్తున్న ఒత్తిడిని ఆయన ప్రస్తావించారు. నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, చెరువులు, కుంటలను కబ్జా చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. చట్టం పట్ల ప్రజల్లో గౌరవంతో పాటు కొంత భయం కూడా ఉండాలని.. అప్పుడే వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు. పేదల ముసుగులో అసలైన కబ్జాదారులు తమ అక్రమ నిర్మాణాలను కాపాడుకోవాలని చూస్తున్నారని, వారి పట్ల కఠినంగా ఉంటామని చెప్పారు. అక్రమ కట్టడాల వల్ల ఇళ్లు కోల్పోయిన నిజమైన పేదలకు ప్రభుత్వం 'ఇందిరమ్మ ఇళ్లు' మంజూరు చేస్తుందని, అర్హులైన వారికి న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు.
భవిష్యత్తుపై ధీమా
ప్రస్తుతం హైడ్రా చర్యలపై కొన్ని వర్గాల నుండి విమర్శలు వస్తున్నప్పటికీ, భవిష్యత్తులో హైదరాబాద్ ప్రజలందరూ ఈ నిర్ణయాలను అభినందిస్తారని రంగనాథ్ ధీమా వ్యక్తం చేశారు. ఎఫ్‌టీఎల్ పరిధిలోని నిర్మాణాలపై తమ నిఘా నిరంతరం కొనసాగుతుందని, నగర పర్యావరణ పరిరక్షణే తమ ప్రథమ ప్రాధాన్యతని ఆయన పునరుద్ఘాటించారు.
ఈ వివరణతో పవన్ కల్యాణ్ భేటీ చుట్టూ అల్లుకున్న వివాదాలకు.. రాజకీయ రంగు పులిమే ప్రయత్నాలకు హైడ్రా కమిషనర్ పూర్తిస్థాయిలో చెక్ పెట్టినట్లయింది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వైరల్ అవుతోంది.
