30 రోజుల్లో జైలు బిల్లు...జేపీసీ కి విపక్షం బాయ్ కాట్!
తీవ్ర నేరారోపణలు మీద అరెస్ట్ అయి వరుసగా ముప్పయి రోజుల పాటు జైలు జీవితం అనుభవించిన వారికి 31వ రోజున పదవి ఆటోమేటిక్ గా పోతుంది.
By: Satya P | 25 Aug 2025 8:32 PM ISTతీవ్ర నేరారోపణలు మీద అరెస్ట్ అయి వరుసగా ముప్పయి రోజుల పాటు జైలు జీవితం అనుభవించిన వారికి 31వ రోజున పదవి ఆటోమేటిక్ గా పోతుంది. అది పధాని ముఖ్యమంత్రి మంత్రులు ఎవరు అయినా సరే ఇది వర్తిస్తుంది. ఈ బిల్లుని లోక్ సభలో కేంద్ర హోం మంత్రి తాజాగా ప్రవేశపెట్టారు. అయితే విపక్ష సభ్యుల అభ్యంతరాల మధ్య దానిని జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీకి పంపిస్తున్నట్లుగా ప్రకటించారు. లోక్ సభ రాజ్యసభ సభ్యులు మొత్తం 31 మందితో కలుపుకుని జేపీసీని ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. ఇందులో అధికార బీజేపీ ఇతర ఎన్డీయే మిత్ర పక్షాలతో పాటు విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు కూడా ఉంటారు అని ప్రభుత్వం అంటోంది. అంతా కలసి ఈ బిల్లుని సమగ్రంగా పరిశీలించి తగిన సిఫార్సులు చేస్తే తుది బిల్లుని పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో ప్రవేశపెట్టాలన్నది కేంద్ర ప్రభుత్వం ఆలోచన.
ఆదిలోనే గండి :
అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకుని రావాలనుకుంటున్నా ఈ బిల్లు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉంది. దాంతో ఈ బిల్లు మీద కేంద్ర హోం మంత్రి అనేక జాతీయ చానళ్ళతో మాట్లాడుతూ ఈ బిల్లు చాలా అవసరం అన్నారు. జైలు నుంచి పాలించాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదని ఆయన చెప్పుకొచ్చారు అందువల్లనే ఈ బిల్లుని తెస్తున్నామని సమర్ధించుకున్నారు. అయితే ఈ బిల్లుకు ఆదిలోనే విపక్షాలు గండి కొడుతున్నాయి. ఆ విధంగా ఎన్డీయే ప్రభుత్వానికి భారీ షాక్ ఇస్తున్నాయి.
కాంగ్రెస్ సహా కీలక పార్టీలు నో :
జేపీసీని బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్ సహా ఇతర ఇండియా బ్లాక్ లోని పార్టీలు తాజాగా ప్రకటించడం విశేషం. పార్లమెంట్ జేపీసీలో తమ పార్టీల నుంచి ఎంపీలను ప్రతిపాదించమని సమాజ్‌వాదీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించాయని అంటున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోనికి ఆమ్ ఆద్మీ పార్టీ శివసేన యూబీటీ కూడా చేరాయి. తాము జాయింట్ పార్లమెంటరీ కమిటీని బహిష్కరిస్తున్నట్లుగా ఈ పార్టీలు అన్నీ ప్రకటించాయి. అదే విధంగా కాంగ్రెస్ తన పార్టీ ఎంపీలను పంపడానికి ఏ మాత్రం ఇష్టపడటం లేదని ఆ పార్టీ ప్రకటించింది. ఇక ఈ బిల్లుని లోక్ సభలో ప్రవేశపెట్టిన సమయంలోనే , ప్రతిపక్ష నాయకులు దీనిని నిరసనగా వాకౌట్ చేశాయి.
ప్రజాస్వామ్యం అణచివేత కోసం :
ఈ బిల్లు కనుక చట్టం అయితే ప్రజాస్వామ్యం గొంతుని అణచివేస్తుందని శివసేన యూబీటీ స్పష్టంగా పేర్కొంటోంది. ఇక తాజాగా జరిగిన వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఈ వివాదాస్పదమైన బిల్లుని తెచ్చిందని అంటోంది. ఈ బిల్లును సమీక్షించడానికి ఏర్పాటు చేసిన జేపీసీ అన్నది కేవలం ఒక లాంచనం మాత్రమే అని ఆయన ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ ఎక్స్ పోస్టులో పేర్కొన్న్నరు. అందుకే ఈ జేపీసీలో శివసేన యుబిటి పాల్గొనదని ఆయన స్పష్టం చేశారు.
జేపీసీ ఏర్పాటు అవుతుందా :
నిజానికి అనేక బిల్లుల విషయంలో విస్తృత అభిప్రాయం కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీని వేయడం అన్నది చాలా కాలంగా జరుగుతూనే ఉంది. అలా గతంలో వక్ఫ్ చట్టం సవరణ బిల్లుని కూడా జేపీసీకి పంపించి ఆ మీదట పార్లమెంట్ లో చర్చకు పెట్టారు. ఈ బిల్లు కూడా అన్ని పార్టీల చర్చకు వస్తే తుది రూపంతో పార్లమెంట్ లో పెట్టాలని ఎన్డీఎ సర్కార్ ఆలోచిస్తోంది. కానీ 130వ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందితే కేవలం నెలరోజులపాటు అరెస్టయినా ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష విధించిన ఆరోపణలపై నిర్బంధించినా పదవులు పోతాయని విపక్షాలు అంటున్నాయి. పైగా విపక్షాలకే ఈ బిల్లు చట్టం అయితే ఎక్కువగా ప్రయోగించే ప్రమాదం ఉందని కూడా అంటున్నాయి. మరి ప్రధాన పక్షాలు లేని జేపీసీ ఏర్పాటు అవుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది
