ఆటో డ్రైవర్ ఇంట్లో రూ.3 కోట్లు.. ఒక్క ఇన్‌స్టా పోస్టుతో తీగ లాగితే డొంక కదిలింది!
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయడం.. రీచ్ కోసం రకరకాల విన్యాసాలు చేయడం ఈ రోజుల్లో కామన్ అయిపోయింది.
By: A.N.Kumar | 17 Aug 2026 10:00 PM ISTఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయడం.. రీచ్ కోసం రకరకాల విన్యాసాలు చేయడం ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. కానీ ఓ ఆటో డ్రైవర్ చేసిన "మాస్ ఇన్‌స్టా పోస్ట్" ఏకంగా పోలీసులను అతని ఇంటి తలుపు తట్టేలా చేస్తుందని.. తీరా చూస్తే రూ. 3 కోట్ల నోట్ల కట్టల దిబ్బ బయటపడుతుందని ఎవరు ఊహించి ఉంటారు? మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో జరిగిన ఈ విచిత్ర సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలోనూ.. స్థానికంగానూ హాట్ టాపిక్‌గా మారింది.
కథలోకి వెళ్తే.. సౌరభ్ అనే ఆటో డ్రైవర్‌కు సోషల్ మీడియాలో పోజులు కొట్టడం అంటే కాస్త సరదా ఎక్కువ. చేతిలో తుపాకీ పట్టుకుని.. వెనక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి యమ గ్రేస్‌తో ఫోటోలు, వీడియోలు తీసి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. "మన్యం పులి" రేంజ్‌లో బిల్డప్ ఇస్తూ పెట్టిన ఈ పోస్టులు నెటిజన్ల కంటే ముందుగా సైబర్ పోలీసుల కంట పడ్డాయి. "అబ్బో ఆటో నడిపే సోదరుడి చేతిలో తుపాకీ ఉందేంటి? దీని వెనుక ఏమైనా పెద్ద ప్లానే ఉందా?" అని అనుమానించిన పోలీసులు తీగ లాగుదామని చెప్పి నేరుగా అతని ఇంటికి వెళ్లారు.
తీరా ఇంట్లోకి వెళ్లి తనిఖీలు చేయడం ప్రారంభించిన పోలీసులకు ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయింది. తుపాకీ సంగతి దేవుడెరుగు కానీ అక్కడ ఏకంగా రూ. 3 కోట్ల కరెన్సీ నోట్ల కట్టలు ప్రత్యక్షమయ్యాయి. ఆ డబ్బు చూసి పోలీసులకు కళ్లు బైర్లు కమ్మగా, ఆటో నడిపి సంపాదించడానికి ఇదేమైనా రహస్య 'అల్టిమేట్ ఆటో మేజిక్' ఏమైనా ఉందా అని నోరెళ్లబెట్టారు.
డబ్బు ఎక్కడిది అని నిలదీస్తే కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాధానం మరింత కామెడీగా ఉంది. "అయ్యో సర్ ఆ డబ్బు మాది కానే కాదు.. ఎనిమిది నెలల క్రితం మా చుట్టమొకాయన వచ్చి ఇంట్లో దాచిపెట్టి వెళ్లాడు" అని తీపీ తీపిగా చెప్పారు. పైగా ఆ చుట్టం గారు ఓ 'ప్రభుత్వ ఉద్యోగి' అట.. ప్రభుత్వ ఉద్యోగికి ఆటో డ్రైవర్ ఇల్లే సేఫ్ డిపాజిట్ లాకర్ లాగా కనిపించిందో లేక బ్యాంకుల కంటే ఇక్కడే వడ్డీ ఎక్కువొస్తుందని అనుకున్నారో గానీ రూ. 3 కోట్లను అలా తెచ్చి పడేసి వెళ్లడం విశేషం.
ప్రభుత్వ జీతంతో రూ. 3 కోట్లు ఎలా వచ్చాయి? ఆ డబ్బును ఎనిమిది నెలలుగా ఆటో డ్రైవర్ ఇంట్లోనే ఎందుకు దాచారు? అనే ప్రశ్నలకు ఇప్పుడు పోలీసులు సమాధానాలు వెతుకుతున్నారు. ఒక్క చిన్న ఇన్‌స్టాగ్రామ్ రీల్ పుణ్యమా అని.. గన్ పోజులు కొట్టబోయి రూ. 3 కోట్ల ఐటీ రైడ్ మోత మోగించేలా చేసుకున్నాడు మన ఆటో భాయ్. ప్రస్తుతం పోలీసులు ఆ నగదును స్వాధీనం చేసుకుని ఆ 'దాతృత్వం' ఉన్న ప్రభుత్వ బంధువు ఎవరో తేల్చే పనిలో పడ్డారు.
