ఇందోర్‌లో ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లను అసభ్యంగా తాకాడు.. బోర్డ్ సీరియస్
క్రికెట్ ఆస్ట్రేలియా, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తో సంప్రదింపులు జరుపుతూ, ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది.
By: A.N.Kumar | 25 Oct 2025 5:15 PM ISTభారత్ లో వన్డే మహిళ ప్రపంచకప్ ఆడుతున్న ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టుకు సంబంధించిన ఇద్దరు ఆటగాళ్లపై ఇందోర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కేఫ్‌కు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఒక వ్యక్తి వారిని అశ్లీలంగా తాకినట్లుగా క్రికెట్ ఆస్ట్రేలియా (CA) అధికారిక ప్రకటన ద్వారా ధృవీకరించింది.
క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటన
“ఇందోర్‌లో కేఫ్‌కు వెళ్తున్న సమయంలో ఆస్ట్రేలియా మహిళా జట్టులోని ఇద్దరు సభ్యులను ఒక మోటార్‌సైకిల్ వ్యక్తి అనుచితంగా తాకాడు. ఈ ఘటనపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయబడింది. బాధిత ఆటగాళ్లకు జట్టు మేనేజ్‌మెంట్, క్రికెట్ ఆస్ట్రేలియా పూర్తి మద్దతు అందిస్తున్నాయి” అని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది.
ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. క్రికెటర్లు బస చేస్తున్న హోటల్ పరిసరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లుగా సమాచారం.
ఆటగాళ్లకు కౌన్సెలింగ్..
జట్టు వర్గాల సమాచారం ప్రకారం, ఈ ఘటనతో షాక్‌కు గురైన ఇద్దరు ఆటగాళ్లకు జట్టు మేనేజ్‌మెంట్ కౌన్సెలింగ్, మానసిక సహాయం అందిస్తోంది. క్రికెట్ ఆస్ట్రేలియా, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తో సంప్రదింపులు జరుపుతూ, ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది.
తీవ్ర ఆగ్రహం
భారత్ లో జరుగుతున్న మహిళా వన్డే ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం భారత్‌లో ఉంది. ఈ దురదృష్టకర ఘటనపై క్రీడాభిమానులు, అధికారులంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్ల భద్రతపై సీరియస్ ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని, మహిళా క్రీడాకారిణుల రక్షణ విషయంలో లోపాలను సరిదిద్దాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్లకు సరైన రక్షణ కల్పించడం ఎంత ముఖ్యమో ఈ సంఘటన మరోసారి స్పష్టం చేసింది.
