ఒక పిల్లాడి ఆత్మహత్య.. దేశంలో సోషల్ మీడియా బ్యాన్
16 ఏళ్ల కంటే తక్కువ వయస్సు గల వినియోగదారులు ఖాతాలను సృష్టించకుండా లేదా కొనసాగించకుండా సంస్థలు సహేతుకమైన చర్యలు తీసుకోవాలి.
By: A.N.Kumar | 11 Dec 2025 2:00 AM ISTఒక్క బాలుడి ఆత్మహత్య ఏకంగా ఒక దేశంలో సోషల్ మీడియా బ్యాన్ కు కారణమైంది. ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న చారిత్రక నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా నిషేధించిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది. ఈ కొత్త నిబంధన 2025 డిసెంబర్ 10 నుంచి అమలులోకి రానుంది.
ఆలివర్ విషాదంతో ప్రభుత్వంలో కదలిక
ఈ కఠిన నిర్ణయం వెనుక 14 ఏళ్ల బాలుడు ఆలీవర్ ఆత్మహత్య ప్రధాన కారణం. ‘అనోరెక్సియా నెర్వోసా’ అనే అనారోగ్యంతో బాధపడుతున్న ఆలీవర్, సోషల్ మీడియా ప్రభావంతో బరువు తగ్గిపోతున్న భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లలపై సోషల్ మీడియా చూపుతున్న దుష్ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆలీవర్ తల్లి ప్రధాని ఆంటోనీ అల్బనీస్ కు లేఖ రాయడంతో ఈ చట్టం అమలులోకి వచ్చింది. ఇప్పటికే ఆస్ట్రేలియా ప్రభుత్వం ‘ఆన్ లైన్ సేఫ్టీ అమెండ్ మెంట్ (సోషల్ మీడియా మినిమం ఏజ్) బిల్లును 2024 నవంబర్ లో ఆమోదించింది. ఇది ఆన్ లైన్ సేఫ్టీ చట్టం 2021కి సవరణగా చెబుతున్నారు.
చట్టంలోని కీలక అంశాలు ఇవీ
ఈ చట్టం ప్రధాన ఉద్దేశం పిల్లలపై కాకుండా సోషల్ మీడియా సంస్థలపై బాధ్యతను మోపడం. 16 ఏళ్ల కంటే తక్కువ వయస్సు గల వినియోగదారులు ఖాతాలను సృష్టించకుండా లేదా కొనసాగించకుండా సంస్థలు సహేతుకమైన చర్యలు తీసుకోవాలి. తల్లిదండ్రులు అనుమతి ఇచ్చినా కూడా 16 ఏళ్ల లోపు వారు ఈ ఫ్లాట్ ఫామ్ లను ఉపయోగించడానికి అనుమతి లేదు. ప్రస్తుతం ఈ నిబంధనలు ఫేస్ బుక్ , ఇన్ స్టాగ్రామ్, టిక్ టాక్, ఎక్స్, రెడిట్, థ్రెడ్స్, ట్విచ్, కిక్ లకు వర్తిస్తాయి.
ఇక ఇందులో మెసేజింగ్ కోసం గేమింగ్ కోసం ఉపయోగించే వాట్సాప్, డిస్ కార్డ్, రోబ్లోక్స్ వంటి సర్వీసులను ప్రస్తుతానికి మినహాయించారు. అయితే సేఫ్టీ కమీషనర్ భవిష్యత్తులో ఈ జాబితాను మార్చే అవకాశం ఉంది. ఇక ఫ్టాట్ ఫామ్ లు వినియోగదారుల వయస్సును నిర్ధారించడానికి కొత్త వయస్సు ధ్రువీకరణ విధానాలను అమలు చేయాలి. ప్రభుత్వ గుర్తింపు పత్రాలను అడగకుండా ఫొటో/వీడియో ఆధారిత వయస్సు అంచనా లేదా ఇతర ప్రత్యామ్మాయ పద్ధతులను ఉపయోగించవచ్చు.
ఈ నిబంధనలను పాటించడంలో విఫలమైన సోషల్ మీడియా సంస్థలకు గరిష్టంగా 49.5 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల (సుమారు 270 కోట్లు వరకూ భారీ జరిమానాలు విధించే అవకాశం ఉంది. ఈ చట్టం బాధ్యత పూర్తిగా టెక్ కంపెనీలపైనే ఉంటుంది. పిల్లలకు లేదా వారి తల్లిదండ్రులకు ఎలాంటి జరిమానాలు ఉండవు.
ఆస్ట్రేలియా తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర దేశాలు కూడా పిల్లలను సోషల్ మీడియా దుష్ప్రభావం నుంచి రక్షించడానికి ఇలాంటి చర్యలు తీసుకోవడానికి ఒక ఉదాహరణగా నిలిచే అవకాశం ఉంది.
