Begin typing your search above and press return to search.

30ల‌క్ష‌ల పులి చీమ‌ల్ని వ‌దిలారు.. వ‌ర‌ల్డ్ డెడ్లీయెస్ట్ స్నేక్‌ని చంపేందుకు.. ఆపై ఏం జ‌రిగిందంటే?

ఆస్ట్రేలియాలో భూమిపైనే అత్యంత విషపూరితమైన 'ఇన్‌లాండ్ టైపాన్' పాముల సంత‌తిని అణచివేయడానికి అధికారులు చేసిన ఒక విచిత్రమైన ప్రయోగం తీవ్ర పరిణామాలకు దారితీసింది.

By:  Sivaji Kontham   |   18 Sept 2026 7:46 AM IST
30ల‌క్ష‌ల పులి చీమ‌ల్ని వ‌దిలారు.. వ‌ర‌ల్డ్ డెడ్లీయెస్ట్ స్నేక్‌ని చంపేందుకు.. ఆపై ఏం జ‌రిగిందంటే?
X

ఆస్ట్రేలియాలో భూమిపైనే అత్యంత విషపూరితమైన 'ఇన్‌లాండ్ టైపాన్' పాముల సంత‌తిని అణచివేయడానికి అధికారులు చేసిన ఒక విచిత్రమైన ప్రయోగం తీవ్ర పరిణామాలకు దారితీసింది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఈ పామును నియంత్రించేందుకు ప్రభుత్వం ఏకంగా 3 మిలియన్ల (30 లక్షల) ఎర్రటి ఫైర్ చీమలను (పులి చీమ‌లు) అడవిలోకి వదిలిపెట్టింది. ఈ వినూత్న ప్రయోగం వెనుక ఉన్న ఉద్దేశం.. ఆ చీమల సాయంతో పాములను అంతం చేయడమే.

ఈ ప్రయోగం ప్రారంభంలో ఆశించిన ఫలితాలనే ఇచ్చింది. ఫైర్ చీమలు గుంపులుగా దాడి చేసి పాములను.. ముఖ్యంగా పుట్టల్లో ఉన్న చిన్న పాములను పెద్ద ఎత్తున చంపేశాయి. దీంతో లక్ష్య ప్రాంతంలో టైపాన్ పాముల సంచారం గణనీయంగా తగ్గిపోయింది. ప్రభుత్వానికి మొదట ఇది మంచి ఆలోచనలా కనిపిపించినా ఆ తర్వాత ఆ చీమలు సృష్టించిన బీభత్సం శాస్త్రవేత్తలను సైతం విస్మయానికి గురిచేసింది.

పాములు అంతరించిపోయిన తర్వాత కూడా ఫైర్ చీమలు శాంతించకుండా మరింత విస్తరించాయి. ఆ ప్రాంతంలోని ఎలుకల సంఖ్యను తీవ్రంగా దెబ్బతీయడంతో పాటు.. స్థానిక పర్యావరణ సమతుల్యత దెబ్బతిన‌డానికి కార‌ణ‌మ‌య్యాయి. ఎలుకలపై ఆధారపడే డేగలు.. ఇతర జంతువులకు ఆహారం కరవై ఇబ్బంది పడ్డాయి. అంతేకాకుండా ఈ చీమలు మొక్కలను నాశనం చేస్తూ నేలను కోతకు గురిచేసే ప్రమాదకరమైన జీవజాలంగా రూపాంతరం చెందాయి.

ఈ ప్రయోగం వల్ల అత్యంత ప్రమాదకరమైన ఆ పాములు పూర్తిగా నశించకపోగా.. ప్రాణభయంతో కొత్త ప్రాంతాలకు వలస వెళ్లాయి. మనుషులు నివసించే ప్రాంతాలకు ఇవి మరింత దగ్గరగా రావడంతో మానవులకు పాముల ముప్పు మరింత పెరిగింది. ప్రత్యామ్నాయంగా చేపట్టిన ఈ జీవ నియంత్రణ ప్రయోగం (బ‌యోలాజిక‌ల్ కంట్రోల్) వికటించి, పర్యావరణానికి మరింత ముప్పుగా పరిణమించిందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రకృతిలో ఒక సమస్యను పరిష్కరించడానికి మరో ప్రమాదకరమైన జీవిని వదిలిపెడితే అది ఎంతటి అనర్థాలకు దారితీస్తుందో ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది. మనుషుల జోక్యంతో పర్యావరణ వ్యవస్థలో వచ్చే చిన్న మార్పులు కూడా ఊహించని వినాశనాన్ని సృష్టిస్తాయని ఈ ఉదంతం ద్వారా స్పష్టమవుతోంది.