Begin typing your search above and press return to search.

విదేశాకి వెళ్తున్నారా? జాగ్రత్త బాస్.. అక్కడ మన భద్రత గోవిందా..

అయితే కాస్త ఆగండి! అక్కడ మీ కెరీర్ ఎంత వేగంగా పెరుగుతుందో పక్కన పెడితే మన భారతీయులపై పడే దెబ్బల సంఖ్య మాత్రం రాకెట్ వేగంతో దూసుకెళ్తోంది

By:  A.N.Kumar   |   15 Aug 2026 1:38 PM IST
విదేశాకి వెళ్తున్నారా? జాగ్రత్త బాస్.. అక్కడ మన భద్రత గోవిందా..
X

విదేశాల్లో ఉద్యోగం.. డాలర్లలో జీతం.. రంగుల జీవితం అంటూ విమానమెక్కి ఊరేగుతున్నారా? అయితే కాస్త ఆగండి! అక్కడ మీ కెరీర్ ఎంత వేగంగా పెరుగుతుందో పక్కన పెడితే మన భారతీయులపై పడే దెబ్బల సంఖ్య మాత్రం రాకెట్ వేగంతో దూసుకెళ్తోంది. విదేశాంగ శాఖ పార్లమెంట్ వేదికగా ఎంతో సగౌరవంగా వెల్లడించిన గణాంకాలు చూస్తుంటే విదేశాల్లో మన ప్రవాసులకు దక్కే "వెల్కమ్ ట్రీట్‌మెంట్" గత ఐదేళ్లలోనే ఏకంగా ఏడింతలు పెరిగిందని అర్థమవుతోంది.

గణాంకాల వైపు ఒక్కసారి కన్నేస్తే మన పరిస్థితి ఎంత ఘనంగా ఉందో స్పష్టంగా తెలుస్తుంది. 2021లో ప్రపంచవ్యాప్తంగా విదేశాల్లో భారతీయులపై కేవలం 15 దాడులు మాత్రమే నమోదైతే 2022 నాటికి అది 31కి.. 2023లో 67కి, 2024లో 85కి పెరుగుతూ వచ్చి చివరికి 2025 నాటికి ఏకంగా 104 దాడులతో ఘనంగా సెంచరీ కొట్టేసింది. అంటే ఈ ఐదేళ్ల కాలంలో 36 దేశాల్లో కలిపి మొత్తం 302 సార్లు మన భారతీయులు విదేశీయుల చేతుల్లో ప్రత్యక్షంగా "ఆతిథ్యం" పొందారు.

ఈ దాడుల పోటీలో మన కలల దేశం అమెరికా 33 ఘటనలతో అగ్రస్థానంలో నిలిచి బంగారు పతకం సాధించింది. 2021లో అక్కడ కేవలం ఒక్క ఘటన మాత్రమే నమోదు కాగా.. 2025 నాటికి అది 14కి చేరి అసలైన ప్రగతి అంటే ఏంటో చూపించింది. అమెరికాకు ఏమాత్రం తగ్గకుండా యూఏఈ 32 ఘటనలతో.. బ్రిటన్ 31 ఘటనలతో.. కెనడా 30 ఘటనలతో గట్టి పోటీనిచ్చాయి. ఐర్లాండ్‌లో 24, రష్యాలో 23, జర్మనీలో 19 కేసులు నమోదయ్యాయి. ఇక ఆఫ్రికాలోని 'మాలి' అనే దేశం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 2024 వరకు అక్కడ మనోళ్లపై ఒక్క దాడి కూడా జరగకపోగా 2025లో ఒక్కసారిగా 11 దాడులు జరిపి 'బెస్ట్ ఎమర్జింగ్ వైలెంట్ కంట్రీ'గా సరికొత్త రికార్డు సృష్టించింది.

మన ఐటీ ఇంజనీర్లు, డాక్టర్లు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు తమ రెక్కల కష్టంతో ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలను నిలబెడుతుంటే, అక్కడి కొందరు స్థానికులు మాత్రం జాతి వివక్ష, హేట్ క్రైమ్స్ పేరుతో వినూత్నంగా తమ విద్వేషాన్ని చాటుకుంటున్నారు. "మా ఉద్యోగాలు ఊడగొడుతున్నారు" అనే సాకుతో ప్రారంభమయ్యే ఈ దాడులు చివరికి మనవారిని ఆసుపత్రి పాలే చేస్తున్నాయి.

అటు కేంద్ర ప్రభుత్వం మాత్రం "మేము సంబంధిత దేశాల ప్రభుత్వాలతో నిరంతరం మాట్లాడుతున్నాం.. ఎంబసీలు భద్రతను పర్యవేక్షిస్తున్నాయి" అంటూ ఎప్పటికప్పుడు ఓదార్పు లాలిపాప్‌లు పంచుతూనే ఉంది. కాబట్టి విదేశాలకు వెళ్లే అభ్యర్థులారా విదేశీ వీసాతో పాటు వీలైతే ఒక బాడీగార్డ్‌ను లేదా మార్షల్ ఆర్ట్స్ విద్యను కూడా వెంట తీసుకెళ్లడం చాలా అవసరం. లేకపోతే "డాలర్లు వచ్చాయి కానీ దేహం నలిగిపోయింది" అని మనసులోనే పాడుకోవాల్సి వస్తుంది.