Begin typing your search above and press return to search.

అట్లాంటిక్ గర్భంలో అద్భుతం: 800 ఏళ్ల పాటు దాహం తీర్చే భారీ మంచినీటి నిధి!

వేల ఏళ్ల క్రితం మంచు యుగం (ఐస్ ఏజ్) సమయంలో మంచు గడ్డలు కరిగి ఆ నీరు సముద్రపు అడుగున ఉన్న భూమి పొరల్లోకి ఇంకడం వల్ల ఈ నిల్వలు ఏర్పడ్డాయని పరిశోధకులు వివరిస్తున్నారు.

By:  Sivaji Kontham   |   10 April 2026 5:00 AM IST
అట్లాంటిక్ గర్భంలో అద్భుతం: 800 ఏళ్ల పాటు దాహం తీర్చే భారీ మంచినీటి నిధి!
X

అట్లాంటిక్ మహాసముద్రం అడుగున శాస్త్రవేత్తలు ఒక విస్మయకరమైన ఆవిష్కరణ చేశారు. సముద్రపు ఉప్పునీటి పొరల కింద ఒక భారీ మంచినీటి సరస్సు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇది ఎంత పెద్దదంటే అమెరికాలోని అత్యంత రద్దీగా ఉండే న్యూయార్క్ నగరం వంటి మెట్రోపాలిటన్ ప్రాంతానికి ఏకంగా 800 ఏళ్ల పాటు నిరంతరం నీటిని సరఫరా చేయగల సామర్థ్యం దీనికి ఉంది. ప్రపంచవ్యాప్తంగా నీటి ఎద్దడి పెరిగిపోతున్న తరుణంలో సముద్ర గర్భంలో దాగి ఉన్న ఈ `మంచినీటి నిధి` మానవాళికి ప్రకృతి ప్రసాదించిన వరంగా భావిస్తున్నారు.

ఈ మంచినీటి నిల్వలు ప్రధానంగా అమెరికా ఈశాన్య తీరంలోని న్యూజెర్సీ నుండి మసాచుసెట్స్ వరకు సుమారు 15,000 చదరపు మైళ్ల మేర విస్తరించి ఉన్నాయి. కొలంబియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు అత్యాధునిక ఎలక్ట్రోమాగ్నెటిక్ సెన్సార్లను ఉపయోగించి సముద్ర మట్టానికి 600 నుండి 1200 అడుగుల లోతులో ఈ `ఆక్విఫర్` ఉన్నట్లు కనుగొన్నారు. భూమిపై ఉన్న అతిపెద్ద మంచినీటి సరస్సుల కంటే కూడా ఈ అండర్ గ్రౌండ్ నిల్వలు చాలా రెట్లు పెద్దవని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

వేల ఏళ్ల క్రితం మంచు యుగం (ఐస్ ఏజ్) సమయంలో మంచు గడ్డలు కరిగి ఆ నీరు సముద్రపు అడుగున ఉన్న భూమి పొరల్లోకి ఇంకడం వల్ల ఈ నిల్వలు ఏర్పడ్డాయని పరిశోధకులు వివరిస్తున్నారు. సముద్రపు ఉప్పునీరు ఈ మంచినీటితో కలవకుండా మధ్యలో రాతి పొర‌లు.. మట్టి పొరలు అడ్డుగోడలా నిలిచాయి. దీనివల్ల ఈ నీటిలో ఉప్పు శాతం చాలా తక్కువగా ఉంది. కాబట్టి సాధారణ శుద్ధి ప్రక్రియ తర్వాత దీనిని నేరుగా తాగడానికి, వ్యవసాయానికి ఉపయోగించుకోవచ్చు.

సాధారణంగా సముద్రపు నీటిని తాగే నీరుగా మార్చే డీశాలినేషన్ ప్రక్రియ చాలా ఖరీదైనది.. సంక్లిష్టమైనది. కానీ ఇప్పుడు కనుగొన్న ఈ సహజసిద్ధమైన మంచినీటిని వెలికితీయడం చాలా సులభం.. చౌకైన మార్గం. చైనా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి దేశాల తీర ప్రాంతాల్లో కూడా ఇలాంటి మంచినీటి నిల్వలు ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఒకవేళ ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి మరిన్ని నిల్వలు బయటపడితే.. భవిష్యత్తులో రాబోయే నీటి యుద్ధాలను, కరువును మనం సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.

ఈ ఆవిష్కరణ సముద్ర గర్భంలోని రహస్యాలను ఛేదించడంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. అయితే ఈ నీటిని వెలికితీసే క్రమంలో సముద్ర పర్యావరణ వ్యవస్థకు, భూగర్భ స్థిరత్వానికి ఎలాంటి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ఏదేమైనా.. అట్లాంటిక్ మహాసముద్రం కింద దొరికిన ఈ అక్షయమైన నీటి నిధి.. భూమిపై పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడంలో ఒక కీలక ఆశాదీపంగా మారుతుందనడంలో సందేహం లేదు.