Begin typing your search above and press return to search.

అచ్చెన్నను ఓడించడం వైసీపీ వల్ల కాదా ?

ఉత్తరాంధ్రాలో పవర్ ఫుల్ నేతలలో ఒకరు కింజరాపు అచ్చెన్నాయుడు.

By:  Satya P   |   22 Sept 2026 9:28 AM IST
అచ్చెన్నను ఓడించడం వైసీపీ వల్ల కాదా ?
X

ఉత్తరాంధ్రాలో పవర్ ఫుల్ నేతలలో ఒకరు కింజరాపు అచ్చెన్నాయుడు. అన్న చాటు తమ్ముడిగా 1996లో హరిశ్చంద్ర పురానికి జరిగిన ఉప ఎన్నికల్లో అనివార్యంగా పోటీకి దిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన అచ్చెన్నాయుడు గడచిన మూడు దశాబ్దాల కాలంలో తిరుగులేని రాష్ట్ర నాయకుడిగా ఎదిగారు. ప్రత్యేకించి ఉత్తరాంధ్రాలో ఆయన శక్తివంతమైన నేతగా ఉన్నారు. దానికి ఆయన రాజకీయ సామర్ధ్యంతో పాటు సామాజిక నేపథ్యం, అన్న ఎర్రన్నాయుడు వేసిన బాటలు కారణంగా చెప్పాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే ఇప్పటికి ఏడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆరు సార్లు గెలిచిన అచ్చెన్నాయుడు 2009లో ఒక్కసారి ఓటమి పాలు అయ్యారు. దానికి కారణం హరిశ్చంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ విభజనలో మాయమై టెక్కలిలో కొంత భాగం కలిసింది. దాంతో తొలి ఎన్నికల్లో ఆయనకు అలా విజయం దక్కలేదు. అయితే ఈ ప్రాంతీయ సమీకరణలను సైతం తనకు అనుకూలంగా మార్చుకుని టెక్కలిలో హ్యాట్రిక్ విక్టరీ కొట్టిన నేతగా అచ్చెన్న కనిపిస్తారు.

వైసీపీకి సైతం హ్యాట్రిక్ :

ఇక అచ్చెన్నాయుడు ఒకే అభ్యర్ధిగా మూడు ఎన్నికల్లో పోటీకి దిగితే ఆయన మీద మార్చి మార్చి వైసీపీ అభ్యర్ధులను ఎంపిక చేసింది. 2014లో 2024లో దువ్వాడ శ్రీనివాస్ ని పోటీకి దించింది. 2019లో పేడాడ తిలక్ ని పోటీ చేయించింది. అయినా సరే ఫలితం శూన్యం అయింది. దాంతో అచ్చెన్న ఇలాకాలో ఫ్యాన్ తిరిగే చాన్స్ లేదని టీడీపీ నేతలు ఎద్దేవా చేస్తూంటారు. అయితే ఈసారి అచ్చెన్న కోటను బద్ధలు కొట్టాలని వైసీపీ పట్టుదలగా చూస్తోంది. దాని కోసం చేయాల్సిన ప్రయత్నాలు తెర వెనక చేస్తోంది అని అంటున్నారు. ప్రస్తుతం పేడాడ తిలక్ ఇంచార్జిగా ఉన్నా కూడా వర్గ పోరుతో పాటు ఆయనకు పెద్దగా ఎవరూ సహకరించని పరిస్థితి ఉందని అంటున్నారు.

ఆమె వస్తే కనుక :

ఇక ఈసారి ఎన్నికల్లో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణిని బరిలోకి దించుతారు అని ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. కిల్లికి టెక్కలిలో బాగానే పట్టు ఉంది. ఆమె డాక్టర్ గా కూడా ప్రజలతో మమేకం అయి ఉన్నారు. ఆమె 2009 ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి ఎంపీ సీటును కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలిచి ఎర్రన్నాయుడిని ఓడించారు. అలా ఆమె ఆ టెర్మ్ లో కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. అయితే 2019 లోనే ఆమెకు టెక్కలి సీటు ఇవ్వాల్సి ఉంది. కానీ వైసీపీలోని కొందరు నేతలు మోకాలడ్డడం వల్లనే అది జరగలేదని అంటున్నారు. ఈసారి ప్రతీ ఒక్క సీటూ తమకు ప్రాధాన్యం కాబట్టి కిల్లిని పోటీ చేయిస్తారు అని అంటున్నారు. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ లో ఉంటున్నారు. అయితే ఆమె వైసీపీలో చేరుతారు అని చాలా కాలంగా ప్రచారం అయితే ఉంది అని అంటున్నారు.

కుమారుడితో :

అయితే ఈసారి అచ్చెన్నాయుడు పోటీ చేస్తారా లేదా అన్నది కూడా పెద్ద చర్చగా ఉంది. ఆయన కుమారుడు రాజకీయ వారసుడు క్రిష్ణ మోహన్ నాయుడు టెక్కలి బరిలో ఉంటారని అంటున్నారు. ఆయన ఇప్పటికే పార్టీ శ్రేణులతో మమేకం అవుతున్నారు. ఈసారి ఎన్నికల్లో యువ నేతలకే చాన్స్ అని టీడీపీలో వినిపిస్తున్న మాట. అదే జరిగితే అచ్చెన్న పోటీలో ఉండకపోవచ్చు. ఆ విధంగా జరిగితే మాత్రం అచ్చెన్నను ఓడించలేని అసంతృప్తి అయితే వైసీపీకి రాజకీయ జీవిత కాలమంతా ఉంటుందని అంటున్నారు.