Begin typing your search above and press return to search.

వాజ్ పేయి విగ్రహ రూపేణ...ఏపీ అంతటా !

కొందరు నాయకుల విషయంలో కుల మతం ప్రాంతం వర్గం వర్ణమే కాదు రాజకీయం కూడా ముద్ర వేయాలని ఎవరూ ఆలోచించరు.

By:  Satya P   |   10 Dec 2025 9:17 AM IST
వాజ్ పేయి విగ్రహ రూపేణ...ఏపీ అంతటా !
X

కొందరు నాయకుల విషయంలో కుల మతం ప్రాంతం వర్గం వర్ణమే కాదు రాజకీయం కూడా ముద్ర వేయాలని ఎవరూ ఆలోచించరు. దానికి కారణం వారి అత్యున్నత వ్యక్తిత్వం వారు ఆ పరిధిలు దాటి ఎంతో ఎత్తుకు ఎదిగిపోయారు. అలాంటి వారి జాబితాలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి కూడా మొదటి వరసలో ఉంటారు. ఆయన పుట్టిన రోజు డిసెంబర్ 25. ఈ ఏడాది మరో విశేషం ఉంది. వాజ్ పేయి శత జయంతి అన్న మాట. దానిని దేశవ్యాప్తంగా చాలా గొప్పగా నిర్వహించాలని చూస్తున్నారు. కేంద్రంలో ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ఉంది. దాంతో ఘనంగా వాజ్ పేయి శత జయంతి ఉత్సవాలను పదిహేను రోజుల పాటు నిర్వహించనున్నారు.

కూటమి నేతృత్వంలో :

ఇక మాజీ ప్రధాని శత జయంతిని పురస్కరించుకుని ఏపీలో ఈ నెల 11వ తేదీ నుంచి 25 వరకూ రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్రను నిర్వహిస్తున్నారు.అటల్ సందేశ్ - మోదీ సుపరిపాలన పేరుతో ఈ బస్సు యాత్ర సాగనుంది. వాజ్ పేయి నుంచి మోడీ ఎంతో స్పూర్తి పొందారని అందుకే ఆయన మంచి పాలన అందిస్తున్నారు అని బీజేపీకి చెందిన ఇద్దరు ప్రధానుల ఇమేజ్ తో జనంలోకి కూటమి వెళ్ళనుంది అన్న మాట.ఈ యాత్రను విజయవంతం చేయాలని కూటమి పార్టీలకు చంద్రబాబు పిలుపు ఇచ్చారు.

అక్కడ నుంచే శ్రీకారం :

రాయలసీమలోని అనంతపురం జిల్లా ధర్మవరం నుంచే ఈ బస్సు యాత్రను ప్రారంభించబోతున్నారు ఇక ఆనాటి కార్యక్రమానికి బీజేపీకి చెందిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ హాజరవుతున్నారు. అలా మొదలైన బస్సు యాత్ర ఈ నెల 25 నాటికి అమరావతి రాజధాని వద్ద ముగుస్తుంది. ముగింపు కార్యక్రమం కూడా భారీ సభతో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాలలో వాజ్ పేయి విగ్రహాలను కూడా అవిష్కరించనున్నారు.

వాజ్ పేయి అందరి వారు :

వాజ్ పేయ్ అందరి వారు అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఆయన వల్లనే ఏపీకి ఎంతో మేలు జరిగింది అని తలచుకున్నారు. ఏపీకి సంబంధించి తాను ఏది అడిగినా కాదకుండా వాజ్ పేయి ప్రధానిగా ఉన్న కాలంలో మంజూరు చేశారు అని ఆయన గుర్తు చేసుకున్నారు వాజ్ పేయి హయాంలో తీసుకుని వచ్చిన స్వర్ణ చతుర్భుజి హైవే ప్రాజెక్ట్ దేశాం మొత్తం దశని దిశను మార్చిందని అన్నారు. వాజ్ పేయ్ శత జయంతి ఉత్సవాలని అంతా కలసికట్టుగా నిర్వహించాలని ఆయన కూటమి మంత్రులను ఎంపీలను ఎమ్మెల్యేలను ఇతర నాయకులను కోరారు. ఈ మేరకు బాబు టెలి కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు.

విగ్రహాలు ఏర్పాటుతో :

మొత్తం మీద ఏపీలో వాజ్ పేయి శత జయంతి వేడుకలను గొప్పగా నిర్వహించాలని కూటమి నిర్ణయం తీసుకుంది. అయితే బీజేపీ ఈ విషయంలో మరింత ముందుకు అడుగులు వేస్తూ వాజ్ పేయి ఇమేజ్ తో అయినా ఏపీలో తమ గ్రాఫ్ పెంచుకోవాలని అనుకుంటోంది. అయితే వాజ్ పేయి అందరి వాడుగానే జనాలు చూస్తారు, ఆయన కాషాయం పార్టీ పరిధి దాటి వచ్చిన రాజనీతి కోవిదుడుగానే అంతా ఆదరించి అభిమానిస్తారు. ఆ విధంగా వాజ్ పేయ్ శత జయంతి వేడుకలను నిర్వహించడం మీద అంతా హర్షిస్తారు అదే సమయంలో ఏపీలో వాజ్ పేయి విగ్రహాలు ఏర్పాటుతో బీజేపీ ప్రతిష్ట ఏ మేరకు పెరుగుతుంది అంటే ఆలోచించాల్సిందే.