ఒక్క ఓటుతో పోయిన ప్రధాని పదవి...అయినా !
అటల్ బిహారీ వాజ్ పేయి వందేళ్ళ వేడుక ఈ రోజు. ఆయన 1924 డిసెంబర్ 25న మధ్యప్రదేశ్ లోని అ గ్వాలియర్ లోని ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.
By: Satya P | 25 Dec 2025 1:00 PM ISTఅటల్ బిహారీ వాజ్ పేయి వందేళ్ళ వేడుక ఈ రోజు. ఆయన 1924 డిసెంబర్ 25న మధ్యప్రదేశ్ లోని అ గ్వాలియర్ లోని ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. చిన్ననాటి నుంచే వాజ్ పేయి చదువులో మంచి ప్రతిభ కనబరిచారు. హిందీ, ఇంగ్లీష్, సంస్కృతంలో డిగ్రీ పట్టాలు సాధించారు కాన్పూరు లోని దయానంద ఆంగ్లో వైదిక కళాశాల నుండి రాజనీతి శాస్త్రంలో ఎంఏ ఫస్ట్ క్లాస్ లో పాసైన వాజ్ పేయ్ లా కూడా చేశారు. ఇక 1942 ఆగస్టులో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ఆయన తన అన్న ప్రేమ్‌తో కలిసి 23 రోజుల పాటు అరెస్టయిన సందర్భంలో వాజపేయికి తొలిసారిగా రాజకీయాలతో పరిచయం ఏర్పడింది. అలా అంతకు ముందే 1939 లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ లో చేరారు. ఆయన 1947 లో పూర్తి స్థాయి సేవకుడు అంటే ఆర్ఎస్ఎస్ ప్రచారక్ అయ్యారు. అది లగాయతు వాజ్ పేయ్ ప్రజా జీవితం ఎన్నో మలుపులు తీసుకుంది.
జన సంఘ్ నేతగా :
ఇక వాజ్ పేయి 1951 లో దేశంలో కాంగ్రెస్ భావజాలానికి వ్యతిరేకంగా కొత్తగా ఏర్పడిన భారతీయ జనసంఘ్ పార్టీలో చేరిన తరువాత ఆయన రాజకీయం దూకుడు పెరిగింది. జనసంఘ్ తరఫున ఎన్నో పదవులు నిర్వహించారు. ఇక 1957లో వాజపేయి బలరాం పూర్ లోక్ సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అలా ఆయన 32 ఏళ్ళ వయసులో పార్లమెంట్ మెంబర్ అయ్యారు.
నెహ్రూ చెప్పిన జోస్యం :
ఇక తనదైన వాగ్ధాటి మూలంగా యువ పార్లమెంటేరియన్ గా వాజ్ పేయి సభలో పెద్దలను ఆకర్షించారు. ప్రతిపక్షంలో అందునా పెద్దగా సంఖ్యా బలం లేని జనసంఘ్ నుంచి వాజ్ పేయికి మాట్లాడేందుకు నాటి ప్రధాని నెహ్రూ ఎన్నో అవకాశాలు ఇచ్చారు. వాజ్ పేయి తన ప్రభుత్వాన్ని నిలదీస్తూంటే నెహ్రూ ఎంతో ముచ్చట పడ్డారు, ప్రోత్సహించారు, అంతే కాదు వాజ్ పేయి నాయకత్వ పటిమను చూసిన ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఏదో ఒకరోజు వాజపేయి దేశ ప్రధాని అవుతాడని ఆనాడే ఊహించారు. ఇక దీన్ దయాళ్ ఉపాధ్యాయ మరణానంతరం జనసంఘ్ మొత్తం బాధ్యతను నాటి యువ నేత అయిన వాజపేయిపై పడింది. 1968 లో జనసంఘ్ జాతీయ అధ్యక్షునిగా ఆయన ఎదిగారు. నానాజీ దేశ్‌ముఖ్, బాల్‌రాజ్ మధోక్, లాల్ కృష్ణ అద్వానీ లతో కలిసి జనసంఘ్‌ను జాతీయస్థాయి ప్రాముఖ్యతను సంతరించుకునే దిశగా నడిపించారు.
ఏడు పదుల వయసులో :
వాజ్ పేయ్ తొలిసారి జనతా ప్రభుత్వంలో విదేశాంగ శాఖ మంత్రిగా 1977లో బాధ్యతలు స్వీకరించారు. రెండున్నరేళ్ల పాటు సాగిన ఆ పదవీకాలంలో ఆయన తన ప్రతిభను చూపించారు. ఇక జనతా ప్రభుత్వం విచ్చిన్నం అయిన తరువాత వాజ్ పేయి 1980లో భారతీయ జనతా పార్టీని స్థాపించారు. అలా దానికి తొలి అధ్యక్షుడు అయ్యారు. 1984లో రెండే సీట్లు బీజేపీకి వస్తే కుంగిపోలేదు, మరింత దూకుడుగా రాజకీయం చేశారు. దాంతో 1989లో బీజేపీ 80కి పైగా సీట్లు సాధించింది. 1991లో అది కాస్తా మరింత పెరిగింది. 1996లో 160 దాకా ఎంపీ సీట్లు సాధించింది. అలా వాజ్ పేయి ఏడు పదుల వయసులో ప్రధానిగా తొలిసారి బాధ్యతలు స్వీకరించారు కానీ బలం సరిపోక కేవలం 13 రోజుల పాటే పీఠం మీద ఉన్నారు.
కలసి వచ్చినా :
ఇక 1998 లో బీజేపీ నాయకత్వంలో మరోసారి అధికారంలోకి వాజ్ పేయి వచ్చారు. పదమూడు పార్టీలతో కలసి ప్రభుత్వాన్ని ఆయన నడిపారు. అయితే ఆ ప్రభుత్వం కేవలం పదమూడు నెలలకే కూలిపోయింది. కేవలం ఒకే ఒక్క ఓటుతో వాజ్ పేయి ప్రభుత్వం మీద విపక్షాలు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. అయితే ఈ రోజులలో మాదిరిగా వాజ్ పేయి ఎవరినీ ఏ విధంగానూ ప్రభావితం చేయలేదు, ఒక్క ఓటు అంటే ఏదో విధంగా మేనేజ్ చేయవచ్చు. ఈ విషయంలో ఎవరు ఏ విధంగా చెప్పినా వాజ్ పేయి నైతిక నిష్టనే నమ్ముకున్నారు. తాను ఫిరాయింపులకు పాల్పడి అధికారంలో కొనసాగడం కంటే జనామోదం కోసమే మొగ్గు చూపారు. అలా 1999లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీయేని ఏర్పాటు చేసి పాతిక పార్టీల మద్దతుతో ప్రజల పూర్తి ఆశీస్సులతో ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటు చేసి 2004 వరకూ అయిదేళ్ళ పాటు జనరంజకంగా వాజ్ పేయి పాలించారు 2004లో ఎన్డీయే ఓటమి తరువాత వాజ్ పేయి ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఆయన 2018 ఆగస్టు 16న 94 ఏళ్ల వయసులో ఈ లోకాన్ని వీడారు.
కవిగా సైతం :
తన జీవితం మొత్తం బ్రహ్మచారిగా గడిపిన వాజ్ పేయి కేవలం రాజకీయ వేత్త మాత్రమే కాదు మహా కవి కూడా. ఎన్నో కవితలను ఆయన రచించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి కవితలలలో తాత్వికత, దేశభక్తి, మానవీయ కోణాలను చూడవచ్చు. అవే అన్నింటా ప్రతిబింబిస్తాయి. ముఖ్యంగా ఆయన కవిత్వంలోని లోతు, లౌకికత, నిరాడంబరత గురించి విశ్లేషణలు కూడా ఎందరో చేశారు. ఏది ఏమైనా వాజ్ పేయి వంటి నేతను ముందు తరాలు చూస్తాయా మళ్ళీ అలాంటి నేతలు వస్తారా అంటే సందేహమే అని చెప్పాల్సి ఉంటుంది.
