Begin typing your search above and press return to search.

40 ఏళ్లకే కెరీర్ ఎండ్ కార్డ్? కార్పొరేట్ ‘ఎక్స్‌పైరీ డేట్’ భయంలో మిడ్-లెవల్ ఉద్యోగులు!

ఒకప్పుడు 40 ఏళ్లు అంటే కెరీర్‌లో అత్యున్నత శిఖరాలకు చేరుకునే వయసు. కానీ నేడు అదే వయసు ఐటీ, కార్పొరేట్ ఉద్యోగులకు ఒక 'గండం'లా మారుతోంది.

By:  A.N.Kumar   |   20 Jan 2026 6:26 PM IST
40 ఏళ్లకే కెరీర్ ఎండ్ కార్డ్? కార్పొరేట్ ‘ఎక్స్‌పైరీ డేట్’ భయంలో మిడ్-లెవల్ ఉద్యోగులు!
X

ఒకప్పుడు 40 ఏళ్లు అంటే కెరీర్‌లో అత్యున్నత శిఖరాలకు చేరుకునే వయసు. కానీ నేడు అదే వయసు ఐటీ, కార్పొరేట్ ఉద్యోగులకు ఒక 'గండం'లా మారుతోంది. పదిహేనేళ్ల అనుభవం, ప్రాజెక్టులను నడిపించే నైపుణ్యం, టీమ్ మేనేజ్‌మెంట్‌లో పట్టు.. ఇవన్నీ ఉన్నా సరే, పింక్ స్లిప్ ఎప్పుడు వస్తుందో తెలియని అభద్రతా భావం ఈ వయసు వారిని వెంటాడుతోంది. అనుభవం 'అసెట్' కావాల్సింది పోయి, కంపెనీల దృష్టిలో భారం గా మారుతుండటం ఆందోళనకరంగా కనిపిస్తోంది..

‘హై కాస్ట్’ టార్గెట్: అనుభవం కంటే పొదుపే ముఖ్యం!

ఇటీవల అంతర్జాతీయ టెక్ దిగ్గజాల నుంచి స్టార్టప్‌ల వరకు జరిగిన లేఆఫ్స్‌ను గమనిస్తే ఒక చేదు నిజం బయటపడింది. తొలగింపునకు గురైన వారిలో అత్యధికులు 35 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న వారే. దీనికి ప్రధాన కారణం జీతాల భారం.

ఒక సీనియర్ ఉద్యోగికి ఇచ్చే ప్యాకేజీతో ముగ్గురు లేదా నలుగురు ఫ్రెషర్లను నియమించుకోవచ్చని కంపెనీలు లెక్కలు వేస్తున్నాయి. ఏఐ (ఏఐ), ఆటోమేషన్ వంటి కొత్త సాంకేతికతలు రావడంతో సీనియర్ల అనుభవం కంటే తక్కువ ధరకు లభించే యువత నైపుణ్యాలకే యాజమాన్యాలు మొగ్గు చూపుతున్నాయి.

ప్రమోషన్లు లేవు.. బాధ్యతలు మాత్రం కొండంత!

మిడ్-లెవల్ మేనేజ్‌మెంట్‌లో ఉన్నవారికి ఇప్పుడు "డెడ్ ఎండ్" కనిపిస్తోంది. "మార్కెట్ బాగులేదు", "ఆర్ధిక మాంద్యం భయాలు" సాకుతో ప్రమోషన్లు ఎగ్గొడుతున్న కంపెనీలు, పని భారాన్ని మాత్రం రెట్టింపు చేస్తున్నాయి. హోదా పెరగదు, జీతం పెరగదు.. కానీ కింద ఉన్న టీమ్ తగ్గిపోవడంతో సీనియర్లే అన్ని పనులు చేయాల్సి వస్తోంది. ఇది ఒక రకమైన 'సైలెంట్ లేఆఫ్' అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రిక్రూట్‌మెంట్‌లో 'ఏజ్ ఫిల్టర్'

ఒకవేళ ఉన్న ఉద్యోగం పోయినా లేదా మారదామన్నా 40 దాటిన వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఇంటర్వ్యూలలో ఎదురయ్యే ప్రధాన అడ్డంకులున్నాయి. "మీ అనుభవానికి మేము అంత జీతం ఇవ్వలేము" అని ముఖం మీదే చెప్పేస్తున్నారు.యువకులతో నిండిన టీమ్‌లో 40 ఏళ్ల వ్యక్తి ఇమడలేరనే ముందస్తు అంచనాతో తీసేస్తున్నారు. 24 ఏళ్ల యువకుడిలా 14 గంటలు ఆఫీసులో గడపలేరనే నెగటివ్ ఫీలింగ్ తో ఈ చర్య తీసుకుంటున్నారు.

కుటుంబ బాధ్యతలు.. మానసిక ఒత్తిడి

ఈ వయసులో ఉద్యోగంపై నీలినీడలు కమ్ముకోవడం వల్ల ఉద్యోగులు తీవ్ర మానసిక కుంగుబాటుకు లోనవుతున్నారు.హోమ్ లోన్లు, పిల్లల ఉన్నత చదువులు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల ఆరోగ్యం.. ఇలా అన్నీ ఈ దశలోనే ముడిపడి ఉంటాయి. రేపు నా పరిస్థితి ఏంటి? అనే భయం నిద్ర లేకుండా చేస్తోంది. ఇది వారి వ్యక్తిగత జీవితంపై, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

గండం గట్టెక్కడం ఎలా? నిపుణుల సూచనలు

పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ మనల్ని మనం కాపాడుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. పాత టెక్నాలజీని వదిలి, ఏఐ వంటి ఆధునిక నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలి. నాకు అన్నీ తెలుసు అనుకోవడం కంటే నేను ఇంకా నేర్చుకోవాలి అనుకోవడమే శ్రీరామరక్ష. కేవలం లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ఉంటే సరిపోదు. ఇండస్ట్రీలో ఉన్న పాత మిత్రులు, కొలీగ్స్‌తో సంబంధాలు పునరుద్ధరించుకోవాలి. రెఫరల్స్ ద్వారా వచ్చే ఉద్యోగాలే ఈ వయసులో కీలకం. కనీసం 6 నెలల నుంచి ఏడాది వరకు జీతం లేకపోయినా ఇల్లు గడిచేలా 'ఎమర్జెన్సీ ఫండ్' సిద్ధం చేసుకోవాలి. అనవసర ఖర్చులు తగ్గించుకుని పెట్టుబడులపై దృష్టి పెట్టాలి.కేవలం ఒక్క ఆదాయ వనరుపైనే ఆధారపడకుండా కన్సల్టెన్సీ, టీచింగ్ లేదా ఫ్రీలాన్సింగ్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి.

40 ఏళ్లు అనేది అనుభవానికి నిదర్శనం.. అంతానికి కాదు. కంపెనీలు వ్యయ నియంత్రణ పేరుతో అనుభవాన్ని తృణీకరిస్తున్న తరుణంలో మనల్ని మనం 'అప్‌డేటెడ్ వెర్షన్'గా మార్చుకోవడమే అసలైన విజయం.