జగన్ రాకపోతే.. కొంపలు మునుగుతాయా.. !
అసెంబ్లీకి సంబంధించి అధికార పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.
By: Garuda Media | 9 Sept 2025 7:00 PM ISTఅసెంబ్లీకి సంబంధించి అధికార పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఈనెల 18 నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపద్యంలో పదేపదే వైసిపి నాయకులు, వైసిపి అధినేత జగన్ సభకు రావాలంటూ టిడిపి నుంచి ప్రకటనలు వెలుపెడుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి మంత్రుల వరకు కూడా పదేపదే జగన్ రావాలి జగన్ రావాలి అనే పిలుపు ఇస్తూ ఉండడం విశేషం. ఇక ఇదే సమయంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు కూడా పదేపదే వైసిపి నాయకులు సభకు రావాలని, మైకు ఇస్తామని, మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తామని కూడా చెబుతున్నారు.
అయితే ఈ విషయంలో తాము ఎప్పటికే నిర్ణయం తీసుకున్నామని వైసిపి నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చేసింది. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే సభకు వచ్చేది లేదని జగన్ ఇప్పటికే పార్టీ నాయకులతో పాటు మీడియాకు కూడా చెప్పేసారు. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కూడా స్పష్టం చేస్తున్నారు. మరి ఇంతగా వైసీపీ ఒక నిర్ణయానికి వచ్చి, సభకు రాకూడదని భేష్మించుకున్న తర్వాత కూడా అధికార పార్టీ నుంచి పదేపదే ఎందుకు ఇలా విజ్ఞప్తులు వస్తున్నాయి? పదేపదే ఎందుకు వైసిపిని వైసీపీ నాయకులను రావాలని పిలుస్తున్నారు? అనే దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది.
సభలో ఇప్పటివరకు చూసుకుంటే టిడిపి, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వం నాయకులు మాత్రమే కనిపిస్తున్నారు. ప్రజల తరపున ప్రశ్నించేందుకు వైసిపి లేకపోవడం పెద్ద మైనస్ గా మారిందన్నది వాస్తవమే. అయితే ఇదంతా అధికార కూటమి తప్పేనని, తమ తప్పులేదని వైసిపి చేస్తున్న ప్రచారం గ్రామస్థాయిలోనూ అదే విధంగా పట్టణ స్థాయిలో కూడా వినిపిస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు సహా స్పీకరు, డిప్యూటీ స్పీకర్లు కూడా అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే తమ తప్పు లేదని నిరూపించుకునేందుకు వారు పదేపదే వైసిపిని ఆహ్వానిస్తున్నారు. అయితే ఇదంతా రాజకీయంగా ఎలా ఉన్నప్పటికీ.. ప్రజల్లో మాత్రం రానన్న వైసీపీని ఎందుకు బెతిమాలుతున్నారు? అనే చర్చ అయితే జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అనవసరంగా ఈ విషయాన్ని భుజాన వేసుకుంటోందని, వారు వస్తే వస్తారు.. రానివారు రారు.. అలాంటప్పుడు వైసీపీ గురించి, జగన్ గురించి అంత ఆయాస ప్రయాస పడటం ఎందుకన్నది సాధారణ ప్రజానీకంతో పాటు సాధారణ రాజకీయ నాయకులు కూడా అడుగుతున్న ప్రశ్న.
కానీ, దీనిపై అధికార పార్టీ నుంచి ఎలాంటి సమాధానం లేదు. వాస్తవానికి చంద్రబాబు సభ నుంచి బాయ్‌కాట్ చేసినప్పుడు.. సీఎంగా ఉన్న జగన్ కనీసం ఒక్కసారి కూడా పిలవలేదు. సభకు వస్తే బాగుంటుందని కూడా అనలేదు. అలాంటిది ఇప్పుడు జగన్‌ను ఎందుకు ఇంతగా బ్రతిమాలుతున్నారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇలా చేయడం వల్ల.. కూటమి ఉద్దేశ పూర్వకంగానే తప్పులు చేసి.. వైసీపీని బ్రతిమాలుతోందన్న చర్చకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందని టీడీపీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు.
