Begin typing your search above and press return to search.

అసోంలో మరో రచ్చ.. 6 ప్రధాన కులాలకు ఎస్టీ హోదా

అసోం మరో భగ్గుమంది. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇందుకు కారణమైంది.

By:  Garuda Media   |   30 Nov 2025 9:47 AM IST
అసోంలో మరో రచ్చ.. 6 ప్రధాన కులాలకు ఎస్టీ హోదా
X

అసోం మరో భగ్గుమంది. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇందుకు కారణమైంది. ఆరు ప్రధాన కులాలకు ఎస్టీ హోదా కల్పించాలన్న ప్రతిపాదనపై మంత్రుల టీం తమ మధ్యంతర రిపోర్టును అసెంబ్లీకి సమర్పించటంతో ఈ అంశం ఇప్పుడు కొత్త అలజడికి కారణమైంది. గిరిజన శాఖా మంత్రి రానిజ్ పెగు తాజా నివేదికను అసెంబ్లీకి సమర్పించారు. దీనిపై గిరిజన విద్యార్థులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఈ జాబితాలోని ప్రధాన కులాల వారు ఎప్పటి నుంచో గిరిజన హోదా కోసం డిమాండ్ చేస్తున్నారు అయితే.. ప్రస్తుతం గిరిజన గుర్తింపు పొందిన వారి ప్రయోజనాలకు ఎలాంటి నష్టం జరగకుండా తాజా నిర్ణయం తీసుకున్నట్లుగా గిరిజన మంత్రి అసెంబ్లీలో వెల్లడించారు. నివేదికలోని అంశాలు.. గణాంకాల్ని సభకు తెలియజేశారు. తాజాగా గిరిజన హోదా కల్పించాలని చెబుతున్న కులాల విషయానికి వస్తే..

- అహోం

- చుటియా

- మొరాన్

- మతక్

- కోచ్ - రాజ్ భోంగ్సి

- తేయాకు ఆదివాసీలు (గిరిజనులు)

ఈ ఆరు కులాల వారు ఎప్పటి నుంచో తమను ఎస్టీలుగా గుర్తించాలని కోరుతున్నారు. తమ ప్రతిపాదన కారణంగా ప్రస్తుతం గిరిజనులుగా ఉన్న వారికి ఎలాంటి నష్టం జరగకుండా ఉండేలా కసరత్తు చేసినట్లుగా పేర్కొన్నారు.దీనికి సంబంధించినే మార్పులుచేర్పులు.. గణాంకాల్ని వెల్లడించారు. అయితే.. ఈ ఆరు బోర కులాలకు ఎస్టీ హోదాపై మంత్రుల టీం సమర్పించిన మధ్యంతర నివేదికపై గిరిజన విద్యార్థి సంఘం భగ్గుమంది.

బహిరంగంగా వారు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. విశ్వవిద్యాలయం నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలోని బోడోలాండ్ ప్రాదేశిక మండలి వరకు గిరిజన విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వారికి అడ్డుగా ఏర్పాటు చేసిన బారికేడ్లను బద్ధలు కొట్టుకొని లోపలకు ప్రవేశించిన ఆందోళనకారులు ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు.

పరిస్థితి చేజారిపోతున్న నేపథ్యంలో అదనపు పోలీసు బలాగాల్నిరంగంలోకి దింపాల్సి వచ్చింది. అప్పటికి కానీ ఆందోళనలు సద్దుమణగలేదు. మంత్రుల రిపోర్టుపై భగ్గుమన్న ఆల్ బోడో స్టూడెంట్స్ అసోసియేషన్.. పలు ఇతర అనుబంధ గిరిజన యూనియర్లు నిరసనలు.. ధర్నాలు.. ర్యాలీల్లో పాల్గొన్నాయి. ఈ అంశాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టటం ఇది రెండోసారిగా చెప్పాలి.