'నా డెత్ సర్టిఫికెట్ పోయింది'.. నెట్టింట కొత్త సందడి!
జనన ధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, రేషన్ కార్డులు రోజువారీ జీవితానికి చాలా అవసరమనే సంగతి తెలిసిందే.
By: Raja Ch | 2 Nov 2025 3:00 PM ISTజనన ధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, రేషన్ కార్డులు రోజువారీ జీవితానికి చాలా అవసరమనే సంగతి తెలిసిందే. అదేవిధంగా.. ఒక వ్యక్తి మరణించిన తర్వాత, మరణ ధృవీకరణ పత్రం చట్టపరమైన, అధికారిక ప్రయోజనాల కోసం చాలా ముఖ్యమైనది. అటువంటి పత్రం ఎవరైనా మరణించిన తర్వాత మాత్రమే జారీ చేయబడుతుందనేది అందరికీ తెలిసిన విషయమే.
అయితే.. తాజాగా ఓ షాకింగ్ విషయం నెట్టింట కొత్త సందడికి కారణమైంది. ఇందులో భాగంగా.. ఒక వ్యక్తి తన మరణ ధృవీకరణ పత్రాన్ని పోగొట్టుకున్నట్లు వార్తలు వచ్చాయి! అతను తన 'మరణ ధృవీకరణ పత్రం' కనిపించడం లేదని ప్రకటిస్తూ ఒక వార్తాపత్రికలో ఒక ప్రకటన ఇచ్చాడు. ఈ విచిత్రమైన నోటీసు చాలా మందిని దిగ్భ్రాంతికి గురిచేసింది.
అవును... ఎవరైనా మరణించిన తర్వాత మాత్రమే జారీ చేయబడే డెత్ సర్టిఫికెట్ పోయిందంటూ ఓ వ్యక్తి ఇచ్చిన ప్రకటన ఇప్పుడు నెట్టింట చర్చకు దారితీసింది. ఇందులో ఒక వార్తాపత్రికలోని ఓ ప్రకటనలో.. రంజిత్ కుమార్ చక్రవర్తి సెప్టెంబర్ 7, 2022న ఉదయం 10 గంటల ప్రాంతంలో అస్సాంలోని లమ్డింగ్ బజార్ లో తన మరణ ధృవీకరణ పత్రాన్ని పోగొట్టుకున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
అయితే ఈ సంఘటన బహుశా క్లరికల్ లేదా టైపింగ్ తప్పు అయి ఉండవచ్చని అంటున్నారు. ఆ వ్యక్తి బహుశా తన జనన ధృవీకరణ పత్రం లేదా తన తండ్రి మరణ ధృవీకరణ పత్రం పోయిందని నివేదించాలని అనుకుని ఉంటాడని అంటున్నారు. అయినప్పటికీ.. ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
'ఇండియా ఈస్ డెఫనెట్లీ నాట్ ఫర్ బిగనర్స్' అనే శీర్షికతో ఉన్న ఈ పోస్ట్ నెట్టింట ఆసక్తికరమైన ప్రతిస్పందనలను పొందింది. ఇందులో భాగంగా... 'వారు అతన్ని స్వర్గంలోకి ప్రవేశించనివ్వడం లేదు.. ఎవరో నకిలీ తయారు చేసి పంపుతారు!' అని ఒకరంటే.. 'ఇది దయ్యాలు ఉన్నాయని నిరూపిస్తుంది' అని మరొకరు చమత్కరించారు.
