Begin typing your search above and press return to search.

'పాక్ తో లింకులు'... మాజీ సీఎం కుమారుడి పై సీఎం సంచలన ఆరోపణలు!

అవును... కాంగ్రెస్ పార్టీ ఎంపీ గౌరవ్ గొగోయ్, ఆయన సతీమణి ఎలిజబెత్ కు పాకిస్థాన్ ఏజెంట్ అలీతో సంబంధాలు ఉన్నాయంటూ అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ సంచలన ఆరోపణలు చేశారు.

By:  Raja Ch   |   8 Feb 2026 11:09 PM IST
పాక్ తో లింకులు... మాజీ సీఎం కుమారుడి పై సీఎం సంచలన ఆరోపణలు!
X

అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కుమారుడు, లోక్ సభలో కాంగ్రెస్ పక్ష ఉపనేత గౌరవ్ గొగోయ్ పై ఆ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సంచలన ఆరోపణలు చేశారు. ఇందులో భాగంగా.. పాకిస్థాన్ ఏజెంట్ అలీ తౌఖీర్ షేక్ తో ఆయనకు సంబంధాలు ఉన్నాయని.. ఇదే సమయంలో ఆ ఏజెంట్ తో గౌరవ్ గొగోయ్ సతీమణి, బ్రిటన్ పౌరురాలైన ఎలిజబెత్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అన్నారు. దీంతో... ఈ ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

అవును... కాంగ్రెస్ పార్టీ ఎంపీ గౌరవ్ గొగోయ్, ఆయన సతీమణి ఎలిజబెత్ కు పాకిస్థాన్ ఏజెంట్ అలీతో సంబంధాలు ఉన్నాయంటూ అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ సంచలన ఆరోపణలు చేశారు. ఆమెకు ఓ పాకిస్థాన్ సంస్థ ఉద్యోగం ఇచ్చిందని.. ఆమె జీతాన్ని అలీ చెల్లించాడని.. అనంతరం ఆమె ఓ భారత సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఆరుసార్లు ఇస్లామాబాద్ కు వెళ్లారని.. తర్వాత మరో సంస్థలో చేరినప్పుడు మూడుసార్లు పాకిస్థాన్ ను సందర్శించారని అన్నారు.

ఈ క్రమంలో ఆమె అటారీ సరిహద్దు మీదుగా మాత్రమే వెళ్లేవారని.. ఎప్పుడూ విమానం ఎక్కలేదని.. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఈ ఆప్షన్ ను ఎంచుకున్నారని.. ఆమె భారత్ కు సంబంధించిన సమాచారాన్ని సేకరించి అలీకి ఇచ్చేవారని ఆరోపించారు. అనంతరం.. గౌరవ్ గొగోయ్ పైనా శర్మ మరిన్ని సంచలన ఆరోపణలు చేశారు.

ఇందులో భాగంగా... గొగోయ్ సైతం తన వివాహానికి ముందు 2013లో రహస్యంగా పాకిస్థాన్ కు వెళ్లారని.. ఆయన ఆ సమయంలో అస్సాం ముఖ్యమంత్రి నివాసంలో ఉండేవారని.. ఆ సమయంలో పాక్ పర్యటన గురించి అస్సాం పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని.. 10 రోజుల ఆ పర్యటనలో ఆయన డిజిటల్ ప్రపంచానికి దూరంగా ఉన్నారని.. ఆ పర్యటన తర్వాతే పార్లమెంటు లో రక్షణ పరికరాలు, అణు విద్యుత్ ప్లాంట్లపై ప్రశ్నలు అడిగారంటూ సంచలన ఆరోపణలు చేశారు.

బుద్దిహీనమైన, బూటకపు ఆరోపణలు!:

ఈ సంచలన ఆరోపణలపై గౌరవ్ గొగోయ్ స్పందించారు. ఈ సందర్భంగా.. రెండున్నర గంటల శర్మ ప్రెస్ మీట్ అట్టర్ ప్లాప్ అని అభివర్ణిస్తూ... ఈ శతాబ్ధంలోనే అత్యంత ఘోరంగా విఫలమైన ప్రెస్ కాన్ఫరెన్స్ ను చూసిన ఢిల్లీ, అస్సాం జర్నలిస్టులపై తనకు జాలిగా ఉందని.. ఇది సీ గ్రేడ్ సినిమా కంటే దారుణమని.. రాజకీయ చతురత ఉందని చెప్పుకునే ఆయన బుద్ధిహీనమైన, బూటకు ఆరోపణలు చేశారని అన్నారు!

అస్సాం ప్రజలకు జ్ఞానం లేదని సీఎం భావిస్తున్నారని.. ఆయన అబద్ధాల కోరు ముఖ్యమంత్రని.. సీఎం కుర్చీని ఆయన అపహ్యాస్యం చేస్తున్నారని.. ఆయన, ఆయన కుటుంబ సభ్యులు ఆక్రమించుకున్న సుమారు 12,000 బిగాల భూముల వ్యవహారాన్ని బయటపెట్టడంలో తాము చేపట్టిన యాత్ర సక్సెస్ అయ్యిందని.. అందుకు పూర్తి విరుద్ధంగా ఆయన మీడియా సమావేశం ఫెయిలైందని అన్నారు.