Begin typing your search above and press return to search.

'ఆపరేషన్ మూవ్ ఎర్త్'... ప్రభుత్వ హత్యలను కప్పిపుచ్చడం కోసం దారుణం!

బషర్‌ అల్‌ అసద్‌.. సిరియా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఎన్నో అకృత్యాలకు పాల్పడినట్టు పలు కథనాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   15 Oct 2025 2:44 PM IST
ఆపరేషన్ మూవ్ ఎర్త్... ప్రభుత్వ హత్యలను కప్పిపుచ్చడం కోసం దారుణం!
X

బషర్‌ అల్‌ అసద్‌.. సిరియా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఎన్నో అకృత్యాలకు పాల్పడినట్టు పలు కథనాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మరో దారుణం తెరపైకి వచ్చింది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. ప్రభుత్వ హత్యలను దాచిపెట్టేందుకు సామూహిక సమాధిని తరలించిందని పేర్కొంది.

అవును... సిరియా అధ్యక్షుడిగా అసద్ ఉన్న సమయంలో జరిగిన హత్యలను దాచిపెట్టేందుకు సుమారు రెండేళ్లపాటు మృతదేహాలను ట్రక్కుల్లో తరలించారని రాయిటర్స్ వెల్లడించింది. మిలిటరీ సహాయంతో ఓ రహస్య ఆపరేషన్‌ నిర్వహించిందని పేర్కొంది. దానికి 'ఆపరేషన్ మూవ్ ఎర్త్' అని పేరు పెట్టారని.. ఉపగ్రహ చిత్రాల ఆధారంగా ఈ ఆపరేషన్ వెలుగులోకి వచ్చిందని తెలిపింది.

ఈ సందర్భంగా సిరియాలో అతిపెద్ద సామూహిక సమాధుల్లో ఒకటైన కుతైఫాను తవ్వి.. అక్కడ నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలోని ధుమైర్ పట్టణం వెలుపల ఉన్న ఎడారి ప్రాంతానికి మృతదేహాలను తరలించారని, అక్కడ మరో సామూహిక సమాధిని సృష్టించారని ఆ కథనం వెల్లడించింది. ఈ దారుణాలు 2019 నుంచి 2021 వరకు జరిగాయని పేర్కొంది.

ఈ సమయంలో... మృతదేహాలను తరలించడానికి రెండేళ్లుగా జరిగిన ప్రయత్నం గురించి తెలిసిన సుమారు 13 మంది ప్రత్యక్ష సాక్షులతో రాయిటర్స్ మాట్లాడినట్లు తెలిపింది. ఇదే క్రమంలో... సంబంధిత అధికారులు సమర్పించిన పత్రాలను సమీక్షించడంతోపాటు వందలాది ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించినట్లు పేర్కొంది. ఈ దారుణాలను అధ్యక్షుడు అహ్మద్ అల్-షరా ప్రభుత్వానికి తెలియజేసింది!

ధుమైర్ ఎడారిలోని ఈ సమాధి 2 కిలోమీటర్ల పొడవుతో కనీసం 34 కందకాలతో సిరియా అంతర్యుద్ధం సమయంలో సృష్టించబడిన అత్యంత విస్తృతమైన సమాధులలో ఒకటి అని రాయిటర్స్ తెలిపింది. ప్రత్యక్ష సాక్షులు, కొత్త స్థలం కొలతలను బట్టి అక్కడ సుమారు పదివేల మందిని ఖననం చేయవచ్చని సూచిస్తున్నాయని రాసుకొచ్చింది!

ఫిబ్రవరి 2019 నుండి ఏప్రిల్ 2021 వరకు సుమారు ప్రతి వారంలో నాలుగు రాత్రులు.. మట్టి, మానవ అవశేషాలతో నిండిన ఆరు నుండి ఎనిమిది ట్రక్కులు కుతయ్ఫా నుండి ధుమైర్ ఎడారి ప్రదేశానికి ప్రయాణించాయని ఆపరేషన్‌ లో పాల్గొన్న సాక్షులు తెలిపారని తెలిపిన రాయిటర్స్.. ఇతర ప్రాంతాల నుండి కూడా మృతదేహాలు ఈ రహస్య ప్రదేశానికి వచ్చాయో లేదో మాత్రం నిర్ధారించలేకపోయింది!

నాడు 'మిషనరీ ఆఫ్ డెత్'!:

అసద్ ప్రభుత్వం గురించి ఈ తరహా వార్తలు గతంలోనూ వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. అతడి హయాంలో చేపట్టిన 'మిషినరీ ఆఫ్‌ డెత్' ఘోరాల్లో 2013 నుంచి సుమారు లక్ష మందికి పైగా కనిపించకుండా పోయారని, చనిపోయేవరకు వారిని చిత్రవధ చేశారని గతంలో యూఎస్‌ కు చెందిన యుద్ధ నేరాల మాజీ రాయబారి స్టీఫెన్‌ రాప్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే.

మరోవైపు అసద్ పాలనలోని అధికారులు సైతం అత్యంత కర్కశంగా వ్యవహరించేవారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... జైల్లోని ఖైదీలను తీసుకెళ్లి తన పెంపుడు సింహానికి ఆహారంగా వేసేవారట.