మునీర్ ని అడకత్తెరలో పోక చెక్క చేస్తోన్న ట్రంప్.. ఇదిగో ప్రూఫ్!
అవును... పాకిస్థాన్ కు అన్నీ తానై నడిపిస్తూ, ఆ దేశ ప్రజాస్వామ్యాన్ని ఆల్ మోస్ట్ తుంగలోకి తొక్కేసిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ (సీడీఎఫ్) మునీర్ కి ఊహించని స్థాయిలో ఓ కష్టం వచ్చింది.
By: Raja Ch | 18 Dec 2025 3:00 AM ISTపాకిస్థాన్ అనధికార అధికారిక నియంత అసిమ్ మునీర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా పాకిస్థాన్ ప్రభుత్వం చేపట్టిన 27వ రాజ్యాంగ సవరణ అనంతరం ఆర్మీ, వాయు, నేవీ, అణ్వాయుధాలు అన్నింటికీ మునీరే చీఫ్. అంతేకాదు ఆయనను జీవితకాలం విచారణ, అరెస్ట్ చేసే అధికారం ఎవరికీ లేదు! పైగా జీవితంతా పైవ్ స్టార్స్ తో ఆ యూనిఫామ్ ధరించే అవకాశం ఆయన సొంతం. ఆ మునీర్ కి తాజాగా ఓ కష్టం వచ్చింది!
అవును... పాకిస్థాన్ కు అన్నీ తానై నడిపిస్తూ, ఆ దేశ ప్రజాస్వామ్యాన్ని ఆల్ మోస్ట్ తుంగలోకి తొక్కేసిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ (సీడీఎఫ్) మునీర్ కి ఊహించని స్థాయిలో ఓ కష్టం వచ్చింది. ‘ఎస్’ అంటే పాక్ లో దేశీయంగా వ్యతిరేకత.. ‘నో’ అంటే ట్రంప్ కు కోపం వచ్చే అవకాశం! అంటే.. ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్నమాట. ఈ నేపథ్యంలో మునీర్ తీసుకునే నిర్ణయం ఆ దేశ భవిష్యత్తును వీలైనంత త్వరలో మార్చనుందని అంటున్నారు.
వివరాళ్లోకి వెళ్తే... గాజా స్టెబిలైజేషన్ ఫోర్స్ (గాజా స్థిరీకరణ దళం) కు తమ దళాలను అందించాలని ఇస్లామాబాద్ ను వాషింగ్టన్ ఒత్తిడి చేస్తుందని తెలుస్తోంది. ఈ విషయంపైనే పాక్ లోని అత్యంత శక్తివంతమైన వ్యక్తి, అత్యంత కఠినమైన పరీక్షను ఎదుర్కొంటున్నారని అంటున్నారు. ఈ ఒత్తిడికి మునీర్ తలొగ్గి, గాజాకు పాక్ సైన్యాన్ని పంపితే.. అది దేశీయంగా తీవ్ర వ్యతిరేకతకు దారితీస్తుందని విశ్లేషకులు అంటున్నారు.
ఒక వేళ ఈ మిషన్ లో భాగం కావడానికి మునీర్ నిరాకరిస్తే.. అది ట్రంప్ ను నిరాశపరచవచ్చని.. అది ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్ కు అతిపెద్ద సమస్య కావొచ్చని అంటున్నారు. ఎందుకంటే.. పాకిస్థాన్ లో పెట్టుబడులు పెట్టాలని, భద్రతా సహాయం అందించాలని అమెరికాను కోరుతున్నట్లు కథనాలొస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో పాకిస్థాన్ కు అన్నీ తానే అన్నట్లుగా మారిన మునీర్ ఇందుకు అంగీకరించకుండా సాకులు చెప్పే పరిస్థితి లేదు!
దీనికితోడు.. మూడో సమావేశం కోసం ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ రాబోయే కొన్ని వారాల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో సమావేశం కావడానికి వాషింగ్టన్ కు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్యా కచ్చితంగా గాజా దళంపై చర్చ జరిగే అవకాశం ఉందని.. ఈ నిర్ణయం పాక్ - అమెరికా ఆర్థిక దౌత్యంలో కీలక పాత్ర పోషించనుందని అంటున్నారు.
కాగా... సుమారు రెండు సంవత్సరాలకు పైగా గాజాను ఇజ్రాయెల్ సైనిక, బాంబు దాడితో నాశనం చేసిన సంగతి తెలిసిందే. ఐడీఎఫ్ దాడికి గాజా స్ట్రిప్ మొత్తం కాంక్రీట్ శిథిలాలుగా మారింది. ఈ నేపథ్యంలోనే దెబ్బతిన్న పాలస్తీనా భూభాగంలో పునర్నిర్మాణం కోసం పరివర్తనం కోసం ముస్లిం దేశాల నుంచి ఒక దళాన్ని నియమించాలని ట్రంప్ 20 పాయింట్ల గాజా ప్రణాళిక పిలుపునిచ్చింది. అందుకు ట్రంప్ సెలక్షన్ పాక్ అని అంటున్నారు!
మునీర్ కు కొంపలో కుంపటి!:
ఒకవేళ ట్రంప్ ఆదేశాలకు మునీర్ అంగీకరిస్తే... అమెరికా, ఇజ్రాయెల్ ను తీవ్రంగా వ్యతిరేకించే పాకిస్థాన్ ఇస్లామిక్ పార్టీల నుంచి నిరసనలు తీవ్రస్థాయిలో చెలరేగే ఆవకాశం ఉందని అంటున్నారు. పైగా పాక్ లో ఇస్లామిస్టులకు వేలాది మందిని సమీకరించే శక్తి ఉందని చెబుతున్నారు. వాస్తవానికి ఇజ్రాయెల్ వ్యతిరేక ఇస్లామిస్ట్ పార్టీని అక్టోబర్ లో నిషేధించారు. ఆ సంస్థ నాయకులు 1,500 మందిని అరెస్ట్ చేశారు.
అయినప్పటికీ.. దాని భావజాలం ఇప్పటికీ పాకిస్థాన్ లోని ప్రతి వీధిలోనూ సజీవంగా ఉందని చెబుతున్నారు. మరోవైపు 2024 ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకుని, విస్తృత ప్రజా మద్దతు పొందిన మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ కూడా ఇలాంటి అవకాశం కోసమే చూస్తుందని అంటున్నారు. ఇవన్నీ వెరసి... మునీర్ కి ముందుంది ముసళ్ల పండుగ అని అంటున్నారు పరిశీలకులు.
