రైలు 'లేట్' అయితే ఏంటి? జర్మనీ కంటే 'గ్రేట్' అంటున్నారుగా..
భారతీయ రైల్వేల సమయపాలన 77 శాతానికి చేరిందని, జర్మనీ రైల్వేల 72 శాతాన్ని అధిగమించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అయితే ఈ గణాంకాలపై ప్రయాణికులు, నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. 15 నిమిషాల ఆలస్యాన్ని కూడా సమయపాలనగా పరిగణిస్తున్నారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. వందే భారత్‌కు ప్రాధాన్యం ఇస్తూ సాధారణ రైళ్లను గంటల తరబడి నిలిపివేస్తున్నారని విమర్శిస్తున్నారు.
By: A.N.Kumar | 25 Nov 2026 11:25 PM ISTఒకప్పుడు మన దేశంలో ’’నీవు ఎక్కవలసిన రైలు ఒక జీవితకాలం లేటు’’ అని ఆరుద్ర గారు ఆరోజుల్లో రాసిన సామెతను స్వాతంత్ర్యం వచ్చిన కొత్తల్లో బాగా చెప్పేవారు. రైలు ప్లాట్‌ఫారమ్ మీదకు ఎప్పుడొస్తుందో దేవుడికి.. లోకో పైలట్‌కి మాత్రమే తెలుసు అంటూ సెటైర్లు వేసేవారు.. ఇకపై మనం మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే.. మన భారతీయ రైల్వేలు సమయపాలనలో ఏకంగా జర్మనీనే దాటేశాయట.. సాక్షాత్తూ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ శుభవార్తను దేశ ప్రజలకు అందించారు. మన రైళ్ల పంక్చువాలిటీ 77 శాతం కాగా.. జర్మనీ రైళ్లది కేవలం 72 శాతమేనట. ఈ లెక్కన చూస్తే టైమ్ మేనేజ్మెంట్ నేర్చుకోవడానికి ఇకపై జర్మన్లు మన సికింద్రాబాద్, విజయవాడ, లేదా హౌరా స్టేషన్లకు వచ్చి క్రాష్ కోర్సులు చేయాల్సిందే..
మంత్రి చెప్పిన ఈ 77 శాతం లెక్క వినగానే స్టేషన్లలో గంటల తరబడి ప్లాట్‌ఫారమ్‌లపై పడిగాపులు కాస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అంటే మనం ఎక్కే ట్రైన్ ఆ మిగిలిన 23 శాతం బ్యాడ్ లక్ కోటాలోకి వస్తుందా? అని తలలు పట్టుకుంటున్నారు. సాధారణంగా మన దగ్గర ఒక రైలు 15 నిమిషాలు లేట్ అయితే దాన్ని ఆన్ టైమ్ కిందే లెక్కేస్తారు. అదే ఒక రెండు గంటలు లేట్ అయితే పాపం.. ట్రాక్ క్లియర్ లేదేమో అని ప్రయాణికులే రైల్వే శాఖను ఓదారుస్తారు. బహుశా జర్మనీలో నిమిషం లేట్ అయినా ఆలస్యం అని రాసుకుంటారేమో.. మన దగ్గర మాత్రం రైలు అసలు రద్దు కాకుండా గమ్యస్థానానికి చేరితే చాలు.. దాన్ని పంక్చువాలిటీ కింద జమ చేసేస్తున్నారేమోనని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
దేశంలో వందే భారత్ రైళ్లు రయ్‌రయ్‌మని దూసుకుపోతున్న మాట నిజమే. కానీ ఆ వీఐపీ రైలుకు దారి ఇవ్వడం కోసం సామాన్యులు ఎక్కే ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఔటర్ సిగ్నల్ దగ్గర గంటల తరబడి నిలబెట్టే త్యాగాల గురించి కూడా మంత్రి గారు ప్రస్తావించి ఉంటే బాగుండేది. ఆధునిక సిగ్నలింగ్, ట్రాక్‌ల ఆధునికీకరణ అంటూ ఎన్ని కబుర్లు చెప్పినా ఉత్తరాదిలో మంచు కురిసినా దక్షిణాదిలో చిన్నపాటి వర్షం పడినా రైళ్ల టైమ్ టేబుల్ మొత్తం తలకిందులవడం మనకు కొత్తేమీ కాదు.
జర్మనీ కంటే మనమే ముందున్నామనే గర్వంతో ఇకపై రైలు 4 గంటలు లేట్ అయినా ప్రయాణికులు ఎవరూ కంప్లైంట్ చేయకూడదు. పైగా మేము జర్మనీ కంటే ఫాస్ట్ అని కాలర్ ఎగరేయాలి. ఒకవేళ జర్మనీ రైల్వే శాఖకు తమ పంక్చువాలిటీని 72 నుండి 77 శాతానికి పెంచుకోవాలని ఉంటే మన దగ్గర లేట్ అనే పదానికి కొత్త నిర్వచనం ఎలా ఇవ్వాలో నేర్చుకుంటే సరిపోతుంది.. ఏమంటారు..?
