అశోక్ కి తొలి పుట్టిన రోజు
అశోక్ ఏ ముహూర్తాన అసెంబ్లీకి నెగ్గారో కానీ వరసగా ఆరు సార్లు విజయనగరం ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ మధ్యలో అనేక సార్లు మంత్రి పదవులు అందుకున్నారు.
By: Satya P | 26 Jun 2026 10:49 PM ISTవిజయనగరం పూసపాటి సంస్థానాధీశులు అయిన పూసపాటి వంశీకులలో వర్తమాన తరంలో ప్రజా జీవితంలో ఎంతో ఉజ్వలంగా వెలుగిన వారిగా అశోక్ గజపతిరాజు సుప్రసిద్ధులు. అటు నుంచి రాజ్యాంగ పదవిలోకి వెళ్ళి గోవా గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత అశోక్ గజపతి తొలి బర్త్ డే శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ నుంచి అనేక మంది ఆయనకు అభినందనలు తెలియచేశారు. అశోక్ ది దాదాపుగా అర్ధ శతాబ్ధం రాజకీయ జీవితం. ఆయన 28 ఏళ్లకే తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. జనతా పార్టీ నుంచి ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆయన సమకాలీనులుగా చంద్రబాబు వైఎస్సార్ వెంకయ్యనాయుడు వంటి వారు ఆ రోజులలో అసెంబ్లీకి తొలిసారి నెగ్గి వచ్చారు.
ఏడు సార్లు ఎమ్మెల్యేగా :
అశోక్ ఏ ముహూర్తాన అసెంబ్లీకి నెగ్గారో కానీ వరసగా ఆరు సార్లు విజయనగరం ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ మధ్యలో అనేక సార్లు మంత్రి పదవులు అందుకున్నారు. 2004లో మాత్రం మొదటిసారి ఓటమి పాలు అయ్యారు. ఇక 2009లో ఆయన గెలిచి తనకు ప్రజాభిమానం తిరుగులేదని అనిపించుకున్నారు. 2014లో విజయనగరం నుంచి లోక్ సభకు పోటీ చేసి కేంద్ర మంత్రిగా నాలుగేళ్ల పాటు పనిచేశారు. ఇంతటి ఉన్నత పదవులు ఎన్ని చేసినప్పటికీ ఆయన ఉన్నా కూడా ఎక్కడా అవినీతి మచ్చ లేదు, నిజాయతీతోనే రాజకీయ జీవితం అంతా గడిపారు. ఇక 2025 లో ఆయనను గోవా గవర్నర్ గా కేంద్రం నియమించింది. దాంతో రాజ్ భవన్ లో ఉంటూ మొదటిసారిగా ఆయన ఆ హోదాలో తన పుట్టిన రోజు వేడుకను జరుపుకుంటున్నారు.
విలువల శిఖరమే :
ఎటువంటి పదవిలో ఉన్నా విలువలను అశోక్ గజపతిరాజు తప్పకుండా పాటించేవారు. ఆయన నిబద్ధత కూడా అలాగే ఉంటూ వచ్చింది. పార్టీకి విధేయుడిగా మెలిగేవారు. తనకు అప్పగించిన పనులను చిత్తశుద్ధితో నెరవేర్చేవారు. విజయనగరం జిల్లాను ఆయన దశాబ్దాలుగా రాజకీయంగా శాసించారు. పార్టీకి ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు ఆయన అండగా ఉంటూ వచ్చారు. అందుకే ఆయన గోవా గవర్నర్ గా నియమితులు అయ్యారన్న వార్త తెలిసిన వెంటనే క్యాడర్ తో పాటు నాయకులు అంతా ఆనందంతో పాటు ఆవేదన చెందారు. తమ అభిమాన నాయకుడు రాజకీయాలకు తమకు దూరం అవుతున్నారని వారంతా కలవరపడ్డారు.
మంత్రుల సమక్షంలో :
ఘనంగా వేడుకలు :
ఇదిలా ఉండగా గోవా రాష్ట్ర గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజును విజయనగరంలో రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మిడి సంధ్యారాణి, పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు అలాగే పలువురు శాసన సభ్యులు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పుట్టినరోజు సందర్భంగా అశోక్ బంగ్లాలో కుటుంబ సభ్యులు, అభిమానుల మధ్య అశోక్ గజపతిరాజు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, ఆయన అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.
