'ఆశ'కు ఆదిలోనే నిరాశ.. కాపుల నుంచి డిమాండ్.. !
వంగవీటి రంగా కుటుంబం నుంచి మరో మహిళ ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. వస్తానని ప్రకటించారు. పేదలు, వారి సమస్యలను తెలుసుకుంటానని.. సాయం చేస్తానని చెప్పారు.
By: Garuda Media | 19 Nov 2025 11:00 PM ISTవంగవీటి రంగా కుటుంబం నుంచి మరో మహిళ ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. వస్తానని ప్రకటించారు. పేదలు, వారి సమస్యలను తెలుసుకుంటానని.. సాయం చేస్తానని చెప్పారు. అదేసమయంలో రాధా-రంగా మిత్రమండలిలో నెలకొన్న వివాదాలనుకూడా పరష్కరించి గాడిలో పెడతాననిచెప్పారు. రాజకీయాల్లోకి వచ్చేది ఇప్పుడే కాదని.. దీనికి కొంత సమయం కూడా ఉందని ఆశా కిరణ్ చెప్పారు. ప్రస్తుతం వైద్య వృత్తిలో ఉన్న ఆశ.. చివరి లక్ష్యం రాజకీయాలేనని తెలుస్తోంది.
నిజానికి ప్రజల మధ్యకు ఎవరు వచ్చినా.. ఏం చేసినా.. అంతిమంగా స్వచ్ఛంద సంస్థ మాదిరిగా అలా ఉండిపోరు. పైగా.. పేదలు, బడుగుల్లో రంగా పేరు ఇంకా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ కుటుంబం కూడా.. రాజకీయంగానే ఎదగాలని కోరుకుంటుంది. ఆశ మాత్రం దీనికి అతీతంగా ఎందుకు వుంటారు. సో.. వచ్చే మూడేళ్లలో పుంజుకునే ప్రయత్నమే చేస్తారు. అయితే.. ప్రస్తుతం ఆమె ప్రజల మధ్యకు రావడాన్ని అందరూ హర్షిస్తున్నారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం కూడా కోరుకుంటోంది.
ఎందుకంటే.. గతంలో కాపుల నుంచి వచ్చిన వంగా గీత.. ఎంపీ అయినా.. కాపు సామాజిక వర్గంలో బలమైన ముద్ర వేయలేకపోయారు. సో.. కాపుల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారు ముఖ్యంగా మహిళల సంఖ్య తక్కువగానే ఉంది. ఉన్నా..వారు బలమైన నాయకులుగా ఎదగలేక పోయారు. ఈ పరిణామాలతో ఆశ అడుగులు పెద్ద ఎత్తన ఆశలు రేపుతున్నాయి. అయితే.. ఈ క్రమంలో కాపుల నుంచి ఆదిలోనే ఆమెకు నిరాశలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న రాజకీయ వర్గాల అంచనా ప్రకారం.. ఆశ రాక వెనుక వైసీపీ ఉందన్న చర్చ జరుగుతోంది.
ఒకవేళ ఇదే నిజమైతే.. వైసీపీలోకి వెళ్లరాదన్నది మెజారిటీ కాపులు కోరుతున్న మాట. కాపులకు వైసీపీ చేసిందిఏమీలేదని వారు చెబుతున్నారు. గతంలో రాధాకు.. టికెట్ ఇవ్వకుండా.. పొగ పెట్టి బయటకు పంపించారని కూడా కాపులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆశ కనుక వైసీపీలోకి ఎంట్రీ ఇస్తే.. మద్దతు ఇచ్చే విషయంపై పునరాలోచన తప్పదని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన రంగా అభిమాన సంఘం తెలిపింది. అయితే.. ఆశ ఇప్పటి వరకు తాను రాజకీయాల్లోకి వచ్చే విషయాన్ని చెప్పలేదు. కానీ.. ముందుగానే.. కాపు నాయకులు ఆమెను హెచ్చరించడం గమనార్హం. మరి ఏం జరుగుతుందో చూడాలి.
