Begin typing your search above and press return to search.

తెల్లోడు ఎలన్ మస్క్ కు ఏం తెలుసు.. ఆఖరుకు ఓవైసీ కూడా ఇచ్చిపడేశాడు

అంతర్జాతీయంగా తీవ్ర ప్రభావం చూపగల వ్యాపారవేత్తలు.. భారత్‌ వంటి సార్వభౌమ దేశాల అంతర్గత, విదేశాంగ వ్యవహారాలపై వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమనే అంశంపై మళ్లీ జోరుగా చర్చ ప్రారంభమైంది.

By:  A.N.Kumar   |   12 Oct 2026 10:05 PM IST
తెల్లోడు ఎలన్ మస్క్ కు ఏం తెలుసు.. ఆఖరుకు ఓవైసీ కూడా ఇచ్చిపడేశాడు
X

అంతర్జాతీయంగా తీవ్ర ప్రభావం చూపగల వ్యాపారవేత్తలు.. భారత్‌ వంటి సార్వభౌమ దేశాల అంతర్గత, విదేశాంగ వ్యవహారాలపై వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమనే అంశంపై మళ్లీ జోరుగా చర్చ ప్రారంభమైంది. ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు ఈ వ్యవహారాన్ని మరోసారి రాజకీయంగా సామాజికంగా వేడెక్కించాయి. ప్రపంచ కుబేరుడు, టెస్లా , ఎక్స్ అధినేత ఎలాన్‌ మస్క్‌ లక్ష్యంగా ఆయన చేసిన విమర్శలు ఇప్పుడు దేశవ్యాప్తంగా విశ్లేషకులను ఆకర్షిస్తున్నాయి.

ఓవైసీ అభ్యంతరం ... ‘గోరా చమ్డా వాలా’ వ్యాఖ్యలు

భారత్‌కు సంబంధించిన సారాంశాలపై ఎలాన్‌ మస్క్‌ చేసిన వ్యాఖ్యలను ఓవైసీ తీవ్రంగా తప్పుబట్టారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ అభ్యర్థన మేరకే ఒక ప్రాంతీయ లేదా అంతర్జాతీయ సంఘర్షణను నిలిపివేయగలమన్నట్లుగా మస్క్‌ సంకేతాలివ్వడాన్ని ఆయన ప్రశ్నించారు. భారత్ ఒక శక్తివంతమైన, స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే ప్రజాస్వామ్య దేశమని, ఇక్కడి వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం మస్క్‌కు ఎవరిచ్చారని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా మస్క్‌ను ఉద్దేశించి ‘గోరా చమ్డా వాలా’ తెల్ల చర్మం ఉన్న వ్యక్తి అని తీవ్ర పదజాలంతో విమర్శించారు.

సార్వభౌమాధికారం వర్సెస్ అంతర్జాతీయ వ్యాపార వేత్తల ప్రభావం

ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్లు, సాంకేతిక దిగ్గజాలు, పారిశ్రామికవేత్తలు తమ ఆర్థిక శక్తులు , సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా రాజకీయ నిర్ణయాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. స్పేస్‌ఎక్స్, శాటిలైట్ ఇంటర్నెట్ స్టార్‌లింక్ , ఎలక్ట్రిక్ వాహనాల సాంకేతికత ద్వారా ప్రపంచ విధానాలపై ప్రభావం చూపుతున్నారు. విదేశీ పారిశ్రామికవేత్తలు వ్యాపారాలకే పరిమితం కావాలా లేక దేశాల దౌత్య సంబంధాలలో మాట్లాడే వెసులుబాటు ఉందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

కేంద్ర ప్రభుత్వం , బీజేపీ వైఖరిపై విమర్శలు

ఈ వ్యవహారంలో ఓవైసీ బీజేపీని కూడా ప్రధానంగా నిలదీశారు. అంతర్జాతీయంగా ప్రముఖులు లేదా విదేశీ శక్తులు భారత వ్యవహారాల గురించి మాట్లాడినప్పుడు అధికార పక్షం స్పందించే తీరుపై ప్రశ్నలు లేవనెత్తారు. సామాన్యులు, బలహీనుల విషయంలో కఠినంగా వ్యవహరించే రాజకీయ వ్యవస్థ, అంతర్జాతీయంగా శక్తివంతులైన వ్యాపారవేత్తల విషయంలో మాత్రం మౌనం వహిస్తోందని ఆరోపించారు.

దేశ ప్రయోజనాలే అంతిమ ప్రమాణం

ప్రపంచీకరణ కాలంలో విదేశీ పెట్టుబడులు, అంతర్జాతీయ సంస్థల సాంకేతిక భాగస్వామ్యాలు భారత్‌ అభివృద్ధికి ఎంత ముఖ్యమో దేశ సార్వభౌమాధికారం స్వతంత్ర నిర్ణయాధికారాన్ని కాపాడుకోవడం కూడా అంతే ప్రాధాన్యం కలిగినది. ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకున్నా సామాన్య ప్రజల సంక్షేమం, జాతీయ ప్రయోజనాలే పరమావధిగా ఉండాలని ఈ వివాదం స్పష్టం చేస్తోంది.

ఓవైసీ వ్యాఖ్యలు రాజకీయ కోణంలో వచ్చినప్పటికీ విదేశీ దిగ్గజాల ప్రభావానికి.. దేశ సార్వభౌమాధికారానికి మధ్య ఉండాల్సిన సమతుల్యతపై స్పష్టమైన విధానం అవసరమని ఇది తెలియజెబుతోంది.