Begin typing your search above and press return to search.

భారత ప్రధానిగా హిజాబ్ ధరించిన మహిళ.. అసద్ మాట విన్నారా?

వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మరోసారి తనదైన వ్యాఖ్యలు చేశారు.

By:  Garuda Media   |   11 Jan 2026 9:00 AM IST
భారత ప్రధానిగా హిజాబ్ ధరించిన మహిళ.. అసద్ మాట విన్నారా?
X

వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మరోసారి తనదైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వేళ ఆయన గొంతు ఎంతలా మారిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తను చెప్పే మాటలు.. ఎవరి దాకానో ఎందుకు.. ఆయన పార్టీకే వర్తించని పరిస్థితి. అలాంటి అసద్.. దేశానికి మొత్తం అప్లై చేయాలన్న ఆకాంక్షను వ్యక్తం చేస్తుంటారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి మిత్రపక్షంగా వ్యవహరించే అసద్.. తన ఏలుబడిలో ఉన్న పాతబస్తీని డెవలప్ ఎందుకు చేయరు? అన్నది మాత్రం సమాధానం లేని ప్రశ్నగా నిలుస్తుంది.

మైనార్టీల సంక్షేమం..వారి బాగు మాత్రమే తన ధ్యేయంగా చెప్పే ఆయన.. హైదరాబాద్ పాతబస్తీని సరికొత్తగా ఎందుకు మార్చరు? అన్నది ప్రశ్న. దశాబ్దాల తరబడి తమ పార్టీకి విధేయులుగా వ్యవహరించే పాతబస్తీ ప్రజలకు మేలు చేసేలా.. వారి జీవితాల్లో సరికొత్త వెలుగు నిండేలా చేసేందుకు అసద్ ఎంతమేర శ్రమిస్తారో తెలిసిందే. పాతబస్తీకి ఇప్పటికి మెట్రో లేని పరిస్థితి. రేవంత్ సర్కారు పట్టుబట్టిన వేళ.. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి.

ఆ విషయాన్ని పక్కన పెడితే.. తాజాగా మహారాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశారు అసద్. ఏదో ఒక రోజున హిజాబ్ ధరించిన మహిళ భారత ప్రధాని అవుతుందన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. పాకిస్థాన్ లా కాకుండా భారత రాజ్యాంగం అన్ని మతాల వారికీ అవకాశం కల్పిస్తోందన్న ఆయన.. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులపై మాత్రం విచారం వ్యక్తం చేయరు.

భారతదేశంలో మైనార్టీలకు ఎలాంటి ఇబ్బంది లేదన్న మాట కూడా మాట్లాడరు. కానీ.. భారత ప్రధానిగా మాత్రం హిజాబ్ ధరించిన మహిళ ఉండాలని కోరుకుంటారు. ప్రజాస్వామ్య భారతంలో ఏ నేత అయినా తన కలల్ని బాహాటంగా చెప్పుకోవటం తప్పు కాదు. భారత ప్రధానిగా హిజాబ్ ధరించిన మహిళ అవ్వాలన్న ఆకాంక్షను వ్యక్తం చేసే అసద్.. హైదరాబాద్ లో తమ పార్టీకి పట్టున్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్ని స్థానాల్లో ఇప్పటివరకు ఎందరు మహిళలకు అవకాశం ఇచ్చి.. ఎమ్మెల్యేలుగా చేశారు? అన్న ప్రశ్నకు సమాధానం చెబితే బాగుంటుంది?

అంతదాకా ఎందుకు? తన పార్టీకి అధినేతగా హిజాబ్ ధరించిన మహిళాను ఎందుకు ఎంపిక చేయరు? అన్నది మరో ప్రశ్న. హిజాబ్ ధరించిన మహిళ భారత ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షను వ్యక్తం చేసే అసద్.. ఫలానా వస్త్రధారణతో ఉండాలన్న ఆకాంక్షను వ్యక్తం చేయటం ఏమిటి? అన్నది మరో ప్రశ్న. ఎవరు ఎలా ఉండాలన్నది చెప్పటానికి అసద్ ఎవరు? ముస్లిం మహిళలు ఎవరు ఎలా ఉండాలి? ఎలాంటి వస్త్రధారణ ఉండాలన్న దానిపై ఎవరి ఇష్టం వారిది. అందుకు భిన్నంగా అసద్ చేసే వ్యాఖ్యల్ని మైనార్టీ మహిళలు ఎందుకు ప్రశ్నించరు? అన్నది మరో ప్రశ్న.

అసద్ చేసిన వ్యాఖ్యలపై పలువురు స్పందిస్తున్నారు. తొంభై శాతం హిందువులు ఉన్న దేశంలో హిజాబ్ లేదంటే బురఖా ధరించిన మహిళ ప్రధాని మాత్రమే కాదు ముంబై మేయర్ కూడా కాలేరని ఒకరంటే.. ఎవరైనా అలాంటి కోరిక ఉంటే కరాచీ లాంటి ఇస్లామిక్ దేశాలకు వెళ్లి ప్రయత్నం చేసుకోవాలన్న వ్యాఖ్య చేశారు మహారాష్ట్ర మంత్రి నితీశ్ రాణె. ప్రధాని పదవి గురించి మాట్లాడే ఓవైసీ ముందు హిజాబ్ ధరించిన మహిళను తన పార్టీకి అధ్యక్షురాలిని చేయాలని షెహజాద్ పూనావాలా చేసిన వ్యాఖ్యకు అసద్ రియాక్టు అవుతారా? ఆయనకు ఆ ధైర్యం ఉందా? అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.