Begin typing your search above and press return to search.

జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా బొంతు రామ్మోహన్..!! కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని ప్రతిపాదించిన ఎంపీ అర్వింద్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిని ఎంపిక చేయడంలో బీజేపీ తీవ్ర తర్జనభర్జన పడుతోందా? గెలుపే టార్గెట్ గా పెట్టుకున్న ఆ పార్టీ ఆరుగురు అభ్యర్థుల పేర్లను పరిశీలనకు తీసుకుంది.

By:  Tupaki Political Desk   |   10 Oct 2025 4:05 PM IST
జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా బొంతు రామ్మోహన్..!! కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని ప్రతిపాదించిన ఎంపీ అర్వింద్
X

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిని ఎంపిక చేయడంలో బీజేపీ తీవ్ర తర్జనభర్జన పడుతోందా? గెలుపే టార్గెట్ గా పెట్టుకున్న ఆ పార్టీ ఆరుగురు అభ్యర్థుల పేర్లను పరిశీలనకు తీసుకుంది. వీరి బలాబలాలపై ఆరా తీసిన పార్టీ కమిటీ ముగ్గురు అభ్యర్థులను షార్ట్ లిస్టు చేసి అధిష్టానానికి నివేదించింది. పార్టీ హైకమాండ్ ఈ ముగ్గురిలో ఒకరి పేరు ప్రకటించనుంది. ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే తెలంగాణ బీజేపీ కీలక నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పార్టీ అభ్యర్థి ఎంపికపై సంచనల ప్రతిపాదన చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పార్టీ పెద్దలు ఆరుగురు అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తుండగా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ మేయర్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు బొంతు రామ్మోహన్ కు బీజేపీ టికెట్ ఇస్తే బాగుంటుందని అర్వింద్ చేసిన సూచన ఇరుపార్టీల్లో కలకలం రేపింది.

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న బొంతు రామ్మోహన్ కు గతంలో ఏబీవీపీ నేపథ్యం ఉందని, అంతేకాకుండా నగర మేయర్ గా పనిచేసిన అనుభవం, బీసీ నేతగా గుర్తింపు ఉండటంతో ఆయనను పార్టీలోకి తీసుకుని అభ్యర్థిగా రంగంలోకి నిలపాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ సూచించారు. అయితే ఆయన ఇలా సూచించడానికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? లేక పార్టీని గెలిపించాలనే తాపత్రయమే ఇందుకు కారణమా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జూబ్లీహిల్స్ బీజేపీ టికెట్ ను ఆరుగురు నేతలు ఆశిస్తున్నారు. వీరిలో గత ఎన్నికల్లో పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డి, జుటూరు కీర్తిరెడ్డి, పద్మ వీరపనేని మధ్య తీవ్ర పోటీ కనిపిస్తోందని అంటున్నారు. ఇదే సమయంలో అట్లూరి రామక్రిష్ణ, ఆకుల విజయ, గతంలో హైదరాబాద్ ఎంపీగా పోటీ చేసిన మాధవీలత పేర్లు కూడా పార్టీ నేతలు పరిశీలించారు.

అయితే వీరు ఎవరూ కాకుండా కాంగ్రెస్ లో ఉన్న మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరును ఎంపీ అర్వింద్ ప్రతిపాదించడం సంచలనంగా మారింది. ఇది కాంగ్రెస్ శ్రేణులతోపాటు బీజేపీ నేతలను ఉలికిపాటుకు గురిచేసింది. కాంగ్రెస్ టికెట్ రేపులో బొంతు రామ్మోహన్ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీస్సులతో యువనాయకుడు నవీన్ యాదవ్ టికెట్ దక్కించుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంపీ అర్వింద్ బీజేపీ అభ్యర్థిగా బొంతు రామ్మోహన్ పేరు ప్రతిపాదించి కాంగ్రెస్ పార్టీలో అనుమానాలు రేకెత్తించారు. అయితే కాంగ్రెస్ పార్టీలో గందరగోళం స్రుష్టించడానికే ఎంపీ అర్వింద్ ఈ ప్రతిపాదన చేశారా? లేక గెలుపు గుర్రం అనే ఆలోచనతో బీజేపీలోకి బొంతు రామ్మోహన్ ను తీసుకురావాలన్న ఆలోచన ఉందా? అనేది చర్చనీయాంశంగా మారింది.

కాగా, ఎంపీ అర్వింద్ ప్రతిపాదన తెలుసుకున్న మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఒకసారిగా ఉలికిపాటుకు లోనయ్యారు. తాను అధికార కాంగ్రెస్ పార్టీలో సంతృప్తిగా ఉన్నానని, బీజేపీ టికెట్ పై పోటీ చేస్తానన్న ప్రచారంలో వాస్తవం లేదని ఖండిస్తున్నారు. బీజేపీ అంతర్గత చర్చల్లో తన పేరు ప్రస్తావనకు తీసుకువస్తే తనకేం సంబంధం అని ఆయన ప్రశ్నిస్తున్నారు. మాజీ మేయర్ మాటలను బట్టి బీజేపీలోకి వెళ్లేందుకు ఆయన ఆసక్తి లేదన్న విషయం అర్థమవుతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.