మోడీ దిగిపోతారు...ఈ జోస్యం ఆయనది !
నరేంద్ర మోడీ నిన్ననే తన పాలనలో ఎవరూ అందలేనంత రికార్డుని అందుకున్నారు. దేశంలో అత్యధిక కాలం పాలన చేసిన నేతగా నిలిచారు.
By: Satya P | 24 March 2026 5:00 PM ISTనరేంద్ర మోడీ నిన్ననే తన పాలనలో ఎవరూ అందలేనంత రికార్డుని అందుకున్నారు. దేశంలో అత్యధిక కాలం పాలన చేసిన నేతగా నిలిచారు. ఆయన పదవీ కాలం ఇంకా 39 నెలలు ఉంది. 2029 లో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయనే అంటున్నారు. అప్పటిదాకా మోడీ ప్రధానమంత్రి పదవికి అయితే తిరుగులేదు. ఎన్డీయే మిత్రులు కూడా బాసటగా నిలుస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వరస విజయాలు సాధిస్తున్నారు. ఒకవేళ ఒకటి రెండు ఓడినా కేంద్రంలో ప్రభుత్వానికి వచ్చే ఢోకా ఏమీ లేదు. కానీ ఒక నాయకుడు మాత్రం మోడీ గద్దె దిగిపోతారు అని తనదైన శైలిలో జోస్యం చెబుతున్నారు.
మోడీ 2027కి మాజీ :
మోడీ 2026 చివరిలోనే ప్రధాని పదవి నుంచి తప్పుకుంటారు అని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ క్రేజీ జోస్యం వదిలారు. పైగా ఇది తన రాజకీయ అనుభవంతో చెబుతున్నాను అని అన్నారు. మోడీ 2026 ముగిసేనాటికి పదవిలో ఉండరని క్రేజీవాల్ చెప్పారు అంటే మరో తొమ్మిది నెలలో మోడీ మాజీ ప్రధాని అవుతారు అని ఆయన గట్టిగా చెబుతున్నారు. 2027 నాటికి ఆయన లేని ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడుతుందని అంటున్నారు. అంతే కాదు అమిత్ షా సైతం కేంద్ర రాజకీయాల్లో బలంగా ఉండలేరని ఆయన రాజకీయాలకు కూడా కాలం చెల్లిందని కేజ్రీవాల్ అంటున్నారు. దీంతో కేజ్రీవాల్ వ్యాఖ్యలు ఇపుడు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నాయి.
అదెలా సాధ్యం :
నిజమే కేంద్రంలో బీజేపీకి మెజారిటీ లేదు, మ్యాజిక్ ఫిగర్ కి 30 కి పైగా సీట్లు తగ్గాయి. అయితే మిత్రులు అండగా ఉంటున్నారు. కానీ ఇది రాజకీయం. కాలమెప్పుడూ ఒకేలా ఉండదు, అందుకే కేజ్రీవాల్ ఈ మాటలు అన్నారా అన్న చర్చ నడుస్తోంది. ఇక బెంగాల్ లో మమతా బెనర్జీ ఇండియా కూటమిలో కీలక నాయకురాలిగా అవతరిస్తారు అన్న మాట సైతం ఉంది. ఆమె కనుక వరసగా బెంగాల్ కి నాలుగవసారి సీఎం అయితే మాత్రం అది కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి షాకింగ్ న్యూస్ అని అంటున్నారు. మమత కనుక ఇండియా కూటమి పగ్గాలు అపుడు చేపడితే దేశంలో తటస్థ పార్టీలు కూడా మద్దతు ఇవ్వవచ్చు లేదా ఎన్డీయేలో సైతం కొంత కలవరం రేగవచ్చు అన్న చర్చ ఉంది. ఇక స్టాలిన్ కూడా రెండోసారి తమిళనాడు సీఎం అయితే ఆ పరిణామాలు వేరేగా ఉంటాయని అవి ఎన్డీయేకు సవాల్ విసిరేవిగా మారుతాయని అంటున్నారు. ఇక కేరళలో కాంగ్రెస్ గెలిస్తే కనుక ఎన్డీయేకు పెను సవాల్ విసరవచ్చు అని అంటున్నారు. ఇవన్నీ ఆలోచించి విశ్లేషించి అరవింద్ కేజ్రీవాల్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారా అన్న చర్చ అయితే సాగుతోంది.
బలంగానే బీజేపీ :
అయితే బీజేపీ మాత్రం ఈ రోజుకీ బలంగానే ఉంది. బలహీనంగా ఉన్న చోటనే కడ దాకా పోరాడే నేర్పూ ఓర్పు ఉన్న బీజేపీ తాము ఇపుడు కంఫర్ట్ జోన్ లో ఉంటూండగా జరిగే పరిణామాలు ఎదురయ్యే సవాళ్ళను ఎంతో ధీటుగా ఎదుర్కొంటుందని అంటున్నారు. అయితే అంతర్జాతీయ పరిణామాలు కూడా మరో వైపు మారుతున్నాయి. యుద్ధం ఇదే తీరున కొనసాగితే దేశంలో కరోనా నాటి పరిస్థితులే సంభవిస్తే అపుడు ఎలాంటి వాతావరణం ఉంటుందో కూడా ఎవరూ చెప్పలేరని అంటున్నారు. ఏది ఏమైనా కేజ్రీవాల్ ఎపుడూ జోస్యాలు అయితే చెప్పలేదు, ఇపుడు చెబుతున్నారు అంటే ఆలోచించాల్సిందే అంటున్నారు.
