'అరుంధతి' అఘోర సీన్ పై ఉజ్జయిని మహంకాళి పూజారి షాకింగ్ కామెంట్!
స్వర్గీయ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో 2009లో విడుదలై భారీ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న అరుంధతి సినిమా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.
By: Madhu Reddy | 4 Aug 2026 11:27 AM ISTస్వర్గీయ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో 2009లో విడుదలై భారీ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న అరుంధతి సినిమా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అనుష్క, సోనుసూద్, అర్జున్ బజ్వా ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా ఏకంగా ఏడు విభాగాలలో రాష్ట్ర ప్రభుత్వం నుండి నంది పురస్కారాలను సొంతం చేసుకుంది. శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మాణంలో చింతపల్లి రమణ అందించిన స్టోరీ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇకపోతే ఈ సినిమా గురించి.. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల వల్ల.. ఆ చెడు ప్రభావం తనపై పడింది అంటూ ఉజ్జయిని మహంకాళి దేవాలయ ప్రధాన పూజారి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేసిన కామెంట్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
అరుంధతిలో నటించింది నిజమైన అఘోరాలా?
పశుపతిని అంతం చేయాలి అంటే.. జేజమ్మ ప్రాణార్పణ చేయాలి అని అఘోరాలు చెబుతారు. దీంతో ప్రాణత్యాగం చేయాలని నిర్ణయించుకున్న ఆమె.. అఘోరాల వద్దకు వచ్చి భరించలేని, బాధాకరమైన చావును ఇవ్వమని వారిని అడుగుతుంది. తాను పడబోయే నరకయాతన పశుపతి ప్రేతాత్మ మీద తన ప్రతీకారపు వాంఛను రగిలేలా చేయాలని కోరుతుంది. ఆ సమయంలో అఘోరాలు ఆమె తల మీద కొబ్బరికాయలు పగలగొడతారు . ఆమె శవాన్ని కొయ్యపై కాల్చి అఘోరాలు ఆమె ఎముకలతో శక్తివంతమైన ఆయుధాన్ని సృష్టించే సన్నివేశం సినిమాకే హైలెట్ ఆ సీన్ చూస్తున్నంత సేపు ఒళ్ళు గగుర్పొడుస్తుంది.
అరుంధతి చెడు ప్రభావం వల్లే నాకు క్యాన్సర్స్ అవుతుంది - ప్రధాన పూజారి
అయితే ఇక్కడ కనిపించింది నిజమైన అఘోరాలని , తాజాగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయ ప్రధాన పూజారి వేణుమాధవ్ శర్మ చేసిన కామెంట్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో సంచలన విషయాలను బయటపెట్టారు. ఆయన మాట్లాడుతూ.. "ఈ సినిమాలో నటించిన కొన్ని రోజులకే నాకు క్యాన్సర్ సోకింది. ఆ సీన్లలో ఉన్న నెగటివ్ ఎనర్జీ ప్రభావం వల్లే నాకు ఈ ప్రాణాంతక వ్యాధి వచ్చిందని నేను నమ్ముతున్నాను. వైద్యుల చికిత్స తో పాటు నేను నిత్యం కొలిచే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి అనుగ్రహం దైవ శక్తి వల్లే నేను మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకొని ప్రాణాలతో బయటపడ్డాను. సినిమా గ్లామర్ వెనుక ఇలాంటి నమ్మలేని దైవిక అనుభవాలు కూడా ఉంటాయని కచ్చితంగా నేను చెప్పగలను" అంటూ ఆయన చెప్పుకొచ్చారు . ఏది ఏమైనా అమ్మవారి లీలలు నిజంగా అపరిమితం అంటూ వేణుమాధవ్ శర్మ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
అందుకే కోడి రామకృష్ణ చేతులకు దారాలు కట్టుకున్నారా?
ఉజ్జయిని మహంకాళి దేవాలయ ప్రధాన పూజారి వేణుమాధవ్ శర్మ చేసిన కామెంట్లను బట్టి చూస్తే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ ఎందుకు తన చేతులకు దారాలు, తలకు పాగా కట్టుకున్నారో అర్థమవుతుంది. ముఖ్యంగా ఆయన ఇలాంటి చిత్రాలను ఎక్కువగా తెరకెక్కించారు. కాబట్టే వాటి తాలూకా చెడు ప్రభావం తనపై పడకుండా కొంతమంది పూజారుల చేత ఆయన ప్రత్యేకించి ఇలా తాళ్ళను కట్టించుకున్నట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.. అయితే ఇప్పుడు ప్రధాన పూజారి చేసిన కామెంట్లను బట్టి చూస్తుంటే ఆ మాటలు నిజమే అని అందరూ నిర్ధారణకు వస్తున్నారు. ఏది ఏమైనా సినిమాలు కూడా నిజ జీవితంలో ఇలాంటి ఘటనలకు దారితీస్తాయా అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
