Begin typing your search above and press return to search.

అరుణాచల మోక్షమార్గం.. ఇక మునుపటిలా ఉండదు

తమిళనాడులోని అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి దర్శనానికి ప్రతిరోజూ వేలాదిగా.. పౌర్ణమి సమయాల్లో లక్షలాదిగా భక్తులు తరలివస్తుంటారు.

By:  A.N.Kumar   |   3 Aug 2026 1:21 AM IST
అరుణాచల మోక్షమార్గం.. ఇక మునుపటిలా ఉండదు
X

తమిళనాడులోని అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి దర్శనానికి ప్రతిరోజూ వేలాదిగా.. పౌర్ణమి సమయాల్లో లక్షలాదిగా భక్తులు తరలివస్తుంటారు. అరుణాచల గిరిప్రదక్షిణతో పాటు కొండపై ఉన్న మోక్షమార్గం ద్వారా ప్రయాణించి స్వామివారిని దర్శించుకోవడం ఎంతో పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. అయితే ఇటీవల కాలంలో ఈ మార్గంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరగడం.. కొన్ని ప్రమాదాలు.. అత్యవసర వైద్య పరిస్థితులు చోటుచేసుకోవడంతో ఆలయ అధికారులు, స్థానిక యంత్రాంగం అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. భక్తుల ప్రాణ భద్రతకు అత్యున్నత ప్రాధాన్యమిస్తూ మోక్షమార్గంలో కొత్త నిబంధనలను, వేళలను అమల్లోకి తీసుకొచ్చారు. అరుణాచల యాత్రకు వెళ్లే భక్తులు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.

ప్రవేశ ద్వారం వద్ద ప్రత్యేక ఇనుప గ్రిల్ ఏర్పాటు

మోక్షమార్గంలో తోపులాటలను నివారించడానికి, భక్తుల రాకపోకలను క్రమబద్ధీకరించడానికి అధికారులు మోక్షమార్గం ప్రారంభంలో ఒక ప్రత్యేక ఇనుప గ్రిల్‌ను ఏర్పాటు చేశారు

ఇకపై ఈ గ్రిల్‌లోని నిర్ణీత ప్రవేశ మార్గం గుండా వెళ్లే వారికే మోక్షమార్గంలోకి అనుమతి ఉంటుంది. దీనివల్ల అనవసర రద్దీ తగ్గడమే కాకుండా ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే సహాయక చర్యలు వేగవంతం చేయడానికి వీలవుతుంది.

మోక్షమార్గం వినియోగ సమయాలు

గతంలో మాదిరిగా ఏ సమయంలో పడితే ఆ సమయంలో మోక్షమార్గంలోకి వెళ్లడానికి వీల్లేకుండా ఆలయ అధికారులు కఠిన సమయ వేళలను నిర్ణయించారు. ప్రతిరోజూ ఉదయం 6:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు మాత్రమే భక్తులను మోక్షమార్గంలోకి అనుమతిస్తారు. రాత్రి 8:00 గంటల తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా ఈ మార్గాన్ని పూర్తిగా మూసివేస్తారు. అరుణాచల గిరిప్రదక్షిణకు వెళ్లే భక్తులు ఈ వేళలను దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణ ప్రణాళికను ముందుగానే సిద్ధం చేసుకోవాలని అధికారులు కోరారు.

అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు & వైద్య సదుపాయాలు

ఇటీవల మోక్షమార్గంలో పయనిస్తున్న సమయంలో కొందరు భక్తులు హఠాత్తుగా అస్వస్థతకు గురికావడం, తక్షణ వైద్య సహాయం అవసరమైన ఘటనలు నమోదయ్యాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మార్గం వెంట పలు కీలక ప్రాంతాలలో అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్ల బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రయాణంలో ఎవరికైనా అనారోగ్యం చేసినా, ప్రమాదం జరిగినా లేదా ఇతర సమస్యలు ఎదురైనా వెంటనే ఈ నంబర్లకు సమాచారం అందించవచ్చు. సమాచారం అందిన తక్షణమే స్పందించి వైద్య సహాయం అందించేలా ప్రత్యేక రెస్క్యూ బృందాలను సిద్ధంగా ఉంచారు.

అధికారుల ముఖ్యమైన విజ్ఞప్తి , హెచ్చరిక

ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన ఇనుప గ్రిల్ విషయంలో అధికారులు భక్తులకు స్పష్టమైన సూచనలు జారీ చేశారు. శారీరక ఇబ్బందులు ఉన్నవారు, ఊబకాయం లేదా ఇతర ఆరోగ్య సమస్యల వల్ల గ్రిల్‌లో సరిగ్గా పట్టనివారు బలవంతంగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరిస్తున్నారు. అలా బలవంతంగా వెళ్లే ప్రయత్నం చేయడం వల్ల గాయపడే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. శారీరకంగా దృఢంగా ఉన్నవారు మాత్రమే ఈ మార్గాన్ని ఎంచుకోవాలని, ఇబ్బందులు ఉన్నవారు సాధారణ గిరిప్రదక్షిణ మార్గం ద్వారా ప్రయాణించడమే సురక్షితమని సూచిస్తున్నారు.

ఆధ్యాత్మికంగా అరుణాచల మోక్షమార్గం ఎంతో విశిష్టమైనది.. పవిత్రమైనది అయినప్పటికీ భక్తుల ప్రాణ భద్రత, ఆరోగ్యమే అత్యంత ముఖ్యమని ఆలయ అధికారులు స్పష్టం చేస్తున్నారు. కాబట్టి అరుణాచల క్షేత్రానికి వెళ్లే భక్తులందరూ ఈ కొత్త నిబంధనలు, సమయాలను పాటిస్తూ అధికారులకు సహకరించాల్సిందిగా కోరడమైనది. ఈ నిబంధనలు పాటించడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా అరుణాచలేశ్వర స్వామి దర్శనం, గిరిప్రదక్షిణ పూర్తి చేసుకోవచ్చు.