Begin typing your search above and press return to search.

పరుగు ఆపడం బ్రహ్మ విద్య

పుట్టినప్పుడు బుడి బుడి అడుగులు వేసే స్థితిలో పరుగులు తీయాలని ఆశ ఉంటుంది.

By:  Satya P   |   24 Nov 2025 4:00 AM IST
పరుగు ఆపడం బ్రహ్మ విద్య
X

పుట్టినప్పుడు బుడి బుడి అడుగులు వేసే స్థితిలో పరుగులు తీయాలని ఆశ ఉంటుంది. ఆ పట్టుదలతో పరుగు అన్న విద్యను సాధిస్తారు పసి కూనలు. అలా మొదలైన పరుగు ఎక్కడా ఆగదు, చదువుల నుంచి జీవితంలో ఉపాధి కోసం మంచి సామాజిక స్థితి కోసం, సుస్థిర ఆర్థిక జీవితం కోసం పరుగే పరుగు. పోటీ ప్రపంచంలో ఎక్కడ పరుగు ఆపితే రేసులో వెనకబడిపోతామో అని అలాగే కొనసాగిస్తూ వస్తారు. అయితే జీవితంలో అనుకున్న లక్ష్యాలను విజయాలను సాధించడం కోసం పరుగు అన్నది ఎంత ముఖ్యమో ఆ పరుగులు ఒక దశలో ఆపడమూ అంతే ముఖ్యం. పరుగు నేర్చుకోవడం కోసం ఎంతో కష్టపడతారు, కానీ ఆ పరుగుని ఎలా ఎపుడు ఆపాలో మాత్రం ఎవరూ నేర్పలేరు, అది కూడా ఒక బ్రహ్మ విద్యనే. నిజానికి ఈ విద్యను ఎరిగిన వారే విజ్ఞులు వివేకవంతులుగా సమాజంలో పరిగణించబడతారు.

ఏ రంగంలో అయినా :

ఎవరు ఏ ఫీల్డ్ లో అయినా తాము ఒకటవ స్థానానికి చేరుకోవాలని చూస్తారు. అలా శ్రమిస్తూ అక్కడికి చేరుకున్నాక ఏమి ఉంటుంది, అంటే దిగిపోయే దారే అని చెప్పాలి. ఒకటి నుంచి మళ్ళీ వెనక్కే రావాలి. అలా పరుగు ఆపాల్సిందే. ఒకటవ నంబర్ లో ఎవరూ ఎల్ల కాలమూ ఉండలేరు, ఎందుకంటే వారి తరువాత వారు వస్తారు, ఆ నంబర్ వారిది అవుతుంది. ఈ నిరంతరం పోటీలో ఒకటి ఎపుడూ ఒంటరి అంకెగానే ఉంటూ ఎందరిలో అవకాశాలను ఇస్తుంది. లక్ష్యాలను నిర్దేశిస్తుంది. అలా నంబర్ వన్ గా రేసులో సక్సెస్ చూసిన వారు ఇక ఎక్కడో ఒక చోట పరుగు ఆపాల్సి ఉంటుంది. అదే వారి జీవితానికి గౌరవాన్ని మన్ననను తెచ్చి పెడుతుంది.

ఆగకపోతే :

ఇక పరుగు అన్నది ఆపకపోతే ఏమవుతుంది అన్నది కూడా ఒక ఆసక్తికరమైన చర్చ. పరుగు ఆపడం ఎక్కువ మంది తరం కాదు, అందులో ఉండే మజా చూసిన వారికి అసలు వీలు కాదు, వారు అలా సాగిపోవాలని చూస్తారు. కానీ చప్పట్లు కొట్టే వారు మాత్రం క్రమంగా తగ్గిపోతూ ఉంటారు. ఒక దశలో ప్రోత్సహించిన వారే వెనక్కి చూస్తే పెద్దగా కనిపించరు, ఎందుకంటే ఈ పరుగు ఆగకపోయినా అవతల వారి ఆలోచనలు మాత్రం మారిపోతాయి. వారు మరొకరికి తమ చప్పట్లతో ప్రోత్సాహం అందిస్తారు, వారిని నంబర్ వన్ రేసులో ఉంచాలని చూస్తారు. అలాంటపుడు ఇంకా పరుగు తీస్తూ అలసిపోతున్న వారు ముందటి అభిమానాన్ని సైతం తగ్గించుకొని చివరికి ఏమీ కాకుండా అయిపోతారు.

విసిగించకుండానే :

జీవితం అన్నది ఏకమొత్తంగా కనిపిస్తున్నా అందులో అనేక దశలు ఉంటాయి. ఒక్కో దశలో ఒక్కో కధ ఉంటుంది. ఈ దశలు అన్నీ దాటిన వారికి అనివార్యంగా విరామం అన్న కీలక దశ ఉంటుంది. అలా కాదని పెవిలియన్ వైపు చూడనని ఎవరైనా మొరాయిస్తే వారిని గ్రౌండ్ అసలు పట్టించుకోదు, ఆనక వారే ఇక్కట్లు పడతారు అందుకే పరుగు ఎపుడు ఎక్కడ ఆపాలన్నది అతి పెద్ద కళ. ఎవరి చేత మాట పడకుండా ఎవరి నోటా విసుగు మాట వినకుండా తాము ఎన్నుకున్న రంగంలో సాధించాల్సింది సాధించాక ఇక చాలు అని అనుకున్న వారే పరమానందభరితులుగా ఉంటారు. అయితే రెండు కీలక రంగాలలో మాత్రం పరుగు ఎప్పటికీ ఆగదా అన్న సందేహం వస్తుంది. ఆ రంగాలు ప్రజలతో ఎక్కువగా ముడిపడి ఉన్నవి. ఒకటి సినీ రంగం, ఇక్కడ మోజుకే కొత్త అర్ధం చెప్పాల్సి ఉంటుంది రెండవది రాజకీయ రంగం. ఈ రంగంలోనూ అంత సులువుగా ఎవరూ రిటైర్మెంట్ ఇవ్వలేరు. కానీ అలా రేసులో ఉంటూ దూసుకుపోవాలని చూసినా ఏదో టైం లో అభాసుపాలు కాక తప్పదు. కోరికలు అన్నవి గుర్రాలు మాదిరిగా ఉంటాయి. వాటికి కళ్ళాలు వేసి ఈ పరుగు ఇంతటితో సరి అనిపించుకున్న వారే ధన్యులు సుమతీ అన్నదే ఆధునిక వేదంగా చూడాల్సి ఉంటుంది.