బ్రహ్మాండంగా నటించు...ఆనందంగా జీవించు!
ఇదేమి జీవిత సత్యం. ఇదేమి వినూత్న తత్వం అని అనుకోవద్దు. జీవిత సారం ఇంతే. జీవించాలంటే నటించాలి.
By: Satya P | 9 Nov 2025 9:30 PM ISTఇదేమి జీవిత సత్యం. ఇదేమి వినూత్న తత్వం అని అనుకోవద్దు. జీవిత సారం ఇంతే. జీవించాలంటే నటించాలి. అందులో తప్పు ఏ మాత్రం లేదు. ఎందుకంటే ఈ భూమి మీద నటనే ఉంది. జీవితం అన్నది నటన కోసమే. ఈ మాటలు చెబితే తప్పుగా అర్థం చేసుకుంటారేమో కానీ యధార్థం మాత్రం ఇదే. ఎందరో మహానుభావులు చెప్పినది కూడా ఇదే. సారాంశం కూడా అదే.
నరుడి బతుకు నటన :
దర్శకత్వం ఒకరిది. ఆదేశం సైతం వారిదే. ఆచరణ మాత్రమే జీవుడుది. అందుకే నరుడి బతుకు నటన అన్నారు వేదాంతం అంతు చూసిన వారు. ఎంత బాగా నటిస్తే అంత హాయిగా జీవిస్తారు. తేడా వస్తే మాత్రం బతుకు బస్టాండ్ అవుతుంది. అపుడు జీవం లేని నవ్వు వస్తుంది. అఫ్ కోర్స్ అది కూడా కొత్త నటన అనుకునే వారు కూడా ఉన్నారనుకోండి. ఏది ఏమైనా జీవితమే ఒక నాటకం అని ఏనాడో పెద్దలు చెప్పారు, అది గుర్తు పెట్టుకుంటే హ్యాపీగా లైఫ్ ముందుకు సాగుతుంది. ఇందులో చిట్కాలు మస్కాలు ఏవీ లేవు. వెరీ సింపుల్ గానే అంతా జరిగిపోతుంది.
అదే కదా మ్యాటర్ :
చాలా మందికి తాము నటిస్తున్నామని తెలియదు, అంతలా జీవించేస్తారు అన్న మాట. అంటే వారు నటనలో ఆస్కార్ స్థాయిలో పండిపోయారు అన్న మాట కానే కాదు, అది ఉన్నమాటే. ఇదేమిటి నటించమంటున్నారు అనుకోవడమే వద్దు. ఒక మనిషి జీవితంలో ఎన్ని పాత్రలు ఉంటాయి, చాలానే కదా, అది అందరికీ తెలిసిందే కదా. బిడ్డగా పుట్టి భర్తగానో భార్యగానో మారి, తండ్రిగానో తల్లిగానో రూపాంతరం చెంది ఆ మీదట తాతగా నాయనమ్మగా ఇలా ఎన్నో పాత్రలలోకి అలా తోసివేయబడుతూ ముందుకు సాగిపోతుంది జీవితం. అంతేనా ఒక స్నేహితుడిగా కొందరికి కనిపిస్తే బద్ధ విరోధిగా మరి కొందరికి కనిపిస్తారు, ఒకరికి ఉపకారిగా ఉంటే మరొకరికి అపకారిగా అగుపిస్తారు. మంచి చెడ్డా రెండూ ఒకే మనిషి గురించి మిగిలిన వారు అనుకుంటున్నారు అంటే మరి అసలైన నటన అందులోనే ఎంతో ఉంది కదా.
ఫుల్ స్టాప్ పడ్డట్టే :
అర్ధాంతరంగా తనువులు చాలిస్తున్న వారు దుర్బలులు అని అనుకుంటారు. కానీ వారు నటించలేక అలా మధ్యలోనే తెర దించేస్తున్నారు అన్న మాట. ఈ జీవితంలో ఎన్నో వెకిలి నవ్వులు మకిలి చేష్టలు చేసే నేర్పులో ఓర్పులో వెనకబడి తడబడి పొరబడి చివరికి ఒక నిర్ణీత ముహూర్తాన తమ నాటకానికి తామే శుభం కార్డు బోర్డు పెట్టేస్తారు అన్న మాట. మరి జీవించిన వారు అంతా మహా నటులేనా అంటే అవును అనే చెప్పాల్సిందే కదా.
పాత్రకు న్యాయం :
ఏ నటుడు అయినా తన వద్దకు వచ్చిన పాత్రకు మాత్రమే న్యాయం చేయగలడు, తనది కాని పాత్ర వస్తే చెడగొడతాడు కూడా. అలా చెడిపోయిన పాత్రధారులే జీవితంలో ఓడిపోయిన వారుగా కనిపిస్తూ ఉంటారు అన్న మాట. జీవితం అనే నాటకం జన రంజకంగా కాదు, కనీసం మనోరంజకంగా సాగిపోవాలి అంటే కనుక కచ్చితంగా నటించాల్సిందే. అలా కాదు అని మడి కట్టుకుని కూర్చున వారు బతకలేక చచ్చిన వారుగా సమాజం అనే నాటక రంగం మీద మిగిలిపోతారు. నటన ఈ జీవితం అని తెలుసుకున్న వారు గొప్ప ఆలోచనలు ఉన్న వారు అయితే ఏ యోగులుగానో మారి అడవులు పట్టుకుని తపస్సు చేసుకుంటారు. ఈ జనారణ్యంలో నాటకాలు చేయలేమని తమ వల్ల కాదని భావించే వారు బైరాగులుగా కూడా మారిపోతారు.
టాలెంట్ ఎంత ఉంటే :
జీవితంలో విజయాలు ఊరకే రావు. ఎంత టాలెంట్ ఉంటే అంత. అంటే నటనలో అన్న మాట. ప్రేమ మనసులో లేకపోయినా ఉన్నట్లుగా నటించాలి, బాధ లేకపోయినా బాధ పడాలి. చేతిలో డబ్బులు లేకపోయినా ధనవంతుడిగా ఫోజు కొట్టాలి, పని చేతకాకపోయినా సమర్థుడిగా నటించాలి. లేకపోతే చీటీ చిరిగిపోతుంది. పేచీ కూడా అపుడే మొదలవుతుంది. అందుకే ప్రపంచమే రంగస్థలం జీవితం నాటకం మనిషి నటుడు దేవుడు దర్శకుడని తలపండిన తత్వవేత్తలు చెబుతారు.
ఎనాడో చెప్పారుగా :
ఇక వెనక్కి వెళ్ళి చూస్తే ఈ ప్రపంచమంతా ఒక వేదిక అయితే అందులో అందరు పురుషులు స్త్రీలు కేవలం ఆటగాళ్ళు మాత్రమే అనే ప్రసిద్ధ కోట్ విలియం షేక్సిపియర్ నాటకంలో ఉంది. ఆ నాటకం పేరు ఆస్ యు లైక్ ఇట్ గా ఉంది. ఇందులో జాక్వెస్ అనే పాత్ర మాట్లాడినది ఇదే మాట, జీవితం అనేది ఒక నాటకం లాంటిదని, ప్రతి ఒక్కరూ తమ పుట్టుక నుంచి మరణం వరకు తమదైన పాత్రను పోషిస్తారని అంతే కాదు వారి జీవితాంతం అనేక విభిన్న పాత్రలను పోషిస్తారని ఆ పాత్ర చెబుతుంది. ఇక ప్రపంచాన్ని ఒక వేదికతో ప్రజలను నటులతో పోల్చడం షేక్సిపియర్ కంటే ముందే జరిగింది.షేక్సిపియర్ జన్మించిన సంవత్సరంలో రాసిన రిచర్డ్ ఎడ్వర్డ్స్ నాటకం డామన్ అండ్ పైథియాస్ లో ఈ ప్రపంచం ఒక వేదిక లాంటిదని పైథాగరస్ అన్నాడు దానిలో చాలామంది తమ పాత్రలను పోషిస్తారు చూసేవాడు జ్ఞాని అనే అర్ధవంతమైన వ్యాక్యాలు ఎన్నో ఉన్నాయి. మొత్తానికి చూస్తే తప్పించుకుని తిరుగువాడు ధన్యుడు సుమతీ కాదు బ్రహ్మాండంగా నటించే వాడే గ్రేటు సుమీ అన్నదే జీవిత సారం. అర్థమైతే చాలు ఇక నటన పీక్స్ చేరితే లైఫ్ లోని బ్యూటీ మొత్తం చూసేసినట్లే.
