ఏపీ తీరాన్ని తాకిన అర్నాబ్ బీభత్సం.. కోనసీమ అతలాకుతలం
ఆకుపచ్చని కోనసీమ అందాలు.. పచ్చటి పొలాలు.. నింగినంటే కొబ్బరిచెట్లు.. ఏ వైపు చూసినా ప్రశాంతతకు నిలయంగా కనిపించే ఆ ప్రాంతం ఒక్కసారిగా మారిన ప్రకృతి కోపానికి బలైపోయింది.
By: A.N.Kumar | 28 Oct 2026 9:33 AM ISTఆకుపచ్చని కోనసీమ అందాలు.. పచ్చటి పొలాలు.. నింగినంటే కొబ్బరిచెట్లు.. ఏ వైపు చూసినా ప్రశాంతతకు నిలయంగా కనిపించే ఆ ప్రాంతం ఒక్కసారిగా మారిన ప్రకృతి కోపానికి బలైపోయింది. బంగాళాఖాతంలో రూపుదిద్దుకున్న 'అర్నబ్' అతి తీవ్ర తుపాను నరసాపురం సమీపంలో తీరాన్ని దాటుతూ సృష్టించిన బీభత్సం సామాన్య ప్రజల జీవితాలను తలకిందులు చేసింది. కంటిమీద కునుకు లేకుండా గడిపిన ఆ రాత్రి.. కోనసీమవాసులకు కలలో కూడా ఊహించని ఒక చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది.
అర్నబ్ తుపాను తీరం దాటే ప్రక్రియ కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. గత 24 గంటల్లో తుపాను కదలికలను వివరించే గ్రాఫికల్ వీడియోను కూడా షేర్ చేసింది. నరసాపురానికి దగ్గరలో తుపాను కేంద్రీకృతమై ఉందని, తీరం దాటే ప్రక్రియ మొదలైందని అధికారులు తెలిపారు. తీరం దాటే ముందు తుపాను గంటకు సుమారు 3 కిలోమీటర్ల వేగంతో కదిలినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. తీరం దాటే ప్రక్రియ ముగిసినంత మాత్రాన తక్షణమే ప్రమాదం తొలగిపోదని.. భారీ వర్షాలు, బలమైన గాలుల ప్రభావం కొనసాగవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు.
కాకినాడ జిల్లాలోనూ అర్నబ్ తుపాను ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. కాజులూరులో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలగా, ప్రధాన రహదారులపై పడిన చెట్లతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉప్పాడలో సముద్రపు అలల ఉద్ధృతికి బీచ్ రోడ్డు ధ్వంసమైంది. వరి పొలాల్లోకి నీరు చేరడంతో పంటలకు నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొంది. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో బలమైన గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ కూలిపోయాయి. యానాంలోనూ మంగళవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు, ఈదురుగాలులు కొనసాగాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లోనూ పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ప్రభావంతో తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తుఫాన్ బీభత్సానికి కూకటివేళ్లతో సహా నేలకొరిగిన కొబ్బరిచెట్లు.. సుమారు 6 వేలకు పైగా ధ్వంసమైన విద్యుత్ స్తంభాలు.. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కనిపించే ప్రతి దృశ్యం గుండెలను పిండేస్తోంది. గాలుల హోరుకు, రాక్షసంగా విరుచుకుపడిన వర్షానికి ఇళ్ల కప్పులు లేచిపోయి.. ఆరుబయట నిలబడిన బాధితుల కళ్లల్లో భయం స్పష్టంగా కనిపిస్తోంది. దశాబ్దాలుగా కష్టపడి పెంచుకున్న కొబ్బరి తోటలు కళ్లముందే ధ్వంసమైపోతుంటే.. ఎంతో ఆశగా విత్తుకున్న వరి పొలాలు చెరువులను తలపిస్తుంటే రైతన్నల గుండెలు పగిలిపోతున్నాయి. కాజులూరు నుంచి పాలకొల్లు వరకు.. ఉప్పాడ సముద్రపు అల్లకల్లోలం నుంచి యానాం లోతట్టు ప్రాంతాల వరకు అంతటా జలదిగ్బంధంలో కూరుకుపోయిన దైన్యం మాత్రమే మిగిలింది.
చీకటి అలుముకున్న ఆ గ్రామాల్లో విద్యుత్ సదుపాయం లేక.. తాగడానికి మంచి నీరు దొరకక పసిపిల్లలతో.. వృద్ధులతో అల్లాడుతున్న కుటుంబాల ఆవేదన వర్ణనాతీతం. రహదారులపై పడిన భారీ వృక్షాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలను తెంచేయగా సహాయం కోసం ఎదురుచూస్తున్న చూపులు కన్నీటితో నిండిపోయాయి.
అయితే ఈ కష్టసమయంలో ఆశారేఖలు కూడా కనిపిస్తున్నాయి. ఒకవైపు ముఖ్యమంత్రి సమీక్షలు, ఆర్టీజీఎస్ ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుండగా.. మరోవైపు పొరుగు రాష్ట్రమైన తెలంగాణ కూడా ఈ కష్టకాలంలో ఆపన్నహస్తం అందించేందుకు ముందుకు రావడం మానవత్వానికి నిదర్శనం. తెగిపడిన విద్యుత్ వ్యవస్థను సరిచేసేందుకు అధికారులు, సిబ్బంది ప్రాణాలను సైతం పణంగా పెట్టి పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమయ్యారు.
తుపాను తీరం దాటినా.. తీరప్రాంత ప్రజల గుండెల్లో చెలరేగిన అలజడి తగ్గేందుకు మరికొంత సమయం పడుతుంది. ధ్వంసమైన జీవితాలను మళ్లీ మొదలుపెట్టేందుకు ఆ ప్రజలకు ఇప్పుడు కావాల్సింది కేవలం సహాయం మాత్రమే కాదు... మన అందరి నైతిక మద్దతు..
