Begin typing your search above and press return to search.

రిపబ్లిక్ డే పరేడ్ స్పెషల్... ఈసారి రంగంలోకి నాలుగు కాళ్ల యోధులు!

2026లో జరిగే రిపబ్లిక్ డే దినోత్సవ కవాతులో చారిత్రాత్మకంగా సరికొత్త అరంగేట్రం జరగబోతోంది.

By:  Raja Ch   |   31 Dec 2025 7:34 PM IST
రిపబ్లిక్  డే పరేడ్  స్పెషల్... ఈసారి రంగంలోకి నాలుగు కాళ్ల యోధులు!
X

2026లో జరిగే రిపబ్లిక్ డే దినోత్సవ కవాతులో చారిత్రాత్మకంగా సరికొత్త అరంగేట్రం జరగబోతోంది. ఫలితంగా.. అరుదైన, అద్భుతమైన దృశ్యం కనిపించబోతోంది. ఇందులో భాగంగా.. సైన్యంలోని నాలుగు కాళ్ల యోధులు ఈ సారి కవాతు చేయబోతున్నాయి. తీవ్రమైన భూభాగాల్లో సైనిక కార్యకలాపాలలో తమవంతు కీలక పాత్ర పోషిస్తున్న శునకాలు, ఒంటెలు, పోనీలు, రాప్టర్లు కలిసి ఈసారి గణతంత్ర దినోత్సవాల్లో సందడి చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయని తెలుస్తోంది.

అవును... ఢిల్లీలో జనవరి 26న నిర్వహించనున్న రిపబ్లిక్ డే దినోత్సవ వేడుకల కవాతులో ఈసారి ఓ అరుదైన దృశ్యం కనిపించనుంది. ఇందులో భాగంగా.. ఈ సారి రిపబ్లిక్ డే పరేడ్ లో తొలిసారిగా జంతువులు పాల్గొననున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా.. రీమౌంట్ అండ్ వెటర్నరీ కార్ప్స్ (ఆర్.వీ.సీ) విభాగానికి చెందిన శిక్షణ పొందిన జంవుతులను ఈ కవాతులో ప్రదర్శించనున్నామని అధికారులు తెలిపారు. ఇది ఆసక్తిగా మారింది.

దేశంలోని అత్యంత సవాళ్లతో కూడిన సరిహద్దుల వద్ద భద్రత కోసం సైనికులు ఉపయోగించే బాక్టీరియన్ జాతికి చెందిన రెండు ఒంటెలు, నాలుగు జాన్స్కర్ పోనీలు (గుర్రాలు), నాలుగు రాప్టర్స్ (డేగలు), ఆరు సంప్రదాయక సైనిక శునకాలు, పది భారతీయ జాతి ఆర్మీ శునకాలు ఈ బృందంలో ఉన్నాయని చెబుతున్నారు. ఈ దళానికి నాయకత్వం వహించేవి బాక్టీరియన్ ఒంటెలు కాగా.. ఇటీవల లడఖ్ లోని చల్లని ఎడారి ప్రాంతాల్లో మొహరించడానికి వీటిని చేర్చారు.

గడ్డకట్టే ఉష్ణోగ్రతలు.. తక్కువ ఆక్సిజన్ స్థాయిలు.. 15,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులకు అనుగుణంగా ఉండే ఈ ఒంటెలు సుమారు 150 కిలోల బరువును మోయగలవని.. తక్కువ నీరు, తక్కువ మేతతో ఎక్కువ దూరం ప్రయాణించగలవని చెబుతున్నారు. ఇదే సమయంలో... వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి, ముఖ్యంగా ఇసుక ప్రాంతాలు, నిటారుగా ఉన్న భూభాగాలలో లాజిస్టిక్స్, గస్తీ సామర్థ్యాలను వీటి ఎంట్రీ బలోపేతం చేసిందని అంటున్నారు.

వీటితో పాటు లడఖ్ కు చెందిన స్వదేశీ పర్వత జాతి అయిన జాన్స్కర్ పోనీలు (గుర్రాలు) ఈ కవాతులో పాల్గొనబోతున్నాయి. వీటి పరిమాణం చిన్నదే అయినప్పటికీ మైనస్ 40 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతల్లో కూడా సుమారు 40 నుంచి 60 కిలోల బరువును ఇవి మోయగలవని చెబుతున్నారు. వీటిని 2020లో ప్రవేశపెట్టారు. ఇదే క్రమంలో సైన్యం నిఘా కోసం ఉపయోగించే నాలుగు రాప్టర్ లు (డేగలు) ఈ కవాతులో పాల్గొనబోతున్నాయి.

అదేవిధంగా... ఈ కవాతులో ఆర్మీ కుక్కలు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని అంటున్నారు. వీటిని తరచుగా ఆర్మీ 'నిశ్శబ్ద యోధులు' అని పిలుస్తారు. మీరట్‌ లోని రీమౌంట్ అండ్ వెటర్నరీ కార్ప్స్ సెంటర్, కళాశాలలో శిక్షణ పొందిన ఇవి.. ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలు, పేలుడు పదార్థాల గుర్తింపు, కాపలా, విపత్తు ప్రతిస్పందనకు మద్దతు ఇస్తాయి.