డల్లాస్‌లో భారతీయులకు గన్‌తో బెదిరింపు.. వైరల్ వీడియో కలకలం.. నిందితుడు అరెస్ట్
సాయంత్రం కాగానే కన్వీనియన్స్ స్టోర్ల బయట, టీ కొట్ల ముందు చేరి "బాస్.. ఆ ప్రాజెక్ట్ రోల్‌ఆఫ్ సంగతేంటి?" "మా ఊర్లో ఆస్తి గొడవలు ఎక్కడిదాకా వచ్చాయి?", "నెక్స్ట్ హెచ్-1బీ లాటరీ పడుతుందంటారా?" అని హాయిగా ముచ్చటించుకోవడమే మనవాళ్లు చేసిన ఏకైక పాపం..
By: A.N.Kumar | 2 Aug 2026 1:46 AM ISTడల్లాస్ నగరం అంటే ఏమిటనుకున్నారు? ఐటీ ఐడీ కార్డులు, కారప్పూసల ఘుమఘుమలు, బాలకృష్ణ, చిరంజీవి కటౌట్లు, ఆవకాయల సువాసనలతో విలసిల్లే 'అచ్చమైన గ్రేటర్ హైదరాబాదీ సబ్‌బర్బ్' అసలు మనం అమెరికాలోని టెక్సాస్‌లో ఉన్నామో లేక అమీర్‌పేట్ క్రాస్ రోడ్స్‌లో తిరుగుతున్నామో తెలియనంతగా ఆ వాతావరణం మనల్ని పరవశింపజేస్తుంటుంది. సాయంత్రం కాగానే కన్వీనియన్స్ స్టోర్ల బయట, టీ కొట్ల ముందు చేరి "బాస్.. ఆ ప్రాజెక్ట్ రోల్‌ఆఫ్ సంగతేంటి?" "మా ఊర్లో ఆస్తి గొడవలు ఎక్కడిదాకా వచ్చాయి?", "నెక్స్ట్ హెచ్-1బీ లాటరీ పడుతుందంటారా?" అని హాయిగా ముచ్చటించుకోవడమే మనవాళ్లు చేసిన ఏకైక పాపం..
అయితే ఈ పచ్చని కాపురంలో నిప్పులు పోయడానికి ఒక 'సుగుణాభిరాముడు' సిద్ధమయ్యాడు. డల్లాస్‌లోని ఓ కన్వీనియన్స్ స్టోర్ బయట మన గల్లీ కుర్రాళ్ళు అత్యంత ప్రశాంతంగా జగత్తును మరచిపోయి కాలక్షేపం చేస్తుంటే ఓ మహాత్ముడు తన భారీ ఎస్‌యూవీ వాహనంలో రాయల్ ఎంట్రీ ఇచ్చాడు. సరేలే పాపం ఏదో గిఫ్ట్ కార్డో లేక సోడా బాటిలో కొనుక్కోవడానికి వచ్చాడనుకుంటే పొరపాటే.. దిగడమే తడవుగా, తన నడుముకున్న పిస్టల్‌ను సగర్వంగా ప్రదర్శిస్తూ హాలీవుడ్ యాక్షన్ సినిమా హీరోలా ఉచితంగా "లైవ్ థ్రిల్లర్ షో" చూపించడం మొదలెట్టాడు.
అసలే మనోళ్లు సాఫ్ట్‌వేర్ కోడింగ్, మీటింగ్‌ల ఒత్తిడిలో మునిగితేలే అమాయకులు. ఏమైనా అగ్నిపరీక్షలకు సిద్ధంగా ఉన్న బాహుబలులా? తుపాకీ చూడగానే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని.. ఒలింపిక్స్ స్ ప్రింటర్‌ను మించి సెకనుకు వంద మీటర్ల వేగంతో అక్కడ నుంచి పరుగు లంకించుకున్నారు. వాళ్ల ముఖాల్లోని హావభావాలు చూస్తే "అమ్మ బాబోయ్.. డాలర్లు వద్దూ గ్రీన్ కార్డూ వద్దూ.. నన్ను ఇండియాకి పంపేయండిరా!" అని కోరుకుంటున్నట్లు స్పష్టంగా కనిపించింది.
పాపం మన భారతదేశ యోధులు అమెరికాకి వచ్చింది కష్టపడి డాలర్లు సంపాదించడానికో పర్మనెంట్ రెసిడెన్సీ తెచ్చుకోవడానికో అయితే... అక్కడ ఈ తుపాకీ తుఫాన్లు ఉచిత ఆఫర్లలా లభిస్తున్నాయి. ఇక ఈ 'గన్ షాట్' డ్రామా సీసీటీవీలో రికార్డై సోషల్ మీడియాలో వైరల్ కావడం, దెబ్బకి స్థానిక పోలీసులు 'సింగం' రేంజ్‌లో రంగంలోకి దిగడం క్షణాల్లో జరిగిపోయాయి. తీరా పోలీసులు ఆ ఘనుడిని జల్లెడ పట్టి అరెస్ట్ చేసి చూస్తే... మనోడికి ఇప్పటికే స్థానిక నేరాల హిస్టరీలో ఏకంగా 'గోల్డ్ మెడల్' ఉన్నట్లు తేలింది. గతంలోనూ ఎన్నో హింసాత్మక వీరగాథలు, గన్ ఫైటింగ్‌లు అతని ఘనమైన బయోడేటాలో ఉన్నాయట.
ఇంతకీ ఆ 'పుణ్యాత్ముడు' మనవాళ్లని జాతి విద్వేషంతో బెదిరించాడా లేక తన దగ్గరున్న తుపాకీ కొత్తగా పనిచేస్తుందో లేదో టెస్ట్ చేయడానికి మనోళ్లని టార్గెట్ చేసుకున్నాడో ఇంకా పోలీస్ బాబులు తేల్చలేదు. ఏది ఏమైనా "హమ్మయ్య.. డల్లాస్ చేరాంరా బాబోయ్ మనోళ్లే అంతా ఉన్నారు.. ఇక సేఫ్" అని ధీమాగా ఉండే మన ఐటీ వీరులకు ఈ ఘటన ఒక గట్టి "రిమైండర్" ఇచ్చింది. ఇకపై సాయంత్రం పూట బయటకు వెళ్తే కోడింగ్ నాలెడ్జ్ మాత్రమే కాకుండా బుల్లెట్ల నుంచి తప్పించుకునే కవర్ డ్రైవ్‌లు, సైడ్ స్టెప్‌లు కూడా ప్రాక్టీస్ చేయాల్సిందేమో.. ఏమంటారు..
మరోవైపు పెద్దమనుషులు, నిపుణులు ఏమో "రాత్రిపూట ఒంటరిగా తిరగకండి.. అనుమానం వస్తే 911 కి కాల్ చేయండి" అని ఉచిత సలహాల ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ, అసలు ఆ గన్ పట్టుకుని రోడ్ల మీద ఊరేగే మహానుభావులకు సలహాలు చెప్పే నాథుడే లేకపోవడమే ఇక్కడ అసలైన ట్విస్ట్..
