Begin typing your search above and press return to search.

పరిటాల శ్రీరామ్ కి రాచబాట...లోకేష్ కీలక వ్యాఖ్యలు

ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబానికి ప్రత్యేక క్రేజ్ ఉంది. పరిటాల రవి అక్కడ తిరుగులేని నాయకుడిగా వెలిగారు.

By:  Satya P   |   23 Sept 2026 6:00 AM IST
పరిటాల శ్రీరామ్ కి రాచబాట...లోకేష్ కీలక వ్యాఖ్యలు
X

ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబానికి ప్రత్యేక క్రేజ్ ఉంది. పరిటాల రవి అక్కడ తిరుగులేని నాయకుడిగా వెలిగారు. ఆయన రాజకీయ జీవితం గట్టిగా పుష్కర కాలం కూడా లేదు కానీ జీవిత కాలం సరిపడా ప్రజాభిమానం సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ హయాంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఒంటి చేత్తో ఉమ్మడి అనంతపురం జిల్లా మొత్తంలో టీడీపీని గెలిపించిన రాజకీయ చాతుర్యం ప్రజాదరణ ఆయన సొంతం. ఇక 2005 జనవరి 25న రవి హత్య తరువాత 2014 ఎన్నికల్లో ఆయన సతీమణి సునీత ఎంట్రీ ఇచ్చారు. ఆ టెర్మ్ లో ఆమె మంత్రిగా కూడా పనిచేశారు. ఇక తరువాత కాలంలో శ్రీరామ్ కూడా రాజకీయ రంగ ప్రవేశం చేశారు.

ఈసారి పోటీ ఖాయం :

ఇదిలా ఉంటే 2019 ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ రాప్తాడు అసెంబ్లీ సీటు నుంచి పోటీకి దిగారు. అయితే ఆనాడు వైసీపీ ప్రభంజనంలో ఆయన వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేతిలో దాదాపు 25 వేల 575 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇక 2019 నుంచి 2024 మధ్యలో ధర్మవరం అసెంబ్లీ బాధ్యతలను కూడా ఆయన చూశారు. అలా 2024లో రెండు టికెట్లు పరిటాల ఫ్యామిలీకి దక్కుతాయని అనుకున్నారు. అయితే పొత్తులలో భాగంగా ధర్మవరం అసెంబ్లీ సీటు బీజేపీకి వెళ్ళింది. దాంతో అనూహ్యంగా సత్య కుమార్ యాదవ్ బరిలోకి దిగి గెలవడమే కాదు మంత్రి కూడా అయిపోయారు. ఇక ఇపుడు చూస్తే పరిటాల శ్రీరామ్ కి ఎక్కడ అన్న చర్చ ఆయన అభిమానులలో ఉంది. దానికి తన తాజా పర్యటనలో నారా లోకేష్ జవాబు చెప్పేశారు.

శ్రీరామ్ ని గుర్తుంచుకుంటా :

తాను పరిటాల శ్రీరామ్ ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను అని తాజాగా అనంతపురం జిల్లా పర్యటనలో లోకేష్ చేసిన కీలక వ్యాఖ్యలు పరిటాల అభిమానులలో కొత్త హుషార్ ని తీసుకుని వచ్చాయి. రాప్తాడులో జరిగిన సభలో లోకేష్ మాట్లాడుతూ పరిటాల శ్రీరామ్ కి తానే మొదటిగా రామ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాను అన్నారు. ఇక తనతో పాటు కలసి అడుగులు వేస్తున్న తమ్ముడు శ్రీరామ్ ని తప్పక గుర్తుంచుకుంటానని లోకేష్ చెప్పడం విశేషం. దీంతో వచ్చే ఎన్నికల్లో శ్రీరామ్ పోటీ చేయడం ఖాయమని అంటున్నారు.

రాప్తాడు నుంచేనా :

రాప్తాడు నుంచే శ్రీరామ్ పోటీకి దిగుతారు అని అంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి సునీత రాజకీయాల నుంచి తప్పుకుంటారు అని అంటున్నారు. దాంతో పాటు లోకేష్ యువ బృందంలో అత్యంత కీలకంగా ఉన్న శ్రీరామ్ కి లోకేష్ తప్పకుండా టికెట్ ఇస్తారు అని అంటున్నారు. అంతే కాదు ఈసారి కూటమి ప్రభుత్వం వస్తే పరిటాలకు మంత్రి పదవి కూడా దక్కుతుందని అపుడే ఆయన అనుచరులు అభిమానులు లెక్క వేస్తున్నారు. లోకేష్ సైతం ప్రతీ జిల్లాలో పర్యటిస్తూ తన యువ బృందాన్ని మరింతగా పటిష్టం చేసుకుంటున్నారు. ఆనాడు టీడీపీకి ఎంతో అండగా ఉంటూ పార్టీని జిల్లాలో ఏకపక్షంగా గెలిపించిన పరిటాల రవి మాదిరిగానే వారసుడు శ్రీరామ్ టీడీపీకి లోకేష్ కి భవిష్యత్తులో అండగా ఉంటాడని అంచనా వేస్తున్నారు. లోకేష్ కూడా తన పర్యటనలలో టీడీపీ భవిష్యత్తుని మరింతగా తీర్చిదిద్దేందుకు చూస్తున్నారు. సమర్ధ నాయకత్వాన్ని ఎక్కడికక్కడ ప్రోత్సహిస్తున్నారు అని గుర్తు చేస్తున్నారు. మొత్తానికి రవి వారసుడికి టికెట్ కన్ఫర్మ్ అయింది అని అంటున్నారు.