Begin typing your search above and press return to search.

సనాతన ధర్మంలోనే నాస్తికత్వం ఉంది

నాస్తికుడు అంటే అందరికీ తెలిసిందే. దేవుడిని నమ్మని వాడు. దైవమే లేరు అని వాదించేవారు. భౌతికవాదం మీదనే ఇలాంటి వారు ఎక్కువ విశ్వాసం ఉంచుతారు.

By:  Satya P   |   21 Nov 2025 9:16 AM IST
సనాతన ధర్మంలోనే నాస్తికత్వం ఉంది
X

నాస్తికుడు అంటే అందరికీ తెలిసిందే. దేవుడిని నమ్మని వాడు. దైవమే లేరు అని వాదించేవారు. భౌతికవాదం మీదనే ఇలాంటి వారు ఎక్కువ విశ్వాసం ఉంచుతారు. వారికి అంతా కళ్ల ముందు కనిపించాలి. తమ ఎదుట ప్రత్యక్షం అయితేనే తప్ప వారు నమ్మరు, వారిని నమ్మించడం చాలా కష్టం. ఇది మనిషి మేధో సంపత్తికి సంబంధించినదిగా కూడా చెప్పుకుంటారు. తాము ఎంతో గొప్పవారమని, అంతా తమ చేతుల్లో చేతలలో ఉందని వారు భావిస్తూంటారు. తాము సాధించలేనిది ఏదీ లేదు అని కూడా అహంకరిస్తారు.

కొత్త ఏమీ కాదు :

అయితే నాస్తికత్వం అన్నది కొత్త ఏమీ కాదు, ఇపుడే పుట్టింది కూడా కాదు అన్నది విజ్ఞులు చెబుతారు. పురాణాలలోనే నాస్తికులు ఉన్నారు, అరవీర భయంకరులైన వారు కనిపిస్తారు. హిరణ్య కశిపుడు ఆ తరగతికి చెందిన వారే. ఎక్కడ ఉన్నారు నీ విష్ణువు అని ప్రహ్లాదుడిని అడిగి మరీ నానా రకాలైన బాధలు పెట్టిస్తాడు. తనను మించిన వారు లేరని కూడా హిరణ్య కశిపుడు భావించి తన రాజ్యంలో దైవ నామస్మరణ లేకుండా చేస్తాడు. చివరికి స్థంభంలో మహా విష్ణువు నారసింహ ఆవతారాన్ని చూసిన మీదట కానీ దేవుడు ఉన్నారని గ్రహించలేక పోయాడు. అయితే అది గ్రహించేలోపే ఆయనను సంహరిస్తాడు నారసింహుడు.

నాస్తికత్వం అంటే :

ఒక్క హిరణ్య కశిపుడు మాత్రమే కాదు చాలా మంది రాక్షస రాజులు పురణాలలో ఇలాగే కనిపిస్తారు. వారంతా దేవుడు లేడని తానే సర్వస్వం అని విర్రవీగే వారు. కానీ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరిగిన తరువాత దేవుడున్నాడు అన్న సందేశం వారితో పాటు అందరికీ అందింది. ఇవన్నీ పక్కన పెడితే నాస్తికుడు ఎవరు అసలు నాస్తికత్వం అంటే ఏమిటి అన్న చర్చ ఉంది. అది ఈనాటిది కూడా కాదు, నిజం చెప్పాలంటే ఆస్తికుడు పక్కనే నాస్తికుడు ఉన్నాడు. అస్తికుడికి మూల పురుషుడు దైవం. ఆయన చుట్టూ ఆయన ఆలోచనలు సాగుతాయి. అలాగే నాస్తికుడికి కూడా మూల కేంద్రం దేవుడే. ఈ మాట చెబితే వింతగా విచిత్రంగా ఉండొచ్చు కానీ అదే నిజం. నాస్తికుడు మాట్లాడే తొలి పలుకు ఏమిటి అంటే దేవుడు లేడు అని. అంటే తన నోటితోనే దేవుడి గురించి ఆలోచించి మాట్లాడుతున్నాడు అన్న మాట. తన వాదనకు తన వేదనకు తన తర్కానికీ కేంద్ర బిందువుగా దేవుడినే ముందు పెట్టుకుని సాగుతున్నాడు నాస్తికుడు అన్న మాట.

వారే అసలైన భక్తులా :

ఇక్కడ మరో తమాషా అయిన వాదన కూడా ఉంది. ఆస్తికులు కంటే నాస్తికులే ఎక్కువగా దేవుడి గురించి తలుస్తారు అని. దేవుడు ఉన్నాడు అన్న వారు ఒక స్థాయికి పరిమితం అవుతారు కానీ లేడు అన్న వారు ఎన్నో వింత వాదనతతో తరచూ ఆయన నామమే జపిస్తూ ఉంటారు. అందుకే వారి కంటే దేవుడిని తలచేవారు ఎవరు, వారే కదా అసలైన ఆస్తికులు అన్న వారూ లేకపోలేదు. పురాణాలలోకి మళ్ళీ వెళ్తే జయ విజయులు అనే ఇద్దరు ద్వారపాలకులు శ్రీ మహావిష్ణువు శాపం వల్లనే రాక్షసులుగా పుడతారు అని వారిని సంహరించే క్రమంలో దేవుడు అవతారాలు ఎత్తుతారు అని చెబుతారు ఇక వారిని ఏడు జన్మలు తన భక్తులుగా పుడతారా లేక మూడు జన్మలు తన ఆగర్భ శతృవులుగా పుడతారా అని విష్ణువు అడిగితే తమకు మూడు జన్మలే చాలు అని తాము నాస్తికులుగానే ఉంటూ ఆయనను ఆ జన్మలు అయిపోగానే తిరిగి ఆయనను చేరుకుంటామని చెప్పి భువిలో దేవుడే లేడు అంటూ ప్రచారం చేసిన తొలి నాస్తికులుగా పురాణాలలో ప్రసిద్ధి చెందారు అన్న మాట. ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది. నాస్తికులు కంటే వీర భక్తులు ఎవరైనా ఉన్నారా అని డౌట్ రాక మానదు కదా. అదన్న మాట మ్యాటర్.