అమెరికాలోని ఆ నగరాల్లో చలి లెక్క వింటేనే వణుకు
ట్రంప్ 2.0 దెబ్బకు యావత్ ప్రపంచం ఇబ్బంది పడుతుంటే.. అలాంటి అగ్రరాజ్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది ప్రకృతి.
By: Garuda Media | 9 Feb 2026 10:02 AM ISTట్రంప్ 2.0 దెబ్బకు యావత్ ప్రపంచం ఇబ్బంది పడుతుంటే.. అలాంటి అగ్రరాజ్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది ప్రకృతి. మొన్నటికి మొన్న అమెరికాన్లకు మంచుతుపాను రూపంలో నరకం అంటే ఏమిటో ప్రత్యక్షంగా కనిపించిన పరిస్థితి. తాజాగా ఆ దేశంలోని కొన్ని నగరాల్లో చలి చంపేస్తోంది. గడిచిన పది- ఇరవై ఏళ్లలో ఎప్పుడూ లేనంత తక్కువకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయిన పరిస్థితి. అదెంతలా అంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాలోని కొన్ని నగరాల కంటే అంటార్కిటికాలోనే చలి తక్కువగా ఉందంటున్నారు.
ఈ వీకెండ్ లో తీవ్రమైన చలి నమోదైంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు మూడు డిగ్రీల ఫారెన్ హీట్ కు పడిపోయాయి. బలమైన చలిగాలుల కారణంగా ఈ చలి మైనస్ 14 డిగ్రీల్లో ఉన్నట్లుగా అనిపిస్తున్న దుస్థితి. దీని దెబ్బకు అమెరికన్ ప్రజలు వణికిపోతున్నారు. బయటకు రాలేని పరిస్థితులు. ఇంట్లో ఉన్నప్పటికి.. రూం హీటర్ లేకుంటే బతకలేని పరిస్థితి. ఈశాన్య అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో అయితే చలిగాలి తీవ్రత మైనస్ 40 డిగ్రీలు అన్నట్లుగా ప్రజలు ఫీల్ అవుతున్న పరిస్థితి.
దీంతో న్యూయార్క్.. ఫిలడెల్ఫియా లాంటి పెద్ద నగరాల్లోని 4.3 కోట్ల మంది ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. వాతావరణ శాఖ సైతం తీవ్ర చలిగాలుల హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి పరిస్థితికి కారణం.. ఆర్కిటిక్ గాలులే అని చెబుతున్నారు. ఈ ఆదివారం అంటార్కిటికాలోని మెక్ మర్డో స్టేషన్ లో కంటే న్యూయార్క్ లో చలి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇదో అసాధారణ పరిస్థితిగా పలువురు అభివర్ణిస్తున్నారు. ఈ దారుణ చలితో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు వాతావరణ పరిస్థితులకు 17 మంది మరణిస్తే.. అందులో పదమూడు మంది కేవలం చలి కారణంగా ప్రాణాలు విడిచినట్లుగా అధికారులు చెబుతున్నారు. అంతలా చలిపులి అమెరికన్లను వణికిస్తోంది.
