అనకాపల్లి నుంచి తుని ...రూపు రేఖలు మారిపోతాయి !
జస్ట్ పదేళ్ళలో మహా నగరాల జాబితాలో ఈ ప్రాంతం చేరేందుకు ఆస్కారం ఇచ్చేలా ఒక భారీ ప్రాజెక్టు నిర్మాణానికి ఇక్కడ శ్రీకారం చుట్టబోతున్నారు.
By: Satya P | 13 March 2026 5:19 PM ISTఅభివృద్ధి జరిగితే ఏ ప్రాంతం అయినా అద్భుతంగా ముందుకు సాగుతుంది. ఊహించనంత మార్పు కనిపిస్తుంది. ఈ రోజున మహా నగరాలుగా ఉన్న ప్రాంతాలు అన్నీ అభివృద్ధిని అండగా చేసుకుని ఎదిగినవే. ఇపుడు అలాంటి భాగ్యం అనకాపల్లి జిల్లాకు దక్కబోతోంది. ఏకంగా అనకాపల్లి నుంచి తుని దాకా ఉన్న ప్రాంతం అంతా ప్రగతికి సిసలైన చిరునామాగా మారిపోతోంది. జస్ట్ పదేళ్ళలో మహా నగరాల జాబితాలో ఈ ప్రాంతం చేరేందుకు ఆస్కారం ఇచ్చేలా ఒక భారీ ప్రాజెక్టు నిర్మాణానికి ఇక్కడ శ్రీకారం చుట్టబోతున్నారు.
దేశంలోనే అతి పెద్ద ప్రాజెక్ట్ :
ఇక అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఏకంగా దేశంలోనే అతి పెద్ద ప్రాజెక్ట్ రాబోతోంది. ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ కి ఈ నెల 23న శంకుస్థాపన జరగబోతోంది. ఈ భారీ ప్రాజెక్ట్ అనకాపల్లి జిల్లాకు రావడంతో దశ తిరగనుంది. ఏకంగా 2,200 ఎకరాల భారీ విస్తీర్ణంలో 1.5 లక్షల కోట్ల విలువైన అతి పెద్ద ప్రాజెక్ట్ గా ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ ఉండబోతోంది.
రెండు దశలలో నిర్మాణం :
ఇక ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం రెండు దశలలో జరుగుతుంది. తొలి దశ 2029 నాటికి పూర్తి అయితే 8. 2 మిలియన్ టన్నులు సంవత్సరానికి స్టీల్ ఉత్పత్తి చేస్తుంది. దీని కోసం ఎనభై వేల కోట్లతో తొలి దశ నిర్మాణం పనులు మొదలు కానున్నాయి. ఇక రెండవ దశలో చూస్తే 2034 నాటికి 10.5 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో పూర్తి స్థాయిలో సిద్ధం అవుతుంది. ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా 30 వేల మంది దాకా ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద ఉక్కు కర్మాగారంగా ఇది నిర్మాణం కాబోతోంది. అలగే ఈ ప్రాంతంలో ఒక కీలకమైన గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టుగా దీనిని ముందుకు తీసుకుని వస్తున్నారు.
రూపు రేఖలు మారిపోతాయి :
ఇప్పటిదాకా అనకాపల్లి ప్రాంతంలో ఇంతటి పెద్ద ప్రాజెక్ట్ ఏదీ రాలేదు. తొలిసారిగా ఈ భారీ ఉక్కు కర్మాగారం రావడంతో ఈ ప్రాంతం రూపు రేఖలు మొత్తం మారిపోతాయని అంటున్నారు. ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళే బాధ తప్పడమే కాదు ఘనంగా ఉక్కు కర్మాగారంలో ఉద్యోగం స్థానికులకు దొరుకుతుంది. అంతే కాదు ఇప్పటిదాకా ఉక్కు నగరంగా విశాఖకు ఉన్న పేరు ఈ ప్రాజెక్టు తరువాత అనకాపల్లికి కూడా దక్కనుంది. కేవలం ఉక్కు కర్మాగారం మాత్రమే కాదు అనుబంధంగా అనేక ఇతర ప్రాజెక్టులు వస్తాయి కాబట్టి పారిశ్రామికంగా అనకాపల్లి జిల్లాలో ఊహించని అభివృద్ధి జరుగుతుందని అంచనా వేస్తున్నారు.
మోడీ బాబు చేతుల మీదుగా :
ఈ భారీ ఉక్కు కర్మాగారానికి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా శ్రీకారం చుడతారు. ఉక్కు కర్మాగారం శంకుస్థాపన కోసం ప్రధాని ఆ రోజున విశాఖ పర్యటన పెట్టుకున్నారని చెబుతున్నారు. ఏపీ విభజన తరువాత రాష్ట్రానికి అందులోనూ ఉత్తరాంధ్రకు అతి పెద్ద ప్రాజెక్ట్ గా ఈ స్టీల్ ప్లాంట్ రావడం అంటే గ్రేట్ అని అంటున్నారు.
మహర్దశ పట్టనుంది :
ఇక అనకాపల్లి జిల్లా కేంద్రం నుంచి తుని దాకా ఉన్న దాదాపు 65 కిలోమీటర్ల ప్రాంతం అంతా పూర్తిగా ప్రగతి దారులలో సాగనుంది. ఒక్కసారి కనుక ఉక్కు కర్మాగారం కార్యకలాపాలు ప్రారంభమయ్యాక ఈ ప్రాంత రూపురేఖలనే మార్చివేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. కేవలం పదేళ్ల కాలంలో అయితే ఈ ప్రాంతాలు ఎవరూ గుర్తు పట్టలేనంతగా మారి అభివృద్ధితో కళకళలాడడం ఖాయమని అంటున్నారు.
