Begin typing your search above and press return to search.

అరబ్-నాటో కూటమి : పాక్ తరుఫున భారత్ పై యుద్ధం చేస్తుందా?

ఇదే సమయంలో పాకిస్థాన్‌–సౌదీ అరేబియా మధ్య కొత్త రక్షణ ఒప్పందం కుదరడం, ఈ ఆలోచనకు బలాన్నిస్తోంది.

By:  A.N.Kumar   |   20 Sept 2025 5:30 PM IST
అరబ్-నాటో కూటమి : పాక్ తరుఫున భారత్ పై యుద్ధం చేస్తుందా?
X

మధ్యప్రాచ్యంలో వేగంగా మారుతున్న భౌగోళిక-రాజకీయ పరిణామాలు కొత్త సైనిక కూటముల దిశగా దారి తీస్తున్నాయి. హమాస్‌ నేతలకు ఆశ్రయం కల్పిస్తోందన్న ఆరోపణలపై ఖతార్‌పై ఇజ్రాయెల్‌ ఇటీవల జరిపిన దాడి, అరబ్‌ ప్రపంచాన్ని ఒక్కటి చేసే ప్రయత్నాలకు కొత్త ఊపునిచ్చింది. దోహాలో జరిగిన 50కి పైగా ముస్లిం దేశాల సమావేశంలో ‘అరబ్‌-నాటో’ (Arab NATO) ఏర్పాటుపై గట్టిగా డిమాండ్లు వినిపించాయి. ఇదే సమయంలో పాకిస్థాన్‌–సౌదీ అరేబియా మధ్య కొత్త రక్షణ ఒప్పందం కుదరడం, ఈ ఆలోచనకు బలాన్నిస్తోంది.

పాక్‌–సౌదీ రక్షణ ఒప్పందం

పాకిస్థాన్‌ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్‌ ప్రకారం.. ఈ ఒప్పందం ఇరువురి మధ్య ఉమ్మడి భద్రతా కూటమి లాంటిది. ఏ దేశంపైనా దాడి జరిగితే, రెండింటిపైనా జరిగినట్లే పరిగణించి ఎదుర్కొంటారని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా పాకిస్థాన్‌ అణ్వాయుధ శక్తి, సౌదీ ఆర్థిక బలం కలిసినప్పుడు ఇది గణనీయమైన శక్తి కేంద్రంగా మారుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. సౌదీకి ఇప్పటికే అమెరికా సహకారం, ఆధునిక యుద్ధ విమానాలు, క్షిపణి రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. ఇప్పుడు పాక్‌ అణ్వాయుధ సామర్థ్యంతో కలిస్తే, ఇజ్రాయెల్‌కు బలమైన ప్రత్యర్థిగా నిలవొచ్చని అంచనా.

1960ల నుంచే ఆలోచన

సౌదీ–పాక్‌ మధ్య ఇలాంటి సైనిక సహకార ఆలోచన 1960ల నుంచే ఉంది. అప్పట్లో యుద్ధముప్పు వచ్చినప్పుడు పాక్‌ సైనికులను సౌదీకి పంపేది. 1982లో భద్రతా సహకార ఒప్పందం కూడా కుదిరింది. పాక్‌ సైనికులు సౌదీ సైన్యానికి శిక్షణ ఇవ్వడం, ఆయుధాల కొనుగోలు వంటి సహకారం అప్పటినుంచే కొనసాగుతోంది. ఇప్పుడు ఈ కొత్త ఒప్పందంతో అది మరింత బలపడనుంది.

* భారత్‌పై ప్రభావం?

భారత్‌ దృష్టిలో ఈ పరిణామం ఆందోళనకరం. పాక్‌పై దాడి జరిగితే, దానిని సౌదీపై దాడిగా పరిగణించవచ్చని షరతు, భవిష్యత్తులో భారత్‌–పాక్‌ మధ్య జరిగే ఏవైనా ఘర్షణలను మరింత క్లిష్టం చేస్తుంది. పాక్‌ రక్షణ మంత్రి ‘భారత్‌తో ఉద్రిక్తతలు తలెత్తితే సౌదీ అండగా ఉంటుంది’ అని స్పష్టంగా చెప్పడం ఈ అనుమానాలను బలపరుస్తోంది. అయితే భారత్‌తో సౌదీకి బలమైన వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. సౌదీ భారత్‌కు రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి, ఇక్కడ 24 లక్షల భారతీయులు పని చేస్తున్నారు. ఈ వాస్తవాలను దృష్టిలో ఉంచుకొని సౌదీ నేరుగా భారత్‌పై యుద్ధానికి వెళ్లే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని విదేశాంగ విశ్లేషకులు భావిస్తున్నారు.

‘అరబ్‌ నాటో’ సాధ్యమా?

అరబ్‌ దేశాల మధ్య భద్రతా కూటమి ఆలోచన కొత్తది కాదు. కానీ రాజకీయ, మత, ఆర్థిక విభేదాల కారణంగా ఇప్పటివరకు అది సాధ్యం కాలేదు. ప్రస్తుత ఇజ్రాయెల్‌–హమాస్‌ ఘర్షణలు, అమెరికా–ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు, సౌదీ–పాక్‌ ఒప్పందం వంటి పరిణామాలు ‘అరబ్‌ నాటో’ ఏర్పాటుకు దారితీయవచ్చని సూచనలు ఉన్నాయి. అయితే, ఇది నిజంగా సాధ్యమవుతుందా అన్నది కాలమే నిర్ణయించాలి.

పశ్చిమాసియాలో భద్రతా సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. సౌదీ–పాక్‌ ఒప్పందం ఒక కొత్త మలుపు. ఇది ముస్లిం దేశాల ఉమ్మడి రక్షణ వ్యూహానికి నాంది కావచ్చని కొందరు అంటుండగా, భారత్‌తో ఉన్న ఆర్థిక– వ్యూహాత్మక సంబంధాలను దృష్టిలో ఉంచుకుంటే సౌదీ నేరుగా శత్రుత్వానికి దిగదని మరికొందరు విశ్లేషిస్తున్నారు. అయినప్పటికీ, ఈ పరిణామాలు భారతదేశం జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది.