Begin typing your search above and press return to search.

10 టికెట్లు బుక్ చేస్తే ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు! ఏపీలో కొత్త ప్రయోగం

బస్సు సర్వీసులు తగ్గిపోవడం, కొత్త బస్సులు కొనుగోలు చేయకపోవడం, రద్దీ పెరగడం వంటి కారణాలతో సిబ్బంది తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రయాణికులతో తరచూ ఘర్షణలు, గొడవలు జరుగుతున్నాయి.

By:  Tupaki Political Desk   |   30 Aug 2026 9:15 PM IST
10 టికెట్లు బుక్ చేస్తే ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు! ఏపీలో కొత్త ప్రయోగం
X

చేయ్యెత్తిన చోట బస్సులు ఆపాలి. ఇది ఆర్టీసీ నిబంధన. అయితే ప్రస్తుతం అనేక కారణాలతో చేయొత్తిన చోట కాదుకదా కనీసం బస్సు స్టాపుల్లో కూడా బస్సులు నిలపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బస్సు సర్వీసులు తగ్గిపోవడం, కొత్త బస్సులు కొనుగోలు చేయకపోవడం, రద్దీ పెరగడం వంటి కారణాలతో సిబ్బంది తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రయాణికులతో తరచూ ఘర్షణలు, గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీపై ప్రయాణికులలో తీవ్ర అసంతృప్తి పెరిగిపోతోంది. అయితే ఈ పరిస్థితుల్లో ప్రయాణికుల కోసం ఆర్టీసీ బస్సులను ఇళ్ల వద్దకే పంపాలనే వినూత్న నిర్ణయాన్ని తీసుకున్నారు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు. విజయవాడలో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని భావిస్తున్న ఈ స్కీం ఫలితాలను అధ్యయనం చేసి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని ప్లాన్ చేస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి.

విజయవాడ నుంచి ప్రయోగం

పది మంది కన్నా ఎక్కువ మంది ప్రయాణికులు బస్సును బుక్ చేసుకుంటే ఇంటి వద్దకే వచ్చి ప్రయాణికులను పికప్ చేసుకోవాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా విజయవాడ నగరంలో అమలు చేయాలని భావిస్తోంది. ఈ సరికొత్త విధానాన్ని సమర్థంగా అమలు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దూర ప్రాంతల మధ్య నడిచే ఏసీ, నాన్ ఏసీ సర్వీసుల్లో ఈ విధానం ప్రవేశపెట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఏసీ ఇంధ్ర, అమరావతి, వెన్నెల బస్సులతో పాటు నాన్ ఏసీ సర్వీసులు అయిన నైట్ రైడర్, సూపర్ లగ్జరీ సర్వీసులు, డాల్ఫిన్ క్రూయిజర్ వంటి అత్యాధునిక బస్సులలో ప్రయాణానికి కనీసం పది టికెట్లు బుక్ చేసుకుంటే ప్రయాణికులను వారి ఇళ్ల వద్దకే వెళ్లి ఎక్కించుకోవాలని భావిస్తున్నారు. దీనివల్ల ప్రైవేటు ట్రావెల్స్ కి గట్టి పోటీ ఇవ్వొచ్చునని భావిస్తున్నారు.

వివాహాలు, విహారయాత్రల కోసం..

ప్రస్తుతం ఆర్టీసీలో ఒక బస్సు మొత్తాన్ని బుక్ చేసుకుంటేనే ఈ సౌకర్యం కల్పిస్తున్నారు. కానీ, ప్రస్తుతం ప్రైవేటు రంగం నుంచి తీవ్ర పోటీ ఎదురవుతుండటంతో పది టికెట్లు బుక్ చేసినా సరే ఈ సౌలభ్యం కల్పించాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. వివాహాలు, విహారయాత్రలకు వెళ్లాలని అనుకునే వారికి ఈ సర్వీసు ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు. అదేవిధంగా సుదూర ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఒకేసారి హాస్టల్ నుంచి రావాలి అనుకున్నా, ఒకేసారి వెళ్లాలి అనుకున్నా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చునని చెబుతున్నారు.

ముఖ్య కూడళ్ల నుంచి సర్వీసులు

అదేవిధంగా ఆర్టీసీ సర్వీసులను ప్రైవేటు సర్వీసులు మాదిరిగానే ముఖ్య కూడళ్లలో నిలిపి ప్రయాణికులను ఎక్కించుకోవాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో ఆయా బస్టాండుల నుంచి మాత్రమే బస్సు సర్వీసులు నడుపుతున్నారు. అయితే ప్రైవేటు సర్వీసులు మాత్రం ఆయా నగరాల్లో ప్రధాన కూడళ్ల వద్దే ఉంచి ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్లిపోతున్నాయి. దీనివల్ల ప్రయాణికులకు సౌలభ్యంగా ఉండటమే కాకుండా కాలం కలిసివస్తుందని చెబుతున్నారు. దీంతో ఇకపై ఆర్టీసీ సర్వీసులను కూడా బస్టాండ్ తో సంబంధం లేకుండా ముఖ్య కూడళ్ల నుంచి నడిపేలా ప్రణాళిక రచిస్తున్నారని చెబుతున్నారు.

చార్జీలు తగ్గించే ఆలోచన

ఇక ఆర్టీసీ నష్టాలను తగ్గించుకోవడంతోపాటు ఆక్యుపెన్సీ పెంచుకోవడానికి కొత్త ఆలోచనలు చేస్తున్నారని చెబుతున్నారు. ప్రధాన నగరాల మధ్య నడిచే బస్సు సర్వీసుల టికెట్ రేట్లను రద్దీకి తగినట్లు సవరించాలని నిర్ణయించారు. ప్రధానంగా రద్దీ లేని సమయంలో గరిష్ట ధర కన్నా 10 లేదా 20 శాతం చార్జీలు తగ్గించే ప్రతిపాదనను అధికారులు పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రైవేటులో రద్దీ సమయంలో చార్జీలు పెంచేయడం, రద్దీ లేని సమయంలో చార్జీలను తగ్గిస్తూ ప్రయాణికులను తన్నుకుపోతున్నారని చెబుతున్నారు. రద్దీ సమయంలో ధరలు స్థిరంగా ఉండటం వల్ల ఆర్టీసీ వైపు ప్రయాణికులు చూస్తున్నప్పటికీ రద్దీ లేని సమయంలో ఆర్టీసీ కన్నా తక్కువ చార్జీలు ఉండటం మూలంగా ప్రైవేటు సర్వీసులవైపు ప్రయాణికులు మళ్లుతున్నారని అంటున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు రద్దీ లేని సమయంలో ధరలను తగ్గించాలనే ప్రతిపాదనను ఆర్టీసీ పరిశీలిస్తోందని చెబుతున్నారు.