Begin typing your search above and press return to search.

‘ఏప్రిల్ ఫూల్’ ఎలా వచ్చింది.. దాని వెనుక ఇంత కథ ఉందా..?

ఈ రోజు ఏప్రిల్ 1వ తేదీ కాబట్టి పొద్దున్నే లేచినప్పటి నుంచి ఎవరిని 'ఫూల్' చేద్దామా.? లేదా ఎవరి చేతిలో 'ఫూల్' అవుదామా అనే భయం అందరిలోనూ ఉంటుంది.

By:  Tupaki Political Desk   |   1 April 2026 11:47 AM IST
‘ఏప్రిల్ ఫూల్’ ఎలా వచ్చింది.. దాని వెనుక ఇంత కథ ఉందా..?
X

ఈ రోజు ఏప్రిల్ 1వ తేదీ కాబట్టి పొద్దున్నే లేచినప్పటి నుంచి ఎవరిని 'ఫూల్' చేద్దామా.? లేదా ఎవరి చేతిలో 'ఫూల్' అవుదామా అనే భయం అందరిలోనూ ఉంటుంది. కానీ, ఈ సరదా వెనుక శతాబ్దాల నాటి చరిత్ర, క్యాలెండర్ మార్పు కథ దాగి ఉందంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా..! స్నేహితులను ఆటపట్టించడం నుంచి సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ వరకు 'ఏప్రిల్ ఫూల్' అనేది ఇప్పుడు ఒక అంతర్జాతీయ సంప్రదాయంగా మారింది. ఈ ఆసక్తికరమైన రూమర్, ఏప్రిల్ ఫూల్ డే వెనుక ఉన్న చారిత్రక కోణాలను తెలుసుకుంటే..

క్యాలెండర్ మార్పు తెచ్చిన తిప్పలు!

ఏప్రిల్ ఫూల్ ఆవిర్భావం వెనుక ఫ్రాన్స్‌కు చెందిన ఒక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. 1582లో ఫ్రాన్స్ తన పాత క్యాలెండర్‌ను మార్చి గ్రెగోరియన్ క్యాలెండర్‌ను అనుసరించాలని నిర్ణయించుకుంది. దీని ప్రకారం కొత్త సంవత్సరం జనవరి 1న ప్రారంభమవుతుంది. ఆ కాలంలో వార్తలు చేరడం చాలా ఆలస్యమయ్యేది. దీనివల్ల చాలా మందికి క్యాలెండర్ మారిన విషయం తెలియదు. వారు పాత పద్ధతిలోనే ఏప్రిల్ 1న కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటూనే ఉన్నారు. కాలం మారుతున్నా, అప్డేట్ అవ్వని వారిని చూసి మిగిలిన వారు ఏగతాళి చేయడం మొదలుపెట్టారు. జనవరి 1నే కొత్త సంవత్సరం అని తెలిసిన వారు, ఇంకా ఏప్రిల్ 1న పండుగ చేసుకునే వారిని 'ఏప్రిల్ ఫూల్స్' అని పిలిచేవారు. అలా పాత పద్ధతిని ఫాలో అయ్యే వారి వీపుపై 'పేపర్ ఫిష్' (చేప బొమ్మ) అతికించి వారిని వెర్రివాళ్లను చేసేవారు. ఫ్రాన్స్‌లో దీనిని 'పాయిసన్ డి ఏప్రిల్' (ఏప్రిల్ ఫిష్) అని పిలుస్తారు. సులభంగా చిక్కుకుపోయే చేప అని అర్థం.

రూమరా? వాస్తవమా?

ఏప్రిల్ ఫూల్ పుట్టుకపై కేవలం ఈ ఫ్రాన్స్ కథే కాదు.., ఇంకా కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. రోమన్ సామ్రాజ్యంలో 'హిలేరియా' అనే పండుగ ఉండేది, అక్కడ ప్రజలు మారువేషాల్లో వచ్చి ఒకరినొకరు ఆటపట్టించేవారు. 18వ శతాబ్దంలో బ్రిటన్ అంతటా ఏప్రిల్ ఫూల్ డే విస్తరించింది. స్కాట్లాండ్‌లో అయితే ఇది రెండు రోజుల పాటు జరుగుతుంది. భారతీయులు కూడా ఈ సరదా సంప్రదాయాన్ని ఎప్పుడో అలవాటు చేసుకున్నారు. ముఖ్యంగా స్కూళ్లు, ఆఫీసుల్లో ఈరోజు నవ్వుల జల్లులు కురుస్తుంటాయి. కానీ పెద్దగా వేడుకలు లాంటివి మాత్రం చేయరు.

డిజిటల్ యుగంలో..

పెరుగుతున్న సాంకేతికత, డిజిటల్ యుగంలో ఏప్రిల్ ఫూల్ అనేది కేవలం సరదాకే పరిమితం కావడం లేదు. గూగుల్ వంటి పెద్ద కంపెనీలు కూడా ఏటా వింతైన ఫీచర్లను అనౌన్స్ చేసి యూజర్లను ఫూల్ చేస్తుంటాయి. వాట్సాప్, ఫేస్‌బుక్‌లో నిజం అని నమ్మేలా ఉండే అబద్ధపు వార్తలను షేర్ చేస్తుంటారు. సెలబ్రిటీల మరణ వార్తలు లేదా అసాధ్యమైన ఆఫర్ల గురించి వచ్చే మెసేజ్‌లను చూసి జాగ్రత్తగా ఉండాలి.

ఏదో ఒక సమయంలో మనమందరం ఏప్రిల్ ఫూల్ అయ్యే ఉంటాం కదా.. అది ఒక మధురమైన జ్ఞాపకం. ఏప్రిల్ 1వ తేదీ అనేది ఎదుటివారిని చిన్నచూపు చూసేందుకు కాదు, జీవితంలో ఉన్న ఒత్తిడిని మర్చిపోయి కాసేపు సరదాగా నవ్వుకోవడానికి కేటాయించిన రోజు. కాబట్టి ఈరోజు ఎవరినైనా ఫూల్ చేయాలనుకుంటే, అది కేవలం నవ్వు పుట్టించేలా ఉండాలి తప్ప, ఎవరినీ మానసికంగా లేదా శారీరకగా బాధపెట్టకూడదు. ఈరోజు మీరు కూడా ఒక చిన్న ప్రాంక్ ప్లాన్ చేసుకోండి, కానీ అది ఆరోగ్యకరమైన పరిహాసంగా ఉండేలా చూసుకోండి!