Begin typing your search above and press return to search.

యాపిల్ తదుపరి వారసుడిగా 'హార్డ్‌వేర్ మాస్టర్'!

యాపిల్ సామ్రాజ్యానికి తదుపరి వారసుడు ఎవరు? ప్రపంచ టెక్ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన ప్రశ్న ఇది.

By:  A.N.Kumar   |   13 Jan 2026 12:00 AM IST
యాపిల్ తదుపరి వారసుడిగా హార్డ్‌వేర్ మాస్టర్!
X

యాపిల్ సామ్రాజ్యానికి తదుపరి వారసుడు ఎవరు? ప్రపంచ టెక్ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన ప్రశ్న ఇది. గత దశాబ్ద కాలంగా టిమ్ కుక్ సారథ్యంలో యాపిల్ అప్రతిహతంగా దూసుకుపోతోంది. అయితే కుక్ తర్వాత ఆ బాధ్యతలు చేపట్టేది ఎవరనే చర్చ వచ్చినప్పుడల్లా వినిపిస్తున్న ఏకైక పేరు జాన్ టెర్నస్.

ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీలలో ఒకటిగా ఉన్న యాపిల్‌లో నాయకత్వ మార్పు అంటే అది కేవలం ఒక కంపెనీకి సంబంధించిన విషయం కాదు.. మొత్తం టెక్ ప్రపంచపు గమనాన్ని మార్చే అంశం. టిమ్ కుక్ రిటైర్మెంట్ గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో యాపిల్ బోర్డు సభ్యుల చూపు ఇప్పుడు హార్డ్‌వేర్ ఇంజనీరింగ్ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జాన్ టెర్నస్ వైపు మళ్ళినట్లు తెలుస్తోంది.

ఎవరీ జాన్ టెర్నస్?

50 ఏళ్ల జాన్ టెర్నస్ గత 20 ఏళ్లకు పైగా యాపిల్ ప్రయాణంలో అంతర్భాగంగా ఉన్నారు. 2001లో ప్రొడక్ట్ డిజైన్ టీమ్‌లో చేరిన ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ కంపెనీలో అత్యంత కీలకమైన వ్యక్తిగా మారారు. 2021లో ఆయన హార్డ్‌వేర్ ఇంజనీరింగ్‌ విభాగానికి బాధ్యతలు చేపట్టారు.

ఐఫోన్ నుంచి ఎయిర్‌పాడ్స్ వరకు.. టెర్నస్ ముద్ర

యాపిల్ సాధించిన అద్భుత విజయాల్లో టెర్నస్ పాత్ర వెలకట్టలేనిది. ఐఫోన్ 12 సిరీస్ నుంచి నేటి వరకు వచ్చిన ప్రతి మోడల్ వెనుక ఆయన ఇంజనీరింగ్ నైపుణ్యం ఉంది. ఇంటెల్ చిప్‌ల నుంచి యాపిల్ సొంత 'ఎం' సిరీస్ చిప్‌లకు మారడంలో టెర్నస్ కీలక పాత్ర పోషించారు. ఇది యాపిల్ చరిత్రలోనే ఒక భారీ మలుపు. ప్రతి ప్రొడక్ట్ డిజైన్‌లో 'యూజర్ ఎక్స్‌పీరియన్స్'కు పెద్దపీట వేయడం టెర్నస్ శైలి.

ఎందుకు ఈయనే సరైన ఎంపిక?

టిమ్ కుక్ తర్వాత చాలా మంది పేర్లు జెఫ్ విలియమ్స్ వంటి వారు పరిశీలనలోకి వచ్చినప్పటికీ టెర్నస్ పేరు ప్రముఖంగా వినిపించడానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం 50 ఏళ్ల వయస్సులో ఉన్న టెర్నస్ ఒకవేళ బాధ్యతలు చేపడితే మరో 10-15 ఏళ్ల పాటు సుదీర్ఘ కాలం కంపెనీని నడిపించే అవకాశం ఉంటుంది. టిమ్ కుక్ ఆపరేషన్స్ నిపుణుడు అయితే టెర్నస్ ఒక 'ప్రాడక్ట్ పర్సన్'. స్టీవ్ జాబ్స్ తరహాలో ప్రొడక్ట్ డిజైన్ , టెక్నాలజీపై ఆయనకు లోతైన అవగాహన ఉంది. యాపిల్ సంస్కృతిని, కంపెనీ గోప్యతను మరియు నాణ్యతను ఆయన వంటబట్టించుకున్నారు. కంపెనీ లోపల కూడా ఆయనకు మంచి ఆదరణ ఉంది.

క్రమశిక్షణ కలిగిన 'స్విమ్మర్'

టెర్నస్ కేవలం టెక్నాలజీలోనే కాదు. వ్యక్తిగత క్రమశిక్షణలోనూ ముందుంటారు. పెన్సిల్వేనియా యూనివర్సిటీలో చదువుతున్న రోజుల్లో ఆయన కాలేజీ స్థాయి స్విమ్మర్. క్రీడల్లో ఉండే ఆ పట్టుదల, లక్ష్యం కోసం శ్రమించే గుణమే ఆయన్ను ఇవాళ యాపిల్ టాప్ రేసులో నిలబెట్టాయని ఆయన సహచరులు చెబుతుంటారు.

ఒకవేళ టెర్నస్ బాధ్యతలు చేపడితే ఆయన ముందు భారీ సవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో యాపిల్‌ను నంబర్ వన్‌గా నిలబెట్టడం, కొత్త కేటగిరీ ప్రొడక్ట్స్ విజన్ ప్రో వంటివి సక్సెస్ చేయడం ఆయన అసలైన పరీక్షలు కానున్నాయి.

టిమ్ కుక్ వారసుడిగా జాన్ టెర్నస్ పేరు దాదాపు ఖరారైనట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. హార్డ్‌వేర్ రంగంలో ఆయనకున్న పట్టు యాపిల్‌కు కొత్త వెలుగునిస్తుందని ఆశిద్దాం.