భారత్ లో ఐఫోన్ - 17 తయారీ.. 16 సరఫరాలు వేరే లెవెల్!
అవును... ప్రముఖ టెక్ దిగ్గజం, యాపిల్ ఉత్పత్తుల సప్లయర్ గా ఉన్న ఫాక్స్ కాన్ భారత్ లో ఐఫోన్-17 ఉత్పత్తిని ప్రారంభించింది.
By: Raja Ch | 18 Aug 2025 1:00 AM ISTభారత్ లో ఈ ఏడాది ప్రథమార్ధంలో యాపిల్ ఫోన్ల సరఫరాలు వార్షిక ప్రాతిపదికన 21.5 శాతం పెరిగి 59 లక్షలకు చేరాయని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) వెల్లడించింది. ఐఫోన్ - 16 ఫోన్లు సమీక్షా కాలంలో అత్యధికంగా సరఫరా అయ్యాయని తెలిపింది. ఇదే సమయంలో భారత్ లో ఐఫోన్-17 ఉత్పత్తులు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు కీలక అప్ డేట్ తెరపైకి వచ్చింది.
అవును... ప్రముఖ టెక్ దిగ్గజం, యాపిల్ ఉత్పత్తుల సప్లయర్ గా ఉన్న ఫాక్స్ కాన్ భారత్ లో ఐఫోన్-17 ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ సమయంలో రెండో అతిపెద్ద యూనిట్ అయిన బెంగళూరు ప్లాంట్ లో మొబైల్ తయారీ చేపట్టినట్లు సమాచారం. సుమారు రూ.25 వేల కోట్ల పెట్టుబడితో దేవనహళ్లి సమీపంలో ఏర్పాటు చేసిన ఈ యూనిట్, చైనా బయట ఫాక్స్ కాన్ ఏర్పాటు చేసిన రెండో అతిపెద్ద ఫ్యాక్టరీ.
ఇదే సమయంలో ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) ప్రకారం.. ఏప్రిల్ - జూన్ త్రైమాసికం వరకు భారత్ లో 3.7 కోట్ల ఫోన్లు సరఫరా అవ్వగా.. మొత్తం 2025 ప్రథమార్ధంలో 7 కోట్ల ఫోన్లు సరఫరా అయ్యాయి. వాస్తవానికి చైనా కంపెనీలకు చెందిన వన్ ప్లస్, పోకో, షియోమీ, రియల్ మీ ఫోన్ల సరఫరాలు తగ్గడంతో మొత్తం స్మార్ట్ ఫోన్ల సరఫరాలు వృద్ధి తక్కువగా నమోదైంది.
కానీ... యాపిల్ మాత్రం 59 లక్షల స్మార్ట్ ఫోన్లను సరఫరా చేసింది. ఇది 21.5 శాతం వృద్ధి కాగా.. మొత్తం భారత సరఫరాల్లో ఐఫోన్-16 వాటా 4 శాతంగా ఉంది.
ఇక రియల్ మీ, షియోమీ, పోకో ల వాటా తగ్గింది. ఇందులో భాగంగా... రియల్ మీ మార్కెట్ వాటా 9.7 శాతానికి తగ్గగా.. స్మార్ట్ ఫోన్ల సరఫరాలు కూడా 17.8 శాతం తగ్గాయి. ఇదే సమయంలో షియోమీ మార్కెట్ వాటా 9.6 శాతానికి పరిమితమవ్వగా.. సరఫరాలు 23.5 శాతం తగ్గాయి. అదేవిదంగా... పోకో మార్కెట్ వాటా 3.8 శాతానికి తగ్గి, సరఫరాలు 28.8 శాతం తగ్గాయి.
