Begin typing your search above and press return to search.

రూ.3 లక్షల ఐఫోన్‌పై తొలిరోజే ఫిర్యాదులు.. ఫోల్డబుల్ టెక్నాలజీకి యాపిల్ అసలైన పరీక్ష

'ఇంత భారీ ధర పెట్టాం కదా.. టెక్నాలజీ అదిరిపోతుంది' అని సంబరపడి ఫోన్‌ను ఒక్కసారి మడత విప్పారో లేదో... డిస్‌ప్లేతో పాటు కొనుగోలుదారుల గుండెలు కూడా ఖరీదైన పగుళ్లు బారిన పడుతున్నాయి.

By:  A.N.Kumar   |   27 Oct 2026 3:05 PM IST
రూ.3 లక్షల ఐఫోన్‌పై తొలిరోజే ఫిర్యాదులు.. ఫోల్డబుల్ టెక్నాలజీకి యాపిల్ అసలైన పరీక్ష
X

ఒక్క ఫోన్‌తో ఇల్లు కట్టుకోవచ్చో లేదో తెలీదు కానీ... జీవితాంతం పచ్చళ్లు పెట్టుకునేంత సీరియస్ 'కారం' మాత్రం నూరవచ్చని యాపిల్ నిరూపించింది.. రూ.3 లక్షల పచ్చటి నోట్లను మడతపెట్టి యాపిల్ చేతిలో పెడితే... వాళ్లు మన చేతిలో ఒక డిజైనర్ ఫోన్ పెట్టి దానితో పాటు ఉచితంగా కొన్ని లచ్చల "మానసిక ప్రశాంతత" గీతాలను.. డిస్‌ప్లే పగుళ్లను కూడా బోనస్‌గా ఇచ్చేశారు. 'ఇంత భారీ ధర పెట్టాం కదా.. టెక్నాలజీ అదిరిపోతుంది' అని సంబరపడి ఫోన్‌ను ఒక్కసారి మడత విప్పారో లేదో... డిస్‌ప్లేతో పాటు కొనుగోలుదారుల గుండెలు కూడా ఖరీదైన పగుళ్లు బారిన పడుతున్నాయి.

స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో యాపిల్ బ్రాండ్‌కు ఉన్న ప్రత్యేకతే వేరు. ప్రీమియం డిజైన్.. అద్భుతమైన పనితీరు.. అత్యాధునిక ఫీచర్లతో యాపిల్ ఉత్పత్తులు ఎప్పుడూ ముందుంటాయి. అయితే టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన యాపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ మార్కెట్లోకి వచ్చిన తొలిరోజే కొన్ని ఊహించని వివాదాల్లో చిక్కుకుంది. సుమారు రూ.3 లక్షల భారీ ధరతో విడుదలైన ఈ ప్రీమియం ఫోన్‌లో డిస్‌ప్లే సమస్యలు తలెత్తుతున్నట్లు వస్తున్న వార్తలు టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

రూ.3 లక్షల ఫోన్.. భారీ అంచనాలు

సాధారణ ఐఫోన్‌లకు పూర్తిగా భిన్నంగా, మడతపెట్టే డిస్‌ప్లే సౌకర్యంతో ఈ సరికొత్త ఫోన్‌ను యాపిల్ రూపొందించింది. ఈ స్థాయి ధరతో ఫోన్‌ను కొనుగోలు చేసే వినియోగదారులు అత్యుత్తమ నాణ్యతను ఆశించడం సహజం. అయితే ఫోల్డబుల్ ఫోన్లలో ప్రధానమైన హింజ్ వ్యవస్థ, ఫ్లెక్సిబుల్ స్క్రీన్ మన్నిక తయారీదారులకు ఎప్పుడూ ఒక సవాలే. ఇప్పుడు అదే అంశంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

డిస్‌ప్లేలో పగుళ్లు.. ఆందోళనలో వినియోగదారులు

కొత్త ఫోల్డబుల్ ఐఫోన్‌ను కొనుగోలు చేసిన కొందరు వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా తమ సమస్యలను పంచుకుంటున్నారు. ఫోన్ ఉపయోగించడం ప్రారంభించిన కొద్ది గంటల్లోనే లేదా రోజుల వ్యవధిలోనే స్క్రీన్‌పై గీతలు, పగుళ్లు రావడం, మధ్యభాగంలో డిస్‌ప్లే సరిగ్గా పనిచేయకపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతున్నట్లు వారు ఆరోపిస్తున్నారు. అయితే ఈ సమస్యలు ఎంతవరకు నిజం? తయారీ లోపమా లేక వినియోగదారుల పొరపాటా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.

యాపిల్ స్పందనపైనే అందరి చూపు

ఇలాంటి ప్రీమియం శ్రేణి గాడ్జెట్ల విషయంలో కస్టమర్లు కేవలం బ్రాండ్ ఇమేజ్‌ను మాత్రమే కాకుండా.. ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ , వారంటీ నిబంధనలను కూడా బేరీజు వేసుకుంటారు. ఈ నేపథ్యంలో డిస్‌ప్లే సమస్యలపై వస్తున్న ఫిర్యాదులపై యాపిల్ ఏ విధంగా స్పందిస్తుంది? లోపాలను ఎలా సరిదిద్దుతుంది అనేదానిపైనే ఆ సంస్థ భవిష్యత్తు విజయం ఆధారపడి ఉంటుంది.

కొనుగోలుదారులు ఏం చేయాలి?

మీరు కూడా ఈ ఫోల్డబుల్ ఐఫోన్‌ను కొనుగోలు చేయాలని భావిస్తుంటే కొద్దిరోజులు వేచి చూడటం మంచిది. మార్కెట్లో పూర్తి స్థాయి రివ్యూలు వచ్చే వరకు.. వారంటీ నిబంధనలు క్షుణ్ణంగా పరిశీలించే వరకు తొందరపడి నిర్ణయం తీసుకోకపోవడమే ఉత్తమం.

రూ.3 లక్షల భారీ ధర పెట్టి కొనే ఫోన్‌లో కేవలం అత్యాధునిక టెక్నాలజీ మాత్రమే కాకుండా.. అందుకు తగిన దీర్ఘకాలిక విశ్వసనీయత కూడా ఉండాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. మరి ఈ సవాల్‌ను యాపిల్ ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి.