అపోలో హాస్పిటలస్ కు ఆర్ బీఐ ఫైన్.. ఇంతకూ చేసిన తప్పేంటి?
దేశ ప్రజలకు సుపరిచితమైన అపోలో హాస్పిటల్స్ ఎంటర ప్రైజెస్ లిమిటెడ్ కు ఆర్ బీఐ (భారత రిజర్వు బ్యాంక్) రూ.17.76 కోట్ల ఫైన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
By: Garuda Media | 18 Jun 2026 10:45 AM ISTదేశ ప్రజలకు సుపరిచితమైన అపోలో హాస్పిటల్స్ ఎంటర ప్రైజెస్ లిమిటెడ్ కు ఆర్ బీఐ (భారత రిజర్వు బ్యాంక్) రూ.17.76 కోట్ల ఫైన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. కంపెనీకి చెందిన ఐదుగురు టాప్ డైరెక్టర్లు ఒక్కొక్కరికి రూ.18 లక్షల చొప్పున జరిమానా విదిస్తూ నిర్ణక్ష్ం తీసుకుంది. విదేశీ పెట్టుబడుల లావాదేవీల్లో రూల్స్ ను బ్రేక్ చేసినట్లుగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జరిపిన దర్యాప్తులో తేలింది. దీంతో ఆర్ బీఐ ఫైన్ షాకిచ్చింది. ఈ అంశంపై స్పందించిన అపోలో హాస్పిటల్స్ ఎలాంటి వాదనలకు దిగకుండా.. ఆర్ బీఐ విధించిన ఫైన్ ను కట్టేసింది. దీంతో.. ఈ వివదానికి తెర దించినట్లైంది.
అసలు ఇంతకూ ఏం జరిగింది? అపోలో హాస్పిటల్స్ చేసిన తప్పేంటి? ఆ వివరాల్ని ఎవరు గుర్తించారు? ఎలా విచారణ మొదలైంది? తదనంతరం దారి తీసిన పరిణామాలేంటి? ఈ వివాదం ఎప్పటి నుంచి సాగుతోంది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే ఆసక్తికర సమాధానాలు లభిస్తాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి లేని మల్టీ బ్రాండ్ రిటైల్ ట్రేడింగ్ రంగంలో అపోలో రూ.859.88 కోట్ల విదేశీ పెట్టుబడుల్ని స్వీకరించింది. ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు ప్రభుత్వం నుంచి ముందస్తుగా అనుమతులు తీసుకోలేదు. ఫెమా మార్గదర్శకాలకు విరుద్ధంగా రూ.70.02 కోట్ల విలువైన విదేశీ మారక ద్రవ్యం కన్వర్టిబుల్ బాండ్లను జారీ చేసింది. పరిమితికి మించి రూ.623.88 కోట్ల విదేశీ పెట్టుబడులను అనుమతించింది. మల్టీ బ్రాండ్ రిటైల్ రంగంలో ఉండాల్సిన 51 శాతం గరిష్ఠ విదేశీ వాటా పరిమితిని కూడా అపోలో అధిగమించటం అసలు సమస్యగా చెప్పాలి.
ఇంతకూ అపోలో చేసిన తప్పుల్ని ఎలా గుర్తించారన్న ప్రశ్నకు సమాధానం ఈడీ విడుదల చేసిన అధికారిక ప్రెస్ నోట్ లో వివరంగా వెల్లడించింది. తమకు లభించిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఈ సందర్భంగా అపోలో చేసిన తప్పుల్ని గుర్తించిన ఈడీ.. ఫెమా ఉల్లంఘనల వివరాల్ని సంబంధిత అథారిటీకి తెలియజేసింది. ఈ సందర్భంగా అపోలో యాజమాన్యం తమపై వచ్చిన ఆరోపణలకు విరుగుడుగా వివాదాన్ని ఆర్ బీఐ వద్దకు తీసుకెళ్లి.. సాంకేతికంగా జరిగిన తప్పుల్ని ప్రస్తావిస్తూ.. నిబంధనల ప్రకారం ఫైన్ చెల్లించేందుకు సిద్ధమన్న సంకేతాల్ని ఇచ్చింది. ఇందుకు ఈడీ సానుకూలంగా స్పందించటంతో ఆర్ బీఐ సెటిల్ మెంట్ ఆర్డర్ జారీ చేస్తూ.. భారీ ఫైన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఉద్దేశపూర్వకంగా కాకుండా సాంకేతికంగా దొర్లిన తప్పులుగా అపోలో తన వాదనలో వెల్లడించింది. సుదీర్ఘంగా సాగే కోర్టు విచారణలతో సంస్థ ప్రతిష్ఠ దెబ్బ తినకుండా ఉండేందుకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద లభించే కాంపౌండింగ్ సదుపాయాన్ని ఉపయోగించుకుంటామని.. తప్పులు సరిదిద్దుకునేందుకు ఫైన్ చెల్లించేందుకు తాము సిద్దంగా ఉన్నట్లు ఆర్ బీఐ కు దరఖాస్తు చేసుకుంది. దీంతో ఆర్ బీఐ ఫైన్ విధిస్తూ నిర్ణయాన్ని తీసుకుంది.
ఇందుకు ప్రతిగా ఆర్ బీఐ ప్రతిపాదించిన కాంపౌండింగ్ ఫీజును పూర్తిగా చెల్లించటమే కాదు.. సంస్థకు చెందిన ఐదుగురు టాప్ డైరెక్టర్లు (ప్రీతా రెడ్డి, సునీతా రెడ్డి, ఎస్ కే వెంకట్రమాన్, అఖిలేశ్వరన్ క్రిష్ణన్, ఎస్ఎం క్రిష్ణన్) ఒక్కొక్కరురూ.18 లక్షల చొప్పున వ్యక్తిగత ఫైన్ ను కూడా వెంటనే చెల్లించేశారు. దీంతో అపోలో సంస్థపైనా.. దాని డైరెక్టర్లపైనా ఉన్న వివాదం పూర్తిగా ముగిసినట్లైంది. నిధుల చెల్లింపుతో ఈడీ ఈ కేసుకు సంబంధించి నో అబ్జెక్షన్ ఇచ్చింది. దీంతో సంస్థ పైనా.. సంస్థ టాప్ డైరెక్టర్ల మీద ఉన్న అన్ని రకాల న్యాయపరమైన చర్యలు అధికారికంగా ముగిసినట్లుగా ఈడీ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో వెల్లడించింది. దీంతో.. ఈ వివాదం ముగిసినట్లైంది.
