జడ్పీ ఎన్నికలకు గండం.. ఇటు కౌంటింగ్, అటు పోలింగ్ సాధ్యమేనా?
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై తీవ్ర తర్జనభర్జన జరుగుతోంది. సుప్రీంకోర్టు సూచనలతో ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడ్డాయి.
By: Tupaki Political Desk | 23 Oct 2026 2:00 PM ISTఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై తీవ్ర తర్జనభర్జన జరుగుతోంది. సుప్రీంకోర్టు సూచనలతో ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. న్యాయపరమైన సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్న ఎన్నికల సంఘం వచ్చేనెల 1వ తేదీకి మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేసింది. 3వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందని ప్రకటించింది. దీంతో జడ్పీ, మండల పరిషత్ ఎన్నికలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం నవంబరు 3న జరగాల్సి వుంది. అయితే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు వల్ల జడ్పీ ఎన్నికల షెడ్యూల్ మారే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
మున్సిపల్ ఎన్నికల కొత్త షెడ్యూల్ వల్ల జడ్పీ ఎన్నికలు వాయిదా వేయక తప్పదని పరిశీలకులు భావిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం జడ్పీ ఎన్నికలు నిర్వహించేందుకు మౌలిక వసతులతోపాటు సిబ్బంది కొరత ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత అవే బ్యాలెట్ బాక్సులను పరిషత్ ఎన్నికలకు వినియోగించాల్సి వుంటుందని చెబుతున్నారు. అయితే తాజా షెడ్యూల్ వల్ల మున్సిపల్ ఎన్నికల బ్యాలెట్ బాక్సులు ఖాళీ అయ్యే పరిస్థితి కనిపించడం లేదని, అటువంటి పరిస్థితుల్లో జడ్పీ ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులను ఎక్కడి నుంచి తీసుకువస్తారని ప్రశ్నిస్తున్నారు.
బ్యాలెట్ బాక్సులే కాకుండా సిబ్బంది, భవనాలు కూడా కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నాయని సందేహిస్తున్నారు. మున్సిపల్, జడ్పీ ఎన్నికలకు సంబంధం లేకపోయినా, ఒకే రోజు ఇటు పోలింగ్, అటు కౌంటింగ్ నిర్వహించడం ఎన్నికల విధుల్లో ఉండే అధికారులు, పోలీసులకు తలకు మించిన భారంగా భావిస్తున్నారు. ముఖ్యంగా జిల్లాస్థాయిలో కలెక్టర్లు, ఎస్పీలు ఒకేసారి రెండు పనులను చేయాల్సిరావడం ఒత్తిడితో కూడుకున్నదిగా అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో పోలీసు బందోబస్తు విషయంలో సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని అంటున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కౌంటింగ్, పోలింగ్ ఒకేసారి చేపట్టడం అసాధ్యమని అంటున్నారు.
ఈ పరిస్థితుల్లో జడ్పీ ఎన్నికలను ఒకటి రెండు రోజులు వాయిదా వేయకతప్పదని అంటున్నారు. సుప్రీంకోర్టు సూచనలతో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ నాలుగు రోజులు పొడిగించినట్లు జడ్పీ, మండల పరిషత్ ఎన్నికలను నాలుగు రోజులు పొడిగిస్తే బాగుంటుందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. లేనిపక్షంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సివస్తుందని భయపడుతున్నాయి. అయితే ఈ విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆలోచన ఏంటో తెలియాల్సివుంది. ఇప్పటికే ఈ అంశం రాష్ట్ర ఎన్నికల సంఘం పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం జడ్పీ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. శుక్రవారంతో ఈ ప్రక్రియ ముగియనుందని, ఒకటి రెండు రోజులలో పరిషత్ ఎన్నికల విషయంలో ఎస్ఈసీ నిర్ణయం తీసుకోవచ్చునని అంటున్నారు.
