Begin typing your search above and press return to search.

జైలుకెళ్ళొచ్చిన నేతలు...వైసీపీలో అదే చర్చ

వైసీపీ విపక్షంలో ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది.

By:  Satya P   |   30 Jan 2026 8:15 AM IST
జైలుకెళ్ళొచ్చిన నేతలు...వైసీపీలో అదే చర్చ
X

వైసీపీ విపక్షంలో ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. దానికి కారణం అసెంబ్లీలో కేవలం 11 సీట్లు మాత్రమే ఉండడం మరో వైపు బలమైన నేతలు అంతా సైలెంట్ మోడ్ లో ఉండడం, ఫైర్ బ్రాండ్ గా ఉన్న నేతలు జైళ్ళకు పోవడం ఇలా వైసీపీకి ఎన్నడూ చూడని కష్టాలు పట్టి పీడిస్తున్నాయి. మరో వైపు చూస్తే 2014లో వైసీపీలో ఉన్న కదనోత్సాహనికి ఇప్పటి పరిస్థితులకు భారీ తేడా ఉంది. నాడు జైలు బాధలు అయితే లేవు, అధినేత నుంచి క్యాడర్ వరకూ అంతా దూకుడుగా ఉండేవారు అని అంటున్నారు.

ఇరవై నెలల కాలంలో :

గడచిన ఇరవై నెలల కాలంలో వైసీపీ నుంచి కీలక నేతలు ఫైర్ బ్రాండ్ అనదగిన వారు అంతా జైలుకు వెళ్ళారు. చాలా మంది అయితే నెలల తరబడి అక్కడే ఉన్నారు, ఎన్నో సార్లు బెయిల్ పిటిషన్ కొట్టేసిన తరువాత చివరికి వారికి బెయిల్ లభించింది. అలా బయటకు వచ్చిన వారు మొదట జగన్ ని కలుస్తున్నారు. మీడియా ముందు గట్టిగా మాట్లాడుతున్నారు. ఆ మీదట చూస్తే ఫుల్ సైలెంట్ అయిపోతున్నారు. ఇదీ వైసీపీలో కనిపిస్తున్న పరిస్థితిగా ఉంది అని అంటున్నారు.

వీరంతా జైలుకే :

వైసీపీలో మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, జోగి రమేష్, లోక్ సభలో వైసీపీ నేత మిధున్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మాజీ ఎంపీ నందిగం సురేష్ ఇంకా అనేక మంది జైలు పాలు అయ్యారు, వీరు జైలు నుంచి బయటకు వచ్చినపుడు మీడియా ముందు కూటమి ప్రభుత్వం మీద ఫుల్ ఫైర్ అయ్యారు. అయితే మాజీ ఎంపీ నందిగం సురేష్ సైలెంట్ అయ్యారు అని అంటున్నారు. వల్లభనేని వంశీ హైదరాబాద్ దాటి రావడం లేదు అని చెబుతున్నారు. కాకాణి అయితే తన విమర్శలను మీడియా ముందు కొనసగిస్తున్నారు.

జగన్ కోసమే అంటూ :

ఇక తాజాగా జోగి రమేష్ చెవిరెడ్డి కూడా బెయిల్ మీద విడుదల అయ్యారు. ఈ ఇద్దరూ కూడా మీడియా ముందు భీషణ ప్రతిజ్ఞలు చేశారు. జోగి రమేష్ తనదైన ఫైర్ బ్రాండ్ వైఖరితో ఇక మీదట మళ్లీ తాను పూర్తి స్థాయి జోష్ తో జనంలో ఉంటాను అని చెప్పారు. చెవిరెడ్డి అయితే జగన్ కోసమే తాను బతికి ఉన్నాను అంటూ ఎమోషనల్ అయ్యారు. ఇక రేపటి నుంచి వీరి యాక్టివిటీస్ ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉందని అంటున్నారు.

రెడ్ బుక్ అంటూ విమర్శలు :

ఇంకో వైపు చూస్తే మాజీ మంత్రి పేర్ని నాని మీద అనేక సెక్షన్లతో కేసులు ఫైల్ చేశారు రెడ్ బుక్ లో తన పేరు ఉందో లేదో లోకేష్ ని అడగాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్టేట్మెంట్ ఇచ్చారు. రెడ్ బుక్ అంటే తనకు ఏ భయమూ లేదని ఆయన గట్టిగా చెప్పారు. మరి ఈ ఇద్దరితో ఎవరి మీద అరెస్టులు ఉంటాయన్నది చర్చగా ఉంది. అయితే జైలుకెళ్ళొచ్చిన నేతలల్లో ఎక్కువ మంది జనంలోకి రాకపోవడంతో పాటు చాలా మంది సీనియర్లు ఇంకా గ్రౌండ్ లోకి దిగడానికి డౌట్లు వ్యక్తం చేయడంతో రెడ్ బుక్ ప్రభావం వైసీపీ మీద గట్టిగానే ఉందని అంటున్నారు.

లోకేష్ కొసమెరుపు :

ఈ మధ్యనే లోకేష్ ఒక మీటింగులో మాట్లాడుతూ రెడ్ బుక్ లో కేవలం మూడు పేజీలే అయ్యాయని ఇంకా చాలా పేజీలు ఉన్నాయని చెప్పడంతో వైసీపీ నేతలలో గుబులు మొదలైంది అని అంటున్నారు. జైలుకు వెళ్ళి బెయిల్ మీద వచ్చినా ఎందుకొచ్చిన ఈ బాధలు అన్నీ అనుకుంటూ చాలా మంది వైసీపీ నేతలు వెనక్కి తగ్గుతున్నారు అని అంటున్నారు. దాంతో జైలుకి వెళ్ళి నిప్పులా తిరిగి వచ్చి కూటమి మీద రెట్టించిన ఉత్సాహంతో ఫైర్ అవుతారు అనుకున్న వారు నెమ్మదించడంతో జైలు భయాలు వైసీపీకి అలాగే ఉన్నాయా అన్న చర్చ సాగుతోంది. అదే సమయంలో వైసీపీ హయాంలో టీడీపీ ఇతర నేతల మీద కేసులు పెట్టి జైలుకు పంపిస్తే వారు ఆ తరువాత పూర్తిగా జనంలోనే ఉంటూ కసిగా పనిచేసిన వైనాన్ని కూడా అంతా గుర్తు చేస్తున్నారు. దీంతో వైసీపీకి రావాల్సిన ఫైర్ ఇంకా రావడం లేదని చర్చ అయితే సాగుతోంది.