Begin typing your search above and press return to search.

మైసూర్ పాక్ లో మైసూర్ లేదుగా...ఫ్రీ బస్సులో ఫ్రీ లేదా ?

మైసూర్ పాక్ లో మైసూర్ లేదుగా...ఫ్రీ బస్సులో ఫ్రీ లేదా ఇది ఇదే మాట సెటైరికల్ గా అంతటా గట్టిగా వినిపిస్తోంది.

By:  Satya P   |   12 Aug 2025 8:00 PM IST
మైసూర్ పాక్ లో మైసూర్ లేదుగా...ఫ్రీ బస్సులో ఫ్రీ లేదా ?
X

మైసూర్ పాక్ లో మైసూర్ లేదుగా...ఫ్రీ బస్సులో ఫ్రీ లేదా ఇది ఇదే మాట సెటైరికల్ గా అంతటా గట్టిగా వినిపిస్తోంది. సోషల్ మీడియాలో అయితే దీనినే అంతా ప్రచారం చేస్తున్నారు. దాంతో తెగ వైరల్ అవుతోంది. ఏపీలో ఉచిత బస్సు ఎన్ని రూట్లు తిరిగిందో. అలాగే ఎన్ని మలుపులు తిప్పారో కదా అని అంటున్నారు. తీరా చూస్తే ఎక్కడ ఉన్న వారికి అక్కడే అన్నట్లుగా ఈ ఫ్రీ బస్సు వ్యవహారం ఉంది అని అంటున్నారు.

ఉచితమేనా అవునా :

ఉచిత బస్సు పధకాన్ని మహిళల కోసం ఈ నెల 15న ఆర్భాటంగా ప్రారంభించబోతున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ ఉచితం ఎంత వరకూ దాని కధా కమామీషు ఏంటి అంటే భలే చిత్రంగా ఉంది అంటున్నారు. ఉచిత బస్సు పేరుతో ఎన్నీ కండిషన్లు ఎన్నెన్నో ఆంక్షలు పెట్టారు. అసలు చాలా బస్సులను ఉచితం నుంచి మినహాయించారు. గట్టిగా పదీ పాతిక కిలోమీటర్లు తిరగని బస్సులను కేటాయించి రాష్ట్రమంతా తిరగండి పండుగ చేసుకోండి అంటున్నారు. దాంతోనే ఉచిత బస్సు మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

పల్లె వెలుగులో ఎందాక :

పల్లె వెలుగు బస్సులలో ఉచితం అంటున్నారు. అవి ఎంతదాకా పోతాయో తెలిసిందే. పైగా అవి వెళ్ళినా కూడా ఏ పొద్దు నుంచి ఏ పొద్దుకు గమ్యానికి చేరుస్తాయో కూడా తెలియని స్థితి అంటున్నారు. అలాగే మెట్రో బస్సులు సిటీలో ఉచితం అన్నారు అవి ఎన్ని ఉన్నాయి అన్నది మరో చర్చ. అవి కూడా పరిమితమైన గమ్య స్థానాలలోనే జనాలను చేరుస్తాయని అంటున్నారు. అదే విధంగా సిటీ బస్సులు ఇతర బస్సులలో ప్రయాణం అంటే గుడు గుడు గుంచం అన్నట్లుగా ఉన్న చోటనే అటు నుంచి ఇటు తిరగాలా అని మహిళా జనాల నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతోంది.

తిరుమలకు గోవిందా :

ఉచిత బస్సు అది కూడా రాష్ట్రమంతా మీకు నచ్చిన చోటకు వెళ్ళవచ్చు అని ఎన్నికల వేళ ఊదరగొట్టారు. తీరా ఆ ఉచిత బస్సు కదలడానికి ఏకంగా పదనాలుగు నెలలు పాలన పూర్తి కావచ్చింది మరి ఇంత కసరత్తు చేసి ఇన్ని రకాలుగా అధ్యయనం చేసినా కూడా ఉచిత బస్సుల విషయంలో చివరికి తిరుమలకు సైతం పోలేని స్థితి అని అంటున్నారు. తిరుపతికి వెళ్ళాలి అనుకుంటే పది బస్సులు మారి మరి పట్టుదలగా రోజుల తరబడి ప్రయాణిస్తే తప్ప కుదరదని అంటున్నారు. తీరా తిరుపతి చేరుకున్నాక అటు నుంచి తిరుమలకు వెళ్ళాలంటే మళ్ళీ టికెట్ తీయాల్సిందే అంటున్నారు. అంటే ఏడుకొండల వాడిని దర్శించుకోవాలంటే తిరుమలకు వెళ్ళే బస్సులలో టికెట్ చార్జి చెల్లించాల్సిందే అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఫ్రీ బస్సుతో కస్సుబుస్సు :

ఉచిత బస్సు అన్నారు అని ఆశపడితే పల్లీ వెలుగు బస్సులు గ్రామీణ బస్సులలో గమ్యానికి చేరుకోమంటున్నారు అని మహిళా జనాలు కస్సుబుస్సు మంటున్నారు. ఉచిత బస్సుని ఏపీఎస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో నడిచే అన్ని సర్వీసులకూ వర్తింపచేస్తేనే ఇచ్చిన హామీకి సార్ధకత చేకూరినట్లు అని అంటున్నారు. అంతే కాకుండా జనాలకు కూడా పూర్తి సంతృప్తి చేకూర్తుందని అంటున్నారు. ఉచిత బస్సు పధకం మీద కోటి ఆశలు పెంచుకున్న వారికి శతకోటి ఆంఖలు పెట్టి నడుపుతున్న ఈ ఫ్రీ బస్సు గమ్యానికి చేరడం కష్టమే అని పెదవి విరుస్తున్నారు. మరి కూటమి పెద్దలు దీని మీద పునరాలోచన చేస్తారా ఉచిత బస్సుని మొత్తం అన్ని సర్వీసులకు వర్తింపచేస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.