Begin typing your search above and press return to search.

ఫోన్ టార్చ్‌లైట్లతో ఉద్యోగుల భారీ నిరసన !

ఏపీలో కొత్త ఉద్యోగ వ్యవస్థగా గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి వైసీపీ ప్రభుత్వం 2019లో లక్షా ముప్పై వేల మందితో భారీ నియామకాలను చేపట్టింది.

By:  Satya P   |   27 Sept 2026 8:27 PM IST
ఫోన్ టార్చ్‌లైట్లతో  ఉద్యోగుల భారీ నిరసన  !
X

ఏపీలో కొత్త ఉద్యోగ వ్యవస్థగా గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి వైసీపీ ప్రభుత్వం 2019లో లక్షా ముప్పై వేల మందితో భారీ నియామకాలను చేపట్టింది. వారికి జాబ్ చార్ట్ అన్నది అప్పట్లోనే ఖరారు చేయలేదని విమర్శలు ఉన్నాయి. కేవలం పౌర సేవల కోసమే ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లుగా ప్రచారంలో ఉంది. అయితే ఏడేళ్ళుగా ఈ ఉద్యోగులు అంతా త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. తాము ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించ బడడం లేదన్న తీవ్ర అసంతృప్తి వారిలో ఉంది. అదే విధంగా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల కంటే ఒక మెట్టు పైన ఉన్నారు, అదే సమయంలో పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగులు కాలేకపోతున్నారు. దాంతో ఇన్నాళ్ళుగా ఉన్న అసంతృప్తి ఒక్కసారిగా పెల్లుబుకింది. దాంతో విజయవాడ వేదికగా ఏపీలోని మొత్తం వార్డు గ్రామ సచివాలయ ఉద్యోగులు భారీ నిరసనలు చేపట్టారు. పోలీసుల నిర్బంధనాల మధ్యనే రోజంతా సాగిన ఈ నిరసనలు ఏపీని ఆకర్షించాయి.

వుయ్ వాంట్ జస్టిస్ :

అదే సమయంలో వియ్ వాంట్ జస్టిస్ అంటూ సచివాలయ ఉద్యోగులు అంతా పొద్దుపోయినా నిరసనలు చేపట్టడం విశేషం. ఏకంగా ఉద్యోగులు సెల్‌ఫోన్ టార్చ్‌లైట్లు ఆన్ చేసి మరీ ఆ వెలుగులోనే ఆందోళన నిర్వహించారు. అంతే కాదు తమ డిమాండ్లు మొత్తం నెరవేరేవరకూ తాము పోరాటం కొనసాగిస్తామని కూడా స్పష్టం చేస్తున్నారు. తమతో వెట్టి చాకిరి చేయిస్తున్నారు అని కనీసంగా కూడా అవకాశాలు పదోన్నతులు లేవని వాపోతున్నారు. సెలవులు పండుగలు కూడా తమకు లేవని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు కూడా పీఆర్సీ అమలు చేయాలని పదోన్నతులు కల్పించాలని విధి విధానాలను స్పష్టంగా ఖరారు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విధంగా విజయవాడలో ఏకంగా పదకొండు గంటల పాటు ఉద్యోగుల ధర్నా సాగింది. మరో వైపు విజయవాడలో ఆందోళనలో పాల్గొన్న వారిని అరెస్ట్‌ చేసిన పోలీసులు వారిపై కేసులు పెట్టొద్దని సచివాలయ ఉద్యోగుల సంఘం డిమాండ్‌ చేసింది. అలాగే ఇప్పటిదాకా ఉద్యోగుల మీద విధించిన సస్పెన్షన్‌లు ఎత్తేయాలని సచివాలయ ఉద్యోగులు కోరుతున్నారు.

ఎట్టకేలకు జూనియర్ క్యాడర్ :

ఏడేళ్ళ సర్వీసు, విలువైన కాలం అంతా గడిపిన తరువాత భారీ ఉద్యమం నేపధ్యంలో సచివాలయ ఉద్యోగులకు ఎట్టకేలకు జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ కి పదోన్నతి లభించింది. ఇప్పటిదాకా ఈ క్యాడర్ కి సైతం దూరంగా వారు ఉండిపోయారని అంటున్నారు. గతంలోనే ఈ ప్రమోషన్లు ఇస్తే ఇపుడు సీనియర్ అసిస్టెంట్ కూడా దాటి మరింత ముందుకు తమ కెరీర్ సాగేదని అంటున్నారు. జీతాలు కూడా కేవలం పాతిక ముప్పయి వేలుగానే ఉండడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జాబ్ చార్ట్ తో పాటు తమ వేతనాలను సవరించాలని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తమను కూడా ట్రీట్ చేస్తూ అన్ని సదుపాయాలు వర్తింపచేయాలని వార్డు గ్రామ సచివాలయ ఉద్యోగులు కోరుతున్నారు.

నెరవేరేనా :

ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కొలువులు అయితే తక్కువగానే ఉన్నాయి. ఇపుడు 800 పై చిలుకు పోస్టులను జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ గా కొత్తగా సృష్టించి అందులో అర్హత కలిగిన సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్స్ ఇవ్వాలని కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు దాదాపుగా ఆరు లక్షల మంది ఉన్నారు. ఇక ఏపీలో వివిధ ప్రభుత్వ వివిధ శాఖలు ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య అధికారిక లెక్కల ప్రకారం సుమారు 2.40 లక్షల నుండి 3.5 లక్షల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఇపుడు సచివాలయ ఉద్యోగులు మరో లక్షా ముప్పయి వేల మంది దాకా ఉన్నారు. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా తమ సేవలను క్రమబద్ధీకరించమంటున్నారు. సచివాలయ ఉద్యోగులు కూడా వారి కంటే కాస్తా ఒక మెట్టు పైన ఉన్నప్పటికీ తమకు ఏ రకమైన సదుపాయాలు లేవని వాపోతున్నారు. దీంతో ఏపీలో ప్రభుత్వ శాఖలలో ఖాళీలు ఎన్ని ఉన్నాయి, అవసరాలు ఎంత ఇలాంటి విషయాల మీద మరో మారు కూలంకషంగా చర్చకు ఈ పరిణామాలు తావిస్తున్నాయి.