ఈ తప్పులేంది మహా ప్రభు? ఉగాది ఆహ్వాన పత్రికలో బూతులు
చివరకు మంత్రుల పేర్లు మాత్రమే కాదు వారు నిర్వహించే శాఖల వివరాల్ని తప్పుల తడకతో అచ్చేయటం చూస్తే.. వీరి నిర్లక్ష్యం పీక్స్ కు చేరిందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.
By: Garuda Media | 18 March 2026 9:15 AM ISTఆ శాఖ పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి. ఇంత బరువుగా.. భారీ పేరున్న శాఖ చేసే పనేమిటంటే.. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని.. కళలను, చేతిపనులను ప్రోత్సహించటం. ఉగాది.. ఇతర ప్రభుత్వ ఉత్సవాలను నిర్వహించడం.. కళాకారులకు పురస్కారాల్ని అందించటం.. జానపద కళల్ని పునరుద్ధరించటంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా సృజనాత్మకతను వెలికితీయటం లాంటివి చేయాలి. అలాంటి శాఖ ఎంత జాగ్రత్తగా పని చేయాలి. మిగిలిన పనుల సంగతి ఎలా ఉన్నా.. ఉగాది సందర్భంగా ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించిన ఆహ్వానపత్రిక తయారీ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ.. అలాంటివేమీ చేయకుండా.. ముద్రా రాక్షసాలతో తయారైన ఆహ్వానపత్రికను చూస్తే.. మరీ ఇంత నిర్లక్ష్యమా? అన్న ఆగ్రహం కలగటం ఖాయం.
చివరకు మంత్రుల పేర్లు మాత్రమే కాదు వారు నిర్వహించే శాఖల వివరాల్ని తప్పుల తడకతో అచ్చేయటం చూస్తే.. వీరి నిర్లక్ష్యం పీక్స్ కు చేరిందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. ఆహ్వానపత్రికను రూపొందించిన వారికి ప్రస్తుతం పదవుల్లో ఉన్న వారు ఎవరు? పదవుల నుంచి వైదొలిగిన వారి పేర్లు కూడా తెలీవా? అన్న ప్రశ్న తలెత్తుతుంది. చివరకు ‘సంవత్సరం’ అనే పదాన్ని సైతం సరిగా రాయలేని తీరు చూస్తే.. ఈ శాఖలోని వారి పనితీరు ఎంత చక్కగా ఉందో అర్థం చేసుకోవచ్చు
పరాభవ నామ సంవత్సరం అని రాయాల్సిన చోట.. ‘‘సంవత్సరు’’ అని పేర్కొన్న వైనం చూస్తేనే.. ఈ ఆహ్వానపత్రిక తయారీ విషయంలో సంబంధిత అధికారులు ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోలేదని చెబుతున్నారు. పదవీ కాలం ముగిసి చాలా కాలం అయినప్పటికి పి.అశోక్ బాబు, కేఎస్ లక్ష్మణరావు పదవీ కాలం ముగిసినా ఆహ్వానపత్రికలో వారు పేర్లు ముద్రించటంతో పాటు.. వారిని ప్రస్తుత ఎమ్మెల్సీలుగా పేర్కొనటం చూస్తే.. వీరి పని తీరు ఎలా ఉందన్నది అర్థమవుతుంది.
అంతేకాదు.. మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇంటి పేరు మండిపల్లి అయితే ఇన్విటేషన్ కార్డు మీద ‘మందపల్లి’ అని రాయగా.. శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ జకియా ఖానమ్ పేరును ‘జకియా ఖానవ్’గా ఉప సభాపతి రఘురామ క్రిష్ణరాజు అయితే.. ‘రఘురామ క్రష్ణంరాజు’ గా పేర్కొనటం చూస్తే.. ఉగాది ఆహ్వాన పత్రిక తయారీలో కనీస జాగ్రత్తలు తీసుకోలేదన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. ఇంతటి ముద్రారాక్షసాలు ఉన్న ఆహ్వానపత్రిక ఇటీవల కాలంలో మరెప్పుడూ పబ్లిష్ కాలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మరింత దారుణమైన అంశం ఏమంటే మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి నిర్వహిస్తున్న శాఖల్లో స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు శాఖ ఒకటిఅయితే.. దాని పేరును సచివాలయం. గ్రామ వాలంటీర్ శాఖగా మార్చిన ఘనత వీరికి సొంతం. అంతేకాదు.. కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కాగా.. దాన్ని స్వచ్ఛాంధ్ర కమీషన్ ఛైర్మన్ గా ముద్రించటం విశేషం. ఇన్ని తప్పులతో ఆహ్వానపత్రికను ప్రింట్ చేసిన తర్వాత తప్పుల్ని ఎత్తి చూపిన వేళ. దీనిపై గట్టిగా చెంపలు వేసుకొని.. తప్పు అయ్యింది.. క్షమించాలని కోరితే బాగుండేది. అందుకు భిన్నంగా.. ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా విషయాన్ని పక్కకు పెట్టేసిన వైనం చూస్తేనే.. చేసిన తప్పును నిజాయితీగా ఒప్పుకునే గుణం కూడా లేదన్న విషయం స్పష్టమవుతుంది. ఈ తరహా తప్పుల్ని.. నిర్లక్ష్యాలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు వెళుతున్నాయా? అన్నది ప్రశ్న.
