కౌలు రైతులకు కూటమి సర్కార్ ఊహించని గుడ్ న్యూస్!
ఏపీలో కూటమి సర్కార్ తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంది! ఈ సమయంలో రాష్ట్రంలో కౌలు రైతుల విషయంలో కీలక నిర్ణయం తీసుకొందని తెలుస్తోంది.
By: Raja Ch | 17 Oct 2025 9:41 AM ISTఏపీలో కూటమి సర్కార్ తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంది! ఈ సమయంలో రాష్ట్రంలో కౌలు రైతుల విషయంలో కీలక నిర్ణయం తీసుకొందని తెలుస్తోంది. ఇందులో భాగంగా... రాష్ట్రంలో కౌలు రైతులకు విశిష్ట గుర్తింపు సంఖ్య (యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ - యూఐఎన్) ను జారీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇది కచ్చితంగా కౌలు రైతులకు పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
అవును... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కౌలు రైతులకు యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ను జారీ చేసేందుకు సర్కార్ సన్నాహాలు చేస్తోంది. దీని ద్వారా భూములున్న రైతులతోపాటే కౌలు రైతులకు కూడా వివిధ రాయితీ పథకాలు, ప్రయోజనాలు పొందే వీలుంటుంది. దీంతో కూటమి సర్కార్ తీసుకొన్న ఈ నిర్ణయం కౌలు రైతుల పాలిట గొప్ప వరంగా చెబుతున్నారు. ఇది వారికి ఎంతో ఉపశమనం కలిగించే విషయం అని అంటున్నారు.
వాస్తవానికి ఇప్పటి వరకు భూములున్న రైతులకే కేంద్ర ప్రభుత్వం యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇస్తోంది. వెబ్ లాండ్ ఆధారంగా రైతుల భూముల వివరాలను అనుసంధానం చేస్తోంది. ఈ క్రమంలో... సీఎం చంద్రబాబు సూచనలకు అనుగుణంగా కౌలు రైతుల గుర్తింపు సంఖ్య జారీపై వ్యవసాయశాఖ దృష్టి పెట్టింది. ఈ మేరకు గురువారం సచివాలయంలో జరిగిన సమావేశంలో వీటిని ఖరారు చేశారు.
ఈ సందర్భంగా స్పందించిన వ్యవసాయశాఖ ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్.. దేశంలోనే మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లోనే దీనికి సంబంధించిన విధానాలు రూపొందించామని పేర్కొన్నారు. దీని ద్వారా కౌలు రైతులు కూడా భూములున్న వారితో సమానంగా సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందే వీలుంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో... పంట సాగుదారుల హక్కుల కార్డు (సీ.సీ.ఆర్.సీ) ఉన్న రైతులు గడువులోగా ఈ-పంటలో నమోదు చేసుకోవాలి.
‘రైతు నేస్తం’ పురస్కారాలు-2025:
మరోవైపు... 'రైతు నేస్తం' 21వ వార్షికోత్సవం సందర్భంగా ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఐవీ సుబ్బారావు పేరిట వ్యవసాయ రంగంలో విశేష కృషి చేసిన వారికి 'రైతు నేస్తం' పురస్కారాలు-2025 ప్రదానం చేయనున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ నెల 26న రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ లో ఉన్న స్వర్ణ భారత్ ట్రస్ట్ లో ఈ కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు.
