తెలుగు స్టేట్స్ వాటర్ వార్... కేంద్రం సెటిల్ చేస్తుందా ?
అయితే కేంద్రం పెద్దన్నగా కమిటీలు ఏర్పాటు చేసినా రెండు రాష్ట్రాల సీఎంలను కీలక అధికారులను కూర్చోబెట్టి చర్చించినా కూడా ఈ జల జగడాలు ఒక కొలిక్కి అయితే రావడం లేదు అని అంటున్నారు.
By: Satya P | 4 Jan 2026 1:00 AM ISTఉమ్మడి ఏపీ రెండుగా మారింది. అది జరిగి మరో ఆరు నెలలలో పన్నెండేళ్ళు పూర్తి అవుతుంది. అయినా సరే నీటి వివాదాలు మాత్రం ఇంకా కొత్త కొత్తగా రాజుకుంటూనే ఉన్నాయి. ఆ వేడి సెంటిమెంట్ గా మారి సెటిల్ మెంట్ కి ఏ మాత్రం అవకాశం లేకుండా చేస్తోంది. దాంతో కీలకమైన నదీ జలాల పంపిణీ విషయంలో అటు ఆంధ్రా ఇటు తెలంగాణా రాష్ట్రాలు తమ హక్కులు అంటూ పోరాడుతున్నాయి. పేచీలు పడుతున్నాయి. పంచాయతీలు కూడా పెడుతున్నాయి. ముఖ్యంగా చూస్తే తెలుగు నాట గోదావరి కృష్ణా నదీ జలాల విషయంలోనే ఈ పోరు ఎక్కువగా సాగుతోంది. ఈ నదీ జలాలలో ఎవరి వాటా ఏమిటి ఎంత అన్నదే ఎటూ తేలని విషయంగా మారుతోంది.
కొత్త ప్రాజెక్టుల విషయం :
నిజానికి చూస్తే రాష్ట్రం రెండుగా మారిన తర్వాత కొత్త నీటి ప్రాజెక్టుల మీద రెండు రాష్ట్రాలూ దృష్టిని పెట్టాయి. పెరిగిన అవసరాలు కనిపిస్తున్న అవకాశాలు ప్రజలకు ఇచ్చిన హామీలు వెరసి కొత్తగా ప్రాజెక్టుల నిర్మాణానికి కారణం అవుతున్నాయి. అయితే కొత్త ప్రాజెక్టులు అంటే నికర జలాలు ఎంత మిగులు జలాలు ఎన్ని సముద్రంలో కలిసేవి ఎన్ని అన్నది తేలాల్సి ఉంది. ఉమ్మడి ఏపీగా ఉన్నపుడు కృష్ణా గోదావరి జలాల విషయంలో వాటాలు నిష్పత్తులు ఇపుడు పక్కన పెట్టి కొత్తగా తమకు అధిక వాటా కావాలని తెలంగాణా కోరుతోంది. అదే సమయంలో గతంలో ఉన్న మాదిరిగానే నిష్పత్తి ప్రకారం పంపిణీ చేయాలని ఏపీ అంటోంది. ఇక సముద్రంలో కలిసే వృధా నీరు దిగువ రాష్ట్రంగా తామే వాడుకుంటామని అది ఎటూ వేస్ట్ అయ్యేదే కదా అన్నది ఏపీ వాదన. అలా సాగరంలో కలిసే నీటి నుంచి కొంత వరకూ తీసుకుని బనకచర్ల వంటి ప్రాజెక్టులు కొత్తగా కట్టుకుంటామని ఏపీ అంటోంది.
ఈ లెక్క తేలాల్సిందే :
అయితే అలా కుదిరేదే లేదని తెలంగాణా అంటోంది. తెలంగాణాలో కొత్త ప్రాజెక్టులు ఏవీ కట్టలేదు కాబట్టే నీరు వృధాగా వెళ్ళి సముద్రంలో కలుస్తోంది తప్ప తమకు కేటాయించిన ప్రకారం ప్రాజెక్టులు కడితే అపుడు ఇంకా ఎంత మిగులు జలాలు ఉన్నాయి ఎన్ని వృధా జలాలు ఉన్నాయని లెక్క తీసి మరీ చూసుకోవాలని తెలంగాణా అంటోంది. ఇక సముద్రంలో కలిసే నీటిలో కూడా తెలంగాణా వాటా ఉందని ఆ రాష్ట్రం వాదిస్తోంది. ఇక ఇప్పటికే కేటాయింపులు జరిగిన చోట్లలో కూడా తమకు తెలియకుండా అక్రమంగా నీటిని తరలించుకుని పోతున్నారు అన్నది కూడా రాష్ట్రాల మధ్య మరో పేచీ వ్యవహారంగా ఉంది. దీని మీద కూడా కేంద్రాన్ని పెద్దన్నగా ఉండి తేల్చాలని రెండు రాష్ట్రాలూ కోరుతూ వస్తున్నాయి.
దశాబ్దాల నాటి ముచ్చట :
ఇదిలా ఉంటే కృష్ణా గోదావరి జలాల విషయంలో ఉమ్మడి ఏపీగా ఉన్నప్పటి నుంచి వివాదాలు ఉన్నాయి. కర్ణాటక మహారాష్ట్ర ఏపీలో మధ్య నీటి పంచాయతీలు ఎన్నో సార్లు జరిగాయి. విభజన తరువాత అది ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సరికొత్తగా నీటి చిచ్చు పెడుతోంది. ఇక తెలంగాణా డిమాండ్ ఏమిటి అంటే గోదావరి క్రిష్ణా ఉమ్మడి ఏపీ అలా మూడు రాష్ట్రాల మధ్య నదీ జలాల ఒప్పందాలు ఉన్నాయి, కానీ ఇపుడు తెలంగాణా ఒక రాష్ట్రంగా ఏర్పాటు అయింది కాబట్టి తమను కూడా చేర్చి నాలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీ చేయమని అంటోంది. అయితే దీనిని మహారాష్ట్ర కర్ణాటక రెండూ వ్యతిరేకిస్తున్నాయి. ఇక విభజన తరువాత చూస్తే క్రిష్ణా జలాల వాటాలో ఏపీకి 66 శాతం, తెలంగాణాకు 34 శాతం వాటాను ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనిని చెరి యాభై శాతం కావాలని తెలంగాణా డిమాండ్ పెడుతోంది. మరో వైపు శ్రీశైలం జలాశయంలో తెలంగాణా విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని ఎక్కువగా వినియోగిస్తోంది అని దీని వల్ల ఏపీలో సాగునీటి అవసరాలకు ఇబ్బంది అవౌతోంది అన్నది ఏపీ వాదనగా ఉంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ వంటి ఉమ్మడి ప్రాజెక్టుల విషయంలో ఏపీ తెలంగాణా ఎపుడు ఎలా ఎంత నీటిని వాడుకోవాలి అన్న దాని మీద ఈ రోజుకీ ఒక పరిష్కారం అయితే లేదు, వివాదాలు మాత్రం అలాగే జరుగుతున్నాయి.
అనుమానాలతోనే :
ఇక ఏపీ పట్టిసీమ పులిచింతల వంటి ప్రాజెక్టుల ద్వారా తమకు రావాల్సిన దాని కంటే ఎక్కువ నీటిని మళ్ళించుకుంటోంది అని తెలంగాణా వైపు నుంచి అనుమానాలు అభ్యంతరాలు ఉన్నాయి. అయితే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ స్కీం తో తెలంగాణా నీటిని ఎక్కువగా వాడుకుంటోంది అన్నది ఏపీ వైపు నుంచి ఉన్న ఆరోపణ. ఇలా ఆరోపణలు అటూ ఇటూ ఉన్నాయి. ఇవన్నీ క్రిష్ణా జలాల మీద గొడవలు అయితే గోదావరి విషయం చూస్తే ఏపీకి 65 శాతం, తెలంగాణాకు 35 శాతం నీటి వాటాలుగా నిర్ణయించారు. గోదావరి మీద ఏపీ పోలవరం ప్రాజెక్ట్ నిర్మిస్తోంది. అయితే దీని వల్ల తమ రాష్ట్రంలో ముంపు ప్రాంతాలు పెరుగుతాయని తెలంగాణా విమర్శలు చేస్తోంది. అయితే ఇది జాతీయ ప్రాజెక్ట్ అని కేంద్రమే నిర్మిస్తోంది అని ఏపీ దానిని తిప్పికొడుతోంది.
బనకచర్ల మ్యాటర్ :
ఇక గోదావరి నీటిని క్రిష్ణాకు మళ్ళిస్తూ బనకచర్ల ప్రాజెక్ట్ ని ఏపీ నిర్మిస్తోందని తెలంగాణా మరో అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇక దీని మీద కూడా పంచాయతీలు ఢిల్లీ దాకా నడిచాయి. దాంతో ఏపీ అనేక సవరణలు చేసి నల్లమల సాగర్ గా పేరు మార్చి కేంద్రానికి కొత్త డీపీఆర్ ని పంపించింది. అయితే దాని మీద కూడా తెలంగాణా తీవ్ర అభ్యతరం వ్యక్తం చేస్తోంది. గోదావరి ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం 1480 టీఎంసీల నీళ్ళు మాత్రమే అనుమతి ఉందని అయితే అంతకంటే ఎక్కువగా ఏపీ నీటిని మళ్ళిస్తోందని తెలంగాణా ఆరోపిస్తోంది. ఇలా రాష్ట్రాల మధ్య తలెత్తుతున్న వివాదాల మధ్య కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న కీలక ప్రాజెక్టులు నిలిచి పోతున్నాయ్. మరో వైపు చూస్తే ప్రజలు రైతులు సాగు తాగు నీటి హక్కుని కోల్పోతున్నారు. ఇక కోర్టులలో కేసులు గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి స్టేలు తీసుకుని రావడం వల్ల ప్రాజెక్టుల నిర్మాణాలకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. దాంతో అంచనా వ్యయం కూడా ఏ ఏటికి ఏ ఏడు బాగా పెరిగిపోతోంది.
కేంద్రం కమిటీలతో :
అయితే కేంద్రం పెద్దన్నగా కమిటీలు ఏర్పాటు చేసినా రెండు రాష్ట్రాల సీఎంలను కీలక అధికారులను కూర్చోబెట్టి చర్చించినా కూడా ఈ జల జగడాలు ఒక కొలిక్కి అయితే రావడం లేదు అని అంటున్నారు. తాజాగా చూస్తే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ రెండు రాష్ట్రాల నదీ జలాల విషయంలో పాలనా పరంగా సాంకేతికపరంగా వివాదాలను పరిష్కరించాలని పూనుకుని ఒక కమిటీని అయితే ఏర్పాటు చేసింది. ఉన్నత స్థాయి కమిటీగా ఇది ఉండనుంది. 2025 జూలైలో ఢిల్లీలో జరిగిన రెండు రాష్ట్రాల సీఎంల సమావేశం తరువాత కేంద్రం ఈ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఏర్పాటు ద్వారా జల వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కేంద్రం భావిస్తోంది. ఈ కమిటీకి సీ డబ్ల్యూ సీ చైర్మన్ అధ్యక్షత వహిస్తారని అధికారికంగా ఉత్తర్వులు కూడా కేంద్రం జారీ చేసింది. ఈ కమిటీలో గోదావరి కృష్ణా రివర్ కమిటీల చైర్మన్లు అలాగే జాతీయ స్థాయిలోని వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీలు చీఫ్ ఇంజనీరు సీ డబ్ల్యూసీ చీఫ్ ఇంజనీర్ కూడా ఇందులో సభ్యులుగా ఉంటారు. అంతే కాదు తెలంగాణా ఏపీ నుంచి చెరి నలుగురు వంతున అధికారులు కూడా ఈ కమిటీలో ఉంటారు. వివాదాస్పద ప్రాజెక్టులు నీటి పంపకాల విషయంలో ఈ కమిటీ ఇచ్చే నివేదిక జల వివాదాలకు పూర్తిగా ముగింపు పలుకుతుందని అంటున్నారు.
రాజకీయ సెంటిమెంట్లు :
అయితే రాజకీయంగా సెంటిమెంట్లు జల జగడాల మధ్యన ఉన్నాయి. దాంతో కేంద్ర కమిటీ పరిష్కరించే విషయాలు రాజకీయంగా ఉన్న వివాదాలను సెంటిమెంట్లను ఏ మేరకు అధిగమించి ఒక కొలిక్కి తేగలవు అన్నదే ఇపుడు ప్రధాన చర్చగా ఉంది. ఏది ఏమైనా కేంద్రం జోక్యంతో ఈ జల వివాదాలు పూర్తిగా సమసిపోవాలని అంతా కోరుకుంటున్నారు.
